
ఓరుగల్లును వదులుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ స్థానాన్ని టీడీపీకి వదిలేయడం మంచిదికాదని బీజేపీ నాయకత్వంపై వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే గుదిబండగా మారుతున్న ప్రస్తుతతరుణంలో వరంగల్ బరి నుంచి తప్పుకోవడం మంచిది కాదని పేర్కొంటున్నారు. గత సాధారణ ఎన్నికల్లో పొత్తులో భా గంగా ఇక్కడి నుంచి బీజేపీయే పోటీ చేసిం దని, ఇప్పుడు కూడా బరిలో దిగాలని వరంగల్ సహా అన్ని జిల్లాల నేతలు పట్టబడుతున్నారు. మంత్రి తలసాని రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు జరిగే సనత్‌నగర్ నుంచి పోటీచేసి, వరంగల్‌ను టీడీపీకి వదిలేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదేజరిగితే బీజేపీకి తెలంగాణలో తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
బీజేపీకే సానుకూలాంశాలు....
వరంగల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి అనేక సానుకూలాంశాలు ఉన్నాయని పార్టీ జిల్లాల నేతలు వాదిస్తున్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు కు బేషరతుగా మద్దతివ్వడం, అంతకుముందు ప్రత్యేక రాష్ర్ట ఉద్యమంలో జేఏసీతో మమేకమై ఉద్యమాలు నిర్వహించడం వల్ల ఉద్యమకారుల్లో బీజేపీపై సానుకూలత ఉందని వాదిస్తున్నారు. దీనికి తోడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి కోసం పలు పథకాలు కేటాయించిందని, వరంగల్‌ను వారసత్వ నగరంగా ప్రకటించడంతో నగర అభివృద్ధి కోసం ప్రతియేటా 50 కోట్లు నేరుగా అందుతాయని చెబుతున్నారు. అమృత పథకం, స్మార్ట్ సిటీ కింద కూడా వరంగల్ ఎంపికైంది. ఇదే కాకుం డా యాదగిరిగుట్ట నుంచి హన్మకొండ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి 1,900 కోట్లు కేటాయించింది. దేశంలో ఏ రహదారికీ ఇంత పెద్దమొత్తం కేటాయించిందని వారు వాదిస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికారంతో వరంగల్‌ను, తెలంగాణను అభివృద్ధి చేయవచ్చని ఓటర్లలో విశ్వాసం కల్పించవచ్చని నేతలు పట్టుబడుతున్నారు. సనత్‌నగర్‌కోసం వరంగల్ ఉప ఎన్నికలను బలిపెడితే బీజేపీ రాష్ట్ర పార్టీగా కాకుండా కేవలం జీహెచ్‌ఎంసీ పార్టీగా మిగిలిపోతుందని హెచ్చరించారు.
నేడు త్రిసభ్య కమిటీ కసరత్తు
వరంగల్ ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహం, నేతల మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. పార్టీ జాతీయనేత చంద్రశేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, గుజ్జుల రామకృష్ణా రెడ్డితో ఏర్పాటైన ఈ కమిటీ సోమవారం నుంచి కసరత్తును ప్రారంభించనుంది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, వివిధ రంగాల్లో పేరున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు, సామాజిక ఉద్యమనేతలు వరంగల్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. పార్టీ టికెట్ కోరుతున్న నేతలు, అభ్యర్థులతో త్రిసభ్య కమిటీ నేరుగా భేటీ కానుంది.