Warangal MP
-
'కేసీఆర్‌కు తప్ప ఎవరికీ తెలియదు'
హైదరాబాద్ : వరంగల్ పార్లమెంట్ స్థానానికి టీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తప్ప మరోనేతకు తెలియదని మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య అన్నారు. ఆయన మంగళవారమిక్కడ అసెంబ్లీ లాబీలో విలేకర్లతో మాట్లాడుతూ అయితే స్థానికులకే పార్టీ టికెట్ ఇవ్వాలనే వాదన టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉందన్నారు. డిప్యూటీ సీఎం పదవిని కోల్పోవడంతో తనపై రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజల్లో సానుభూతి ఉందన్నారు. ఈ కారణంగానే తాను కాంగ్రెస్, బీజేపీ నుంచి వరంగల్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతాననే ప్రచారం జరుగుతోందని అన్నారు. అయితే తాను మాత్రం టీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. కాగా వామపక్షాల తరఫున గాలి వినోద్ కుమార్ ...వరంగల్ ఎంపీగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. -
వచ్చే నెలలో వరంగల్ ఉప ఎన్నిక!
వచ్చే వారంలో షెడ్యూల్ విడుదలయ్యే సంకేతాలు బిహార్ ఎన్నికలతో కలిపి జరిగే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఖాళీగా ఉన్న వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూలు త్వరలోనే వెలువడనుంది. బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఈ ఉపఎన్నిక నిర్వహించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో ఉంది. బిహార్ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. దీంతో బిహార్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయని.. వచ్చే వారంలోనే షెడ్యూలు విడుదల అవుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వరంగల్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున గెలిచిన కడియం శ్రీహరి రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవిని స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. జూలై 21న ఆయన రాజీనామాకు లోక్‌సభ స్పీకర్ ఆమోదం తెలపడంతో వరంగల్ ఎంపీ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల చట్టం ప్రకారం సీటు ఖాళీ అయినప్పటి నుంచీ ఆరు నెలల వ్యవధిలో తిరిగి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. బిహార్‌లో శాసనసభ ఎన్నికల దృష్ట్యా వరంగల్ ఉప ఎన్నికను సైతం వచ్చే నెల్లోనే నిర్వహించే అవకాశాలున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. -
వరంగల్ ఎంపీ రాజయ్య కుమారునిపై గృహహింస కేసు
హైదరాబాద్: వరంగల్ ఎంపీ రాజయ్యపై, ఆయన కుమారుడు అనిల్‌పై కోడలు ఫిర్యాదు మేరకు బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు నమోదైంది. ఏసీపీ మనోహర్ చెప్పిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన సారిక, రాజయ్య కుమారుడు అనిల్‌కుమార్ ఇంజనీరింగ్ చదువుతున్నపుడు ప్రేమించుకున్నారు. 2002లో వెస్ట్‌మారేడ్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకుని ఉద్యోగరీత్యా లండన్ వెళ్లిపోయారు. 2005లో తిరిగి వచ్చాక, పెద్దల కోరిక మేరకు 2006లో సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. అనంతరకాలంలో అనిల్ మరో మతానికి చెందిన యువతితో సహజీవనం చేయసాగాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. సారిక తన అత్తమామలకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలో సారిక ఉద్యోగం చేసి సంపాదించిన రూ.30 లక్షలు, 20 తులాల బంగారు నగలు తన భర్తకే ఇచ్చింది. అయినప్పటికీ వేధింపులు పెరగడంతో సారిక నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కోర్టు ఎంపీ రాజయ్యపై, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనిల్‌కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 498ఏ,494,506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు. రాజయ్యపై, ఆయన భార్య వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మాధవిపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఏసీపీ వివరించారు.