washerman
-
వెహికల్స్‌ను క్లీన్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా?
పెద్ద పెద్ద ఇళ్లల్లో గచ్చును శుభ్రం చేయడానికి, వాహనాలను శుభ్రం చేయడానికి వాషర్లు తప్పనిసరి. ఇప్పటి వరకు విరివిగా వాడుకలో ఉన్న వాషర్లన్నీ విద్యుత్తు సాయంతో పనిచేసేవే! ఇవి కాస్త భారీగా కూడా ఉంటాయి. ఎక్కడికంటే అక్కడికి తరలించాలంటే కష్టమే! పైగా ఆరుబయట ఉన్న వాహనాన్ని శుభ్రం చేయాలంటే, ఇంట్లో ఉన్న ప్లగ్ సాకెట్ నుంచి ఆరుబయట ఉన్న వాహనం వరకు సరిపోయే పొడవాటి తీగ కావాల్సి ఉంటుంది. ఫొటోలో కనిపిస్తున్న ‘ఆల్బో పోర్టబుల్ కార్డ్‌లెస్ ప్రెషర్ వాషర్’కు అంత పటాటోపం ఏమీ అక్కర్లేదు. ఇది పూర్తిగా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. విద్యుత్ వాషర్లకంటే ఇది తేలిక కూడా. దీని బరువు ఆరుకిలోలే! పైగా దీని అడుగున అమర్చిన చక్రాల వల్ల దీనిని ఎక్కడికైనా సులువుగా నడిపించుకుంటూ పోవచ్చు. దీని సిలిండర్‌లో నీళ్లు నింపుకొని, స్విచ్ ఆన్ చేసుకుంటే చాలు. ఇందులోని బ్యాటరీ విడుదల చేసే 55 బార్ల ప్రెషర్ ధాటికి ఎంతగా మురికిపట్టిన గచ్చయినా, వాహనాలైనా ఇట్టే శుభ్రమైపోతాయి. అమెరికన్ కంపెనీ ‘ఆల్బో’ రూపొందించిన ఈ పోర్టబుల్ ప్రెషర్ వాషర్ ఈ ఏడాదికి రెడ్ డాట్ డిజైన్ అవార్డు కూడా అందుకుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,355) మాత్రమే! ప్రస్తుతం ఇది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది. -
ఎస్సీల్లో చేర్చకుంటే వృత్తి పని బంద్
కర్నూలు (టౌన్) : ఎన్నికల సమయంలో హామీలివ్వడం.. అధికారం చేపట్టిన తర్వాత మరిచిపోవడం రాజకీయపార్టీలకు రివాజుగా మారిందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మూడేళ్లు ముగుస్తున్నా సీఎం చంద్రబాబు రజకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ రజక మిత్ర బృందం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. చంద్ర శేఖర్‌రావు అన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చకుంటే రాష్ట్రవ్యాప్తంగా కులవృత్తిగా ఉన్న బట్టలుతికే పనిని బంద్ చేస్తామని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒక కులం తమ హక్కుల సాధనకు హింసాత్మక చర్యలకు పాల్పడితే ప్రభుత్వం రూ. 1000 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ సాధనకు రజకులు శాంతియుతంగా పోరాడుతుంటే చేతకానితనంగా భావిస్తుండడం దురదృష్టకరమన్నారు. పల్లె ప్రాంతాల్లోని రజకుల కుటుంబాలకు ఐదెకరాల పొలం, ఐదున్నర సెంట్ల ఇంటిస్థలం ఇవ్వాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి నెలవారీ పింఛన్ కింద రూ.1500 ఇవ్వాలన్నారు. బ్యాంకు లింకేజితో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు. అనంతరం కర్నూలు నగర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శ్రీనివాసులు, కార్యదర్శిగా హరిక్రిష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులుగా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, కార్యదర్శి నాగరాజు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చండి
నాగోలు: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని తెలంగాణ వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొమ్మగాని ప్రభాకర్, టి.వెంకట్రాములు కోరారు. మంగళవారం న్యూ నాగోలు కాలనీలోని ఎస్కే డాంగే భవన్లో తెలంగాణ రజక వృత్తిదారుల రాష్ట్ర సమితి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్ల రజకులు సామాజికంగా, ఆర్థికంగా, విద్య, రాజకీయ రంగాలలో వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని... ఫెడరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని కోరారు. 50 ఏళ్లు దాటిన ప్రతి రజక వృత్తిదారునికి రూ.3 వేల ఫించన్ ఇవ్వాలని, ట్యాంక్‌బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రజక ఫెడరేషన్‌కు పాలకమండలిని నియమించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమితి కన్వీనర్ బొడ్డుపల్లి కృష్ణ, వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పాండురంగాచారి, ఇల్లందుల సాంబయ్య, బాతరాజు నర్సింహ, గుమ్మడి రాజు, సాంబయ్య, భిక్షపతి, ముత్యాలు, రమేష్, రాధ, పెంటయ్య, శ్రీనివాస్, భాగ్య, శరత్ తదితరులు పాల్గొన్నారు.