warangal lok sabha by poll
-
టి.టీడీపీలో కిరికిరి!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి సంబంధించి తెలంగాణ టీడీపీలో కిరికిరి మొదలైంది. ఈ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి బీజేపీ పోటీ చేసింది. కడియం శ్రీహరి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయ్యింది. ఈ నెలాఖరులోగా ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న సమాచారంతో టీటీడీపీలో రాజకీయం ఊపందుకుంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ఈ స్థానంలో తనకు పోటీ చే సే అవకాశం ఇవ్వాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తున్నారని తెలిసింది. ఎంపీగా గెలిస్తే, అత్యంత సీనియర్ అయిన మోత్కుపల్లికి ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కొచ్చని అంచనాలూ వేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చినా, ఆ పదవులు ఏపీ నుంచే ఉన్నాయి. ప్రస్తుతం ఒక మంత్రి తీరు వివాదాస్పదంగా ఉందని, ఆయనను తొలిగిస్తే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడి వారికి అవకాశం దక్కొచ్చన్న అంచనాలో ఉన్నారు. ఈ అంచనాతోనే వరంగల్ కోసం పట్టుబడుతున్నారని అంటున్నారు. టీడీపీ తరఫున మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తారని ఊదరగొట్టినా.. ఇంత వరకు అతీగతీ లేదు. దీంతో ఉప ఎన్నికలను అవకాశంగా భావిస్తున్న ఆయన తనకే చాన్స్ ఇవ్వాలని కొందరు నేతల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. సీనియర్లకు.. అడ్డంకులు! తెలంగాణ టీడీపీలో తక్కువ కాలంలో పెద్ద స్థాయికి చేరుకున్న కొందరు నాయకులు సీనియర్లకు మోకాలడ్డుతున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ కమిటీల నియామకాల్లో సీనియర్లకు ప్రాధాన్యం లభించలేదు. పార్టీలో జూనియర్ అయిన రేవంత్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, ఎస్సీ రిజర్వుడు స్థానమైన వరంగల్‌లో మోత్కుపల్లి వంటి సీనియర్లకు అవకాశం దక్కకుండా కొందరు జూనియర్లు కుయుక్తులు పన్నుతున్నారని అంటున్నారు. సీనియర్లకు అవకాశం కల్పిస్తే తమ ప్రాధాన్యం ఎక్కడ తగ్గిపోతుందోనన్న ముందుచూపుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని అంటున్నారు. వరంగల్ ఎంపీ స్థానాన్ని బీజేపీకే వదిలేద్దామని, ఇవ్వాళ కాకపోయినా, రేపైనా సనత్‌నగర్‌కు ఉపఎన్నిక తప్పదని, అక్కడే పోటీ చేద్దామని కొందరు ప్రతిపాదిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు తమకు సరైన అభ్యర్థి లేడని, వరంగల్ స్థానాన్ని టీడీపీకి వదిలేసి, సనత్‌నగర్‌కు ఉప ఎన్నిక జరిగితే తాము పోటీ చేస్తామని బీజేపీ కొత్త ప్రతిపాదన చేసిందని సమాచారం. ఒక దశలో వరంగల్ కోసం ఇరు పార్టీలూ పట్టుదలగా ఉన్నప్పుడు, సర్వే చేయించి ఎవరికి ఎక్కువ మద్దతుంటే ఆ పార్టీ బరిలోకి దిగాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ప్రతిపాదించినట్లు వినికిడి. పోటీపై ఇప్పటికీ ఇరు పార్టీల మధ్య స్పష్టత రాకున్నా, బీజేపీ, టీడీపీల్లో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. -
ఓరుగల్లును వదులుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ స్థానాన్ని టీడీపీకి వదిలేయడం మంచిదికాదని బీజేపీ నాయకత్వంపై వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే గుదిబండగా మారుతున్న ప్రస్తుతతరుణంలో వరంగల్ బరి నుంచి తప్పుకోవడం మంచిది కాదని పేర్కొంటున్నారు. గత సాధారణ ఎన్నికల్లో పొత్తులో భా గంగా ఇక్కడి నుంచి బీజేపీయే పోటీ చేసిం దని, ఇప్పుడు కూడా బరిలో దిగాలని వరంగల్ సహా అన్ని జిల్లాల నేతలు పట్టబడుతున్నారు. మంత్రి తలసాని రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు జరిగే సనత్‌నగర్ నుంచి పోటీచేసి, వరంగల్‌ను టీడీపీకి వదిలేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదేజరిగితే బీజేపీకి తెలంగాణలో తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. బీజేపీకే సానుకూలాంశాలు.... వరంగల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి అనేక సానుకూలాంశాలు ఉన్నాయని పార్టీ జిల్లాల నేతలు వాదిస్తున్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు కు బేషరతుగా మద్దతివ్వడం, అంతకుముందు ప్రత్యేక రాష్ర్ట ఉద్యమంలో జేఏసీతో మమేకమై ఉద్యమాలు నిర్వహించడం వల్ల ఉద్యమకారుల్లో బీజేపీపై సానుకూలత ఉందని వాదిస్తున్నారు. దీనికి తోడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి కోసం పలు పథకాలు కేటాయించిందని, వరంగల్‌ను వారసత్వ నగరంగా ప్రకటించడంతో నగర అభివృద్ధి కోసం ప్రతియేటా 50 కోట్లు నేరుగా అందుతాయని చెబుతున్నారు. అమృత పథకం, స్మార్ట్ సిటీ కింద కూడా వరంగల్ ఎంపికైంది. ఇదే కాకుం డా యాదగిరిగుట్ట నుంచి హన్మకొండ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి 1,900 కోట్లు కేటాయించింది. దేశంలో ఏ రహదారికీ ఇంత పెద్దమొత్తం కేటాయించిందని వారు వాదిస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికారంతో వరంగల్‌ను, తెలంగాణను అభివృద్ధి చేయవచ్చని ఓటర్లలో విశ్వాసం కల్పించవచ్చని నేతలు పట్టుబడుతున్నారు. సనత్నగర్కోసం వరంగల్ ఉప ఎన్నికలను బలిపెడితే బీజేపీ రాష్ట్ర పార్టీగా కాకుండా కేవలం జీహెచ్ఎంసీ పార్టీగా మిగిలిపోతుందని హెచ్చరించారు. నేడు త్రిసభ్య కమిటీ కసరత్తు వరంగల్ ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహం, నేతల మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. పార్టీ జాతీయనేత చంద్రశేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, గుజ్జుల రామకృష్ణా రెడ్డితో ఏర్పాటైన ఈ కమిటీ సోమవారం నుంచి కసరత్తును ప్రారంభించనుంది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, వివిధ రంగాల్లో పేరున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు, సామాజిక ఉద్యమనేతలు వరంగల్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. పార్టీ టికెట్ కోరుతున్న నేతలు, అభ్యర్థులతో త్రిసభ్య కమిటీ నేరుగా భేటీ కానుంది.