వాషింగ్టన్ నేవీ యార్డ్ ఘటనలో మృతుల స్మారకార్థం ఆదివారం సంఘటన జరిగిన ప్రదేశంలో ఏర్పాటు చేయనున్న స్మారక సభలో దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొంటారని అధ్యక్ష భవనం వైట్హౌస్ ప్రతినిధి గురువారం ఇక్కడ వెల్లడించారు. దుండగుల దుశ్చర్యపై ఆయన ప్రసంగిస్తారని తెలిపారు. అలాగే ఆ ఘటనలో గాయపడిన వారిని గౌరవిస్తారని చెప్పారు. అయితే నేవీ యార్డ్ ఘటనను ఇప్పటికే ఒబామా ఖండించిన సంగతిని ఆయన గుర్తు చేశారు.
యూఎస్ అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉండి, అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల నేవీ యార్డ్లోకి సైనిక దుస్తుల్లో ముగ్గురు దుండగలు సోమవారం ప్రవేశించారు. అనంతరం విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భద్రత సిబ్బంది అప్రమత్తమై కాల్పులు ప్రారంభించారు. ఆ ఘటనలో ముగ్గురు దుండగుల్లో ఒకరు మరణించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో 12 మంది మరణించారు. ఆ ఘాతుక చర్యలో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.