వచ్చే నెలలో వరంగల్ ఉప ఎన్నిక!
వచ్చే వారంలో షెడ్యూల్ విడుదలయ్యే సంకేతాలు
బిహార్ ఎన్నికలతో కలిపి జరిగే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఖాళీగా ఉన్న వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూలు త్వరలోనే వెలువడనుంది. బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఈ ఉపఎన్నిక నిర్వహించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో ఉంది. బిహార్ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. దీంతో బిహార్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయని.. వచ్చే వారంలోనే షెడ్యూలు విడుదల అవుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వరంగల్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున గెలిచిన కడియం శ్రీహరి రాష్ట్ర కేబినెట్‌లో మంత్రి పదవిని స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. జూలై 21న ఆయన రాజీనామాకు లోక్‌సభ స్పీకర్ ఆమోదం తెలపడంతో వరంగల్ ఎంపీ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల చట్టం ప్రకారం సీటు ఖాళీ అయినప్పటి నుంచీ ఆరు నెలల వ్యవధిలో తిరిగి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. బిహార్‌లో శాసనసభ ఎన్నికల దృష్ట్యా వరంగల్ ఉప ఎన్నికను సైతం వచ్చే నెల్లోనే నిర్వహించే అవకాశాలున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి.