Washington Navy Yard
-
అమెరికాలో మళ్లీ కాల్పులు; 13 మందికి గాయాలు
షికాగో: వాషింగ్టన్ నేవీ యార్డు కాల్పుల ఘటన మరవక ముందే అమెరికాలో మళ్లీ తుపాకులు పేలాయి. షికాగో శివారు బ్యాక్ ఆఫ్ ద యార్డ్స్లోని కార్నెల్ స్క్వేర్ పార్కులో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మూడేళ్ల బాలుడు సహా 11 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన బాలుడితోపాటు మరో ఇద్దరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది. ఒక తూటా బాలుడి చెంపలోకి దూసుకెళ్లిందని అతని బంధువు చెప్పాడు. దుండుగులు ఓ కారులోంచి తనపై కాల్పులు జరపగా తప్పించుకున్నానని, తర్వాత వారు పార్కులోకి వెళ్లి కాల్పులు జరిపారని చెప్పాడు. పోలీసులు తక్షణమే పది అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. -
'నేవీ యార్డ్' స్మారక సభకు ఒబామా
వాషింగ్టన్ నేవీ యార్డ్ ఘటనలో మృతుల స్మారకార్థం ఆదివారం సంఘటన జరిగిన ప్రదేశంలో ఏర్పాటు చేయనున్న స్మారక సభలో దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొంటారని అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రతినిధి గురువారం ఇక్కడ వెల్లడించారు. దుండగుల దుశ్చర్యపై ఆయన ప్రసంగిస్తారని తెలిపారు. అలాగే ఆ ఘటనలో గాయపడిన వారిని గౌరవిస్తారని చెప్పారు. అయితే నేవీ యార్డ్ ఘటనను ఇప్పటికే ఒబామా ఖండించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. యూఎస్ అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉండి, అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల నేవీ యార్డ్‌లోకి సైనిక దుస్తుల్లో ముగ్గురు దుండగలు సోమవారం ప్రవేశించారు. అనంతరం విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భద్రత సిబ్బంది అప్రమత్తమై కాల్పులు ప్రారంభించారు. ఆ ఘటనలో ముగ్గురు దుండగుల్లో ఒకరు మరణించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో 12 మంది మరణించారు. ఆ ఘాతుక చర్యలో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
వాషింగ్టన్ మృతుల్లో భారతీయ అమెరికన్
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ నేవీ యార్డులో సోమవారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన 12 మందిలో విష్ణు పండిట్(61) అనే భారతీయ అమెరికన్ ఉన్నాడు. రక్షణ సామగ్రి సరఫరా కాంట్రాక్టర్ అయిన పండిట్ 20 ఏళ్లుగా వాషింగ్టన్ శివారు నార్త్ పొటోమాక్లో భార్యతో కలిసి ఉంటున్నాడు. మృతుల్లో ఎక్కువ మంది మిలటరీ కాంట్రాక్టర్లు ఉన్నారు. వారిలో ఏడుగురిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన దుండగుడిని ఆరన్ అలెక్సిస్(34) అనే మిలటరీ కాంట్రాక్టర్‌గా గుర్తించినట్లు చెప్పారు. నల్లజాతి వాడైన అలెక్సిస్ గతంలో నేవీలో పనిచేశాడని చెప్పారు. నేవీ యార్డులో కాల్పులు జరిపింది అతడొక్కడేనని, ఎదురు కాల్పుల్లో అతడ్ని హతమార్చామని వెల్లడించారు. ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారని, వారిలో ఒకర్ని చంపేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు సోమవారం చెప్పారు. కాగా, అలెక్సిస్ ఎందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడో తెలియడం లేదని, దీని వెనుక ఉగ్రవాద కోణాన్ని తోసిపుచ్చలేమని నగర మేయర్ విన్సెంట్ గ్రే అన్నారు. ఏడాది కింద టెక్సాస్ నుంచి వచ్చిన అలెక్సిస్ నాలుగు నెలలుగా వాషింగ్టన్లో ఉన్నాడని, అనుమతి పత్రంతోనే యార్డులోకి వ చ్చాడని అధికారులు చెప్పారు. 2007-2011 మధ్య నేవీ రిజర్వు బలగంలో పనిచేసిన అతడు కొంతకాలంగా ఓ రక్షణ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నట్లు తెలిపారు. అలెక్సిస్ సెమీ ఆటోమేటిక్ రైఫిల్, షాట్‌గన్, హ్యాండ్గన్లతో కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. అతడు బౌద్ధమతం పుచ్చుకున్నాడని, గతంలో తుపాకులు, కాల్పులకు సంబంధించి రెండు కేసులు ఎదుర్కొన్నాడని వార్తలు వచ్చాయి. అతడు మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్నాడని అధికారులు చెప్పారు. నేవీ అధికారులు తనపై వివక్ష చూపారని అలెక్సిస్ గతంలో ఫిర్యాదు చేశాడన్నారు. కాగా, మృతులకు నివాళిగా జాతీయ జెండాను సగం అవనతం చేయాలని దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించారు. కాల్పుల నేపథ్యంలో తుపాకులపై గట్టి నియంత్రణ అసరముందని వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి జే కెర్రీ పేర్కొన్నారు. -
నేవీ యార్డ్ కాల్పుల ఘటనలో ఎన్నారై మృతి
అమెరికా రాజధాని వాషింగ్టన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నేవీ యార్డ్‌లో దుండగులు నిన్న జరిపిన కాల్పుల ఘటనలో మరణించిన వారిలో ఓ భారతీయ అమెరికన్ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మృతుడు ఎన్నారై విష్ణు పండిట్ (61)గా గుర్తించినట్లు తెలిపారు. కాగా ఆ ఘటనలో మరణించిన వారి సంఖ్య మంగళవారానికి 13కు చేరుకుందని చెప్పారు. అయితే మృతుల్లో 12 మంది కాంట్రాక్టర్లే అని భావిస్తున్నామన్నారు. మరణించిన వారిలో ఏడుగురి మృతదేహలను గుర్తించినట్లు తెలిపారు. వారి వివరాలను సోమవారం ఇక్కడ విడుదల చేశారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు చేరువలోనే సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఆ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించగా, పలువురు గాయాలపాలయ్యారు. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి దండగులపై కాల్పులు జరిపారు. దాంతో ఓ దుండగుడు మరణించగా, మరో ఇద్దరు పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేసినట్లు వాషింగ్టన్ పోలీసు ఉన్నతాధికారు చెప్పారు. అయితే నేవీ యార్డ్ కాల్పుల ఘటనను ఆ దేశాధ్యక్షుడు ఒబామా ఖండించిన సంగతి తెలిసిందే.