ఎస్సీల్లో చేర్చకుంటే వృత్తి పని బంద్
ఎస్సీల్లో చేర్చకుంటే వృత్తి పని బంద్
Published Mon, Nov 28 2016 9:09 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
కర్నూలు (టౌన్) : ఎన్నికల సమయంలో హామీలివ్వడం.. అధికారం చేపట్టిన తర్వాత మరిచిపోవడం రాజకీయపార్టీలకు రివాజుగా మారిందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మూడేళ్లు ముగుస్తున్నా సీఎం చంద్రబాబు రజకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ రజక మిత్ర బృందం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. చంద్ర శేఖర్‌రావు అన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చకుంటే రాష్ట్రవ్యాప్తంగా కులవృత్తిగా ఉన్న బట్టలుతికే పనిని బంద్ చేస్తామని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒక కులం తమ హక్కుల సాధనకు హింసాత్మక చర్యలకు పాల్పడితే ప్రభుత్వం రూ. 1000 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ సాధనకు రజకులు శాంతియుతంగా పోరాడుతుంటే చేతకానితనంగా భావిస్తుండడం దురదృష్టకరమన్నారు. పల్లె ప్రాంతాల్లోని రజకుల కుటుంబాలకు ఐదెకరాల పొలం, ఐదున్నర సెంట్ల ఇంటిస్థలం ఇవ్వాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి నెలవారీ పింఛన్ కింద రూ.1500 ఇవ్వాలన్నారు. బ్యాంకు లింకేజితో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు. అనంతరం కర్నూలు నగర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శ్రీనివాసులు, కార్యదర్శిగా హరిక్రిష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులుగా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, కార్యదర్శి నాగరాజు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Advertisement