నేను క్రికెటర్‌ను.. హంతకుడ్ని కాను
పట్నా: తాను క్రికెటర్‌నని, చిన్నారులకు శిక్షణ ఇస్తున్నానని, జర్నలిస్టు రాజ్దేవ్ రంజన్ హత్యకేసులో తనకు సంబంధంలేదని వాంటెడ్ షార్ప్‌షూటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. తల్లిదండ్రులకు తాను ఒక్కడే సంతానమని, ఒక్కగానొక్క కొడుకుని ఎవరైనా నేరస్తుడిగా తయారు చేస్తారా అని చెప్పాడు.
సీనియర్ జర్నలిస్టు రంజన్ హత్య కేసులో కైఫ్ నిందితుడిగా ఉన్నాడు. జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ ఇటీవల బెయిల్‌పై విడుదలైనపుడు ఆయన పక్కన కైఫ్ కనిపించాడు. ఈ వీడియో వైరల్ కావడం సంచలనం కలిగించింది. పోలీసులు వెంటనే కైఫ్‌ను అరెస్ట్ చేయాలని రంజన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాగా రంజన్ హత్య కేసులో తన ప్రమేయమున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని కైఫ్ అన్నాడు. బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కుమారుడు తేజస్వి యాదవ్ తనలాంటి యువకులకు మార్గదర్శకుడని, ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లో రావాలని భావిస్తున్నట్టు కైఫ్ చెప్పాడు.