ఆగని హింసాత్మక ఘటనలు..
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ ఇంకా అట్టుడుకుతూనే ఉంది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్మన్ వాని ఎన్ కౌంటర్ లో మృతి చెందిన అనంతరం పోలీసులకు ఆందోళన కారులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అనంత్ నాగ్ జిల్లాలో ఆందోళన కారులు పోలీసు వాహనాన్ని జీలం నదిలోకి తోసేయడంతో డ్రైవర్ ఫిరోజ్ అహ్మద్ మృతి చెందారు. (చదవండి: భగ్గుమన్న కశ్మీరం)
ముందు జాగ్రత్త చర్యగా జమ్ముతో పాటు పాటు మరో నాలుగు జిల్లాల్లో రెండో రోజూ కర్ఫూ అమల్లో ఉంది. మెబైల్, ఇంటర్ నెట్ సేవలపైనా నిషేధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో 17 మంది మృతి చెందారు. 96 మంది భద్రతా సిబ్బందితో సహా 126 మంది గాయపడ్డారు. ఆందోళన కారుల సమ్మెతో దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పెట్రోల్ బంకులు తెరుచుకోకపోవడంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మనోవేదనను కల్గిస్తున్నాయి
జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర శోకాన్ని కలిగిస్తున్నాయని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆవేదనవ్యక్తం చేశారు. అసమాన శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ఆందోళనను అదుపుచేయాలని భద్రతా సిబ్బందిని ఆమె కోరారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్మన్ వాని తమపై దాడి చేయడానికి ప్రయత్నించినందుకే అతన్ని హతమార్చాల్సి వచ్చిందని ఆర్మీ అధికారులు తెలిపారు.
అమర్ నాథ్ యాత్ర పున:ప్రారంభం:
జమ్ముకశ్మీర్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో17 మంది మృతి, 200 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో అమర్ నాథ్ యాత్ర పై విధించిన నిషేధాన్ని తొలగించారు. సీఎం మెహబూబా ముఫ్తీతో ఫోన్లో మాట్లాడి శాంతి భద్రతలపై పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హాన్ ముజాఫర్ వానిని భద్రతా బలగాలు హతమార్చిన నేపథ్యంలో జరిగిన అల్లర్లలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు.