
టి.టీడీపీలో కిరికిరి!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి సంబంధించి తెలంగాణ టీడీపీలో కిరికిరి మొదలైంది. ఈ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి బీజేపీ పోటీ చేసింది. కడియం శ్రీహరి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయ్యింది. ఈ నెలాఖరులోగా ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న సమాచారంతో టీటీడీపీలో రాజకీయం ఊపందుకుంది.
పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ఈ స్థానంలో తనకు పోటీ చే సే అవకాశం ఇవ్వాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తున్నారని తెలిసింది. ఎంపీగా గెలిస్తే, అత్యంత సీనియర్ అయిన మోత్కుపల్లికి ఎన్‌డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కొచ్చని అంచనాలూ వేస్తున్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చినా, ఆ పదవులు ఏపీ నుంచే ఉన్నాయి.
ప్రస్తుతం ఒక మంత్రి తీరు వివాదాస్పదంగా ఉందని, ఆయనను తొలిగిస్తే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడి వారికి అవకాశం దక్కొచ్చన్న అంచనాలో ఉన్నారు. ఈ అంచనాతోనే వరంగల్ కోసం పట్టుబడుతున్నారని అంటున్నారు. టీడీపీ తరఫున మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తారని ఊదరగొట్టినా.. ఇంత వరకు అతీగతీ లేదు. దీంతో ఉప ఎన్నికలను అవకాశంగా భావిస్తున్న ఆయన తనకే చాన్స్ ఇవ్వాలని కొందరు నేతల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం.
సీనియర్లకు.. అడ్డంకులు!
తెలంగాణ టీడీపీలో తక్కువ కాలంలో పెద్ద స్థాయికి చేరుకున్న కొందరు నాయకులు సీనియర్లకు మోకాలడ్డుతున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ కమిటీల నియామకాల్లో సీనియర్లకు ప్రాధాన్యం లభించలేదు. పార్టీలో జూనియర్ అయిన రేవంత్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
కాగా, ఎస్సీ రిజర్వుడు స్థానమైన వరంగల్‌లో మోత్కుపల్లి వంటి సీనియర్లకు అవకాశం దక్కకుండా కొందరు జూనియర్లు కుయుక్తులు పన్నుతున్నారని అంటున్నారు. సీనియర్లకు అవకాశం కల్పిస్తే తమ ప్రాధాన్యం ఎక్కడ తగ్గిపోతుందోనన్న ముందుచూపుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని అంటున్నారు. వరంగల్ ఎంపీ స్థానాన్ని బీజేపీకే వదిలేద్దామని, ఇవ్వాళ కాకపోయినా, రేపైనా సనత్‌నగర్‌కు ఉపఎన్నిక తప్పదని, అక్కడే పోటీ చేద్దామని కొందరు ప్రతిపాదిస్తున్నారని చెబుతున్నారు.
మరోవైపు తమకు సరైన అభ్యర్థి లేడని, వరంగల్ స్థానాన్ని టీడీపీకి వదిలేసి, సనత్‌నగర్‌కు ఉప ఎన్నిక జరిగితే తాము పోటీ చేస్తామని బీజేపీ కొత్త ప్రతిపాదన చేసిందని సమాచారం. ఒక దశలో వరంగల్ కోసం ఇరు పార్టీలూ పట్టుదలగా ఉన్నప్పుడు, సర్వే చేయించి ఎవరికి ఎక్కువ మద్దతుంటే ఆ పార్టీ బరిలోకి దిగాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ప్రతిపాదించినట్లు వినికిడి. పోటీపై ఇప్పటికీ ఇరు పార్టీల మధ్య స్పష్టత రాకున్నా, బీజేపీ, టీడీపీల్లో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.