వాషింగ్టన్ మృతుల్లో భారతీయ అమెరికన్ | Indian-American among Washington shooting victims | Sakshi
Sakshi News home page

వాషింగ్టన్ మృతుల్లో భారతీయ అమెరికన్

Published Wed, Sep 18 2013 1:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM

Indian-American among Washington shooting victims

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ నేవీ యార్డులో సోమవారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన 12 మందిలో విష్ణు పండిట్(61) అనే భారతీయ అమెరికన్ ఉన్నాడు. రక్షణ సామగ్రి సరఫరా కాంట్రాక్టర్ అయిన పండిట్ 20 ఏళ్లుగా వాషింగ్టన్ శివారు నార్త్ పొటోమాక్‌లో భార్యతో కలిసి ఉంటున్నాడు. మృతుల్లో ఎక్కువ మంది మిలటరీ కాంట్రాక్టర్లు ఉన్నారు. వారిలో ఏడుగురిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన దుండగుడిని ఆరన్ అలెక్సిస్(34) అనే మిలటరీ కాంట్రాక్టర్‌గా గుర్తించినట్లు చెప్పారు.
 
నల్లజాతి వాడైన అలెక్సిస్ గతంలో నేవీలో పనిచేశాడని చెప్పారు. నేవీ యార్డులో కాల్పులు జరిపింది అతడొక్కడేనని, ఎదురు కాల్పుల్లో అతడ్ని హతమార్చామని వెల్లడించారు. ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారని, వారిలో ఒకర్ని చంపేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు సోమవారం చెప్పారు. కాగా, అలెక్సిస్ ఎందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడో తెలియడం లేదని, దీని వెనుక ఉగ్రవాద కోణాన్ని తోసిపుచ్చలేమని నగర మేయర్ విన్సెంట్ గ్రే అన్నారు. ఏడాది కింద టెక్సాస్ నుంచి వచ్చిన అలెక్సిస్ నాలుగు నెలలుగా వాషింగ్టన్‌లో ఉన్నాడని, అనుమతి పత్రంతోనే యార్డులోకి వ చ్చాడని అధికారులు చెప్పారు. 2007-2011 మధ్య నేవీ రిజర్వు బలగంలో పనిచేసిన అతడు కొంతకాలంగా ఓ రక్షణ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నట్లు తెలిపారు. అలెక్సిస్ సెమీ ఆటోమేటిక్ రైఫిల్, షాట్‌గన్, హ్యాండ్‌గన్‌లతో కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. అతడు బౌద్ధమతం పుచ్చుకున్నాడని, గతంలో తుపాకులు, కాల్పులకు  సంబంధించి రెండు కేసులు ఎదుర్కొన్నాడని వార్తలు వచ్చాయి.
 
 అతడు మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్నాడని అధికారులు చెప్పారు. నేవీ అధికారులు తనపై వివక్ష చూపారని అలెక్సిస్ గతంలో ఫిర్యాదు చేశాడన్నారు.  కాగా, మృతులకు నివాళిగా జాతీయ జెండాను సగం అవనతం చేయాలని దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించారు. కాల్పుల నేపథ్యంలో తుపాకులపై గట్టి నియంత్రణ అసరముందని వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి జే కెర్రీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement