Viral Video: రెప్పపాటు ఘటన.. కొంచెం ఆలస్యం అయితే యువకుడి ప్రాణం పోయేది..
సాక్షి, వరంగల్: రన్నింగ్ రైలులో నుంచి దిగుతూ కిందపడిపోయిన ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం 1లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వరంగల్ ఆర్పీఎఫ్ సీఐ టీఎస్ఆర్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రం జహనాబాద్‌కు చెందిన ప్రధూమ్‌కుమార్(22) వరంగల్‌లోని బాలాజీ రైస్ మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం వరంగల్ నుంచి సూరత్ వెళ్లుటకు టికెట్ తీసుకుని నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ప్లాట్‌ఫాం నంబర్ 1లో వేచియున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం 6.30 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం 1నకు వచ్చింది. హడావిడిగా అది ఏ రైలో తెలుసుకోకుండా ప్రధూమ్‌కుమార్ శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు.
అది కదిలి స్పీడుగా వెళ్తున్న క్రమంలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కాదని తెలుసుకుని వెంటనే దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్లాట్‌ఫాం, రైలు బోగీల మధ్యన ఉండే ఖాళీ ప్రదేశంలో పడబోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న వరంగల్ ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఎంవీ రావు, హోంగార్డు ఆమిరిశెట్టి మహేష్‌లు గమనించి వెంటనే అప్రమత్తమై ప్రధూమ్‌కుమార్‌ను పట్టుకుని బయటకు లాగారు. దాంతో ఆయన ప్రాణాలతో బయట పడ్డాడు. ఇదంతా రెప్పపాటు సమయంలో జరిగింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బందిని ప్రయాణికులు, అధికారులు అభినందించారు.
Today, on 08.02.2022, Sri M.V.Rao, ASI/RPF/WL and homeguard rescued a man who was falling from a running train at Warangal Railway station.
Great job sir, Jaihind... pic.twitter.com/FtIZdGX2T7
— Rebal Ravi (@RebalRavi4) February 8, 2022