ఇది పురుషోత్త ‘కట్నం’!
తనకు కావాల్సిన సంస్థకే కాంట్రాక్టు దక్కేలా చక్రం తిప్పిన ‘ముఖ్య’నేత
‘మెగా’ సంస్థ బ్రోచర్ అంశాలే టెండర్ నిబంధనలు
- గోదావరి ఎడమగట్టుపై ఎత్తిపోతల్లో భారీగా కమీషన్లు కొట్టేసేలా ఒప్పందం
- నిబంధనలను తుంగలో తొక్కి 14 రోజుల షార్ట్ టెండర్ నోటిఫికేషన్
- ‘ముఖ్య’నేత సూచనతో అర్హతల్లేవని నవయుగను తప్పించిన అధికారులు
- బరిలో మెగా మాత్రమే.. సింగిల్ టెండర్‌కు ఎస్ఎల్ఎస్సీ అభ్యంతరం
- వారం రోజుల షార్ట్ టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని ‘ముఖ్య’నేత ఆదేశం
- మళ్లీ మెగా, నవయుగ షెడ్యూళ్లు మాత్రమే దాఖలు
- అర్హత లేని సంస్థకు వారం రోజుల్లోనే అన్ని అర్హతలు!
- రెండో దఫా ప్రైస్ బిడ్‌కు అర్హత సాధించిన నవయుగ
- 4.90 శాతం అధిక ధరలను కోట్ చేసేలా నవయుగతో ఒప్పందం
- 4.55 శాతం అధిక ధరలను కోట్ చేసి ఎల్–1గా నిలిచిన మెగా
- ఆ సంస్థకే పనులు కట్టబెట్టాలంటూ హైపవర్ కమిటీకి ‘ముఖ్య’నేత ఆదేశం
- పథకం అంచనా వ్యయం 24 గంటల్లోనే రూ.684 కోట్లు పెంచేసిన వైనం
- రూ.వందల కోట్ల ముడుపులు చేతులు మారాయంటున్న అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ప్రభుత్వ పెద్దలకు కామధేనువుగా మారిపోయాయి. సాగు నీరు పారాల్సిన ప్రాజెక్టుల్లో అవినీతి వరద పారిస్తున్నారు. కమీషన్ల యావతో ప్రభుత్వ ఖజానాకు పట్టపగలే కన్నమేస్తున్నారు. అంచనా వ్యయాలు విపరీతంగా పెంచేయడం... ఎక్కువ పర్సంటేజీలు ఇచ్చేవారికే పనులు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించడం... ఇదీ రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణం పేరిట ‘ముఖ్య’నేత సాగిస్తున్న తంతు. గోదావరి ఎడమగట్టుపై రూ.1,638 కోట్లతో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. టెండర్ల బరిలో రెండు సంస్థలు నిలిస్తే.. అందులో తనకు బాగా కావాల్సిన సంస్థకే కాంట్రాక్టు దక్కేలా ‘ముఖ్య’నేత చక్రం తిప్పారు. ఒక సంస్థతో వ్యూçహాత్మకంగా ఎక్కువ ధరను కోట్ చేయించి, పక్కకు తప్పించారు. ఈ ఎత్తిపోతల పథకం వ్యవహారంలో రూ.వందల కోట్లు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కాంట్రాక్టును ఎలాగైనా తనకు కావాల్సిన సంస్థకే కట్టబెట్టాలని ‘ముఖ్య’నేత ముందుగానే నిర్ణయించుకున్నారు. అందుకే ఆ సంస్థకు అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. టెండర్లలో రెండు సంస్థలు పాల్గొన్నాయి. ‘ముఖ్య’నేత సూచనలతో.. అర్హతలు లేవనే సాకుతో ఒక సంస్థను టెండర్ల నుంచి తప్పించారు. దీంతో బరిలో ఒకే సంస్థ మిగలడం వల్ల పోటీ లేకుండా పోయిందని, సింగిల్ షెడ్యూల్‌ను ఆమోదించడం నిబంధనలకు విరుద్ధమని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ తేల్చిచెప్పడంతో ‘ముఖ్య’నేత వెంటనే వ్యూహం మార్చారు.
అర్హతలు లేవని తప్పించిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ రెండు సంస్థలతోనే మళ్లీ టెండర్ దాఖలు చేయించారు. వారం రోజుల క్రితం అర్హతలు లేవని పక్కన పెట్టిన సంస్థకు ఇప్పుడు అన్ని అర్హతలు ఉన్నాయని తేల్చారు. దాంతో వ్యూహాత్మకంగా ఎక్కువ ధర కోట్ చేయించారు. కావాల్సిన సంస్థతో అంతకంటే కొంత తక్కువ ధర కోట్ చేయించారు. ఇంకేముందు కావాల్సిన సంస్థకే టెండర్ దక్కనుంది. ఒప్పందం మేరకు ఎక్కువ ధర కోట్ చేసి, బరి నుంచి తప్పుకున్న మొదటి సంస్థకు మరో నజరానా తయార్. ఆ కథేమిటో మీరే చదవండి...
24 గంటల్లో రూ.684 కోట్లు పెంపు
గోదావరి కుడిగట్టుపై పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ఇప్పటికే రూ.వందల కోట్లు కమీషన్లుగా కొట్టేశారు. ఇప్పుడు గోదావరి ఎడమగట్టుపై మరో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి కమీషన్లు కాజేయడానికి ‘ముఖ్య’నేత ఎత్తు వేశారు. ఇదే అంశంపై ‘మెగా’ డీల్ కుదుర్చుకుని.. రూ.1,638 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి పరిపాలనాపరమైన అనుమతి ఇస్తూ అక్టోబరు 10న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలోకి వంద క్యూమెక్కుల(3,531 క్యూసెక్కులు) నీటిని ఎత్తిపోసి.. ఎడమ కాలువలో 57.885 కిలోమీటర్ వద్ద రెండో దశలో ఎత్తిపోతల ద్వారా 40 క్యూసెక్కుల (1412.4 క్యూ సెక్కులు) నీటిని ఏలేరు రిజర్వా యర్‌లోకి ఎత్తిపోసి 53 వేల ఎకరాలకు నీళ్లందించడంతో పాటు విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడానికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రెగ్యులేటర్ వద్దు.. ఎత్తిపోతలే ముద్దు
పురుషోత్తపట్నం ఎత్తిపోతలను ఏర్పాటు చేసి, పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు 3,500 క్యూసెక్కులు తరలించేలా పథకాన్ని రూపొందించారు. ఎడమ కాలువపై 57 కిలోమీటర్ వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేసి, 53 వేల ఎకరాల ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు నీళ్లందించడానికి జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు రూ.954 కోట్లు అవసరం అవుతాయని ఆగస్టు 19న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ ప్రతిపాదనలపై ‘ముఖ్య’నేత కన్నెర్ర చేశారు. వాటిని సమూలంగా మార్చేయాలని ఆదేశించారు. ‘ముఖ్య’నేత ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భారీ మార్పులు చేశారు. ఎడమ కాలువపై 57 కిలోమీటర్ వద్ద రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేసి ఆయకట్టుకు కాకుండా.. నేరుగా ఏలేరు రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక రూపొందించారు. అంటే రెగ్యులేటర్ సరిపోయే చోట ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చారు. పోలవరం ఎడమ కాలువపై 57 కిలోమీటర్ వద్ద మరో ఎత్తిపోతల చేపట్టాలని ప్రతిపాదిస్తూ ఆగస్టు 20న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దాంతో అంచనా వ్యయం రూ.1,638 కోట్లకు పెరిగింది. ఆగస్టు 19న రూ.954 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని ఆగస్టు 20వ తేదీన రూ.1,638 కోట్లకు పెంచేశారు. అంటే కేవలం 24 గంటల్లోనే అంచనా వ్యయం రూ.684 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది.
టెండర్లలో అంతా గోల్మాల్
తొలుత నవంబర్ 15న జారీ చేసిన టెండర్ షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 29న టెక్నికల్(సాంకేతిక) బిడ్‌ను జలవనరుల శాఖ అధికారులు తెరిచారు. మెగా, నవయుగ సంస్థలు మాత్రమే షెడ్యూళ్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలోనే నవయుగను తప్పించాలంటూ జలవనరుల శాఖ అధికారులపై ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. దాంతో అధికారులు బిడ్ కెపాసిటీ, రిజిస్ట్రేషన్ లేవనే కుంటి సాకులు చూపుతూ నవయుగ సంస్థపై అనర్హత వేటు వేశారు. బరిలో మెగా సంస్థ మాత్రమే మిగిలింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 2న ప్రైస్(ఆర్థిక) బిడ్‌ను తెరిచి.. మెగాకు పనులు అప్పగించాలంటూ జలవనరుల శాఖ అధికారులపై ‘ముఖ్య’నేత తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. కానీ, ఎస్ఎల్ఎస్సీ(స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. బరిలో ఒకే సంస్థ మిగలడం వల్ల పోటీ లేకుండా పోయిందని, సింగిల్ షెడ్యూల్‌ను ఆమోదించడం నిబంధనలకు విరుద్ధమని తేల్చిచెబుతూ టెండర్లు రద్దు చేయాలని సూచించింది. దాంతో ‘ముఖ్య’నేత మరో ఎత్తు వేశారు.
రెండోసారి వారం రోజుల వ్యవధితో కూడిన షార్ట్ టెండర్ పిలవాలని ఆదేశించారు. నవయుగ సంస్థతో సంప్రదింపులు జరిపారు. టెండర్లలో మెగా సంస్థ కంటే అధిక ధరను కోట్ చేసేలా నవయుగను ఒప్పించారు. ఇతర సంస్థలు షెడ్యూల్ దాఖలు చేయకుండా జాగ్రత్తపడ్డారు. ‘ముఖ్య’నేత సూచనలతో ఈ నెల 6న జలవనరుల శాఖ అ«ధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 14న టెక్నికల్ బిడ్‌ను తెరిచారు. రెండోసారి కూడా మెగా, నవయుగ సంస్థలే షెడ్యూళ్లు దాఖలు చేశాయి. తొలుత నిర్వహించిన టెండర్లలో బిడ్ కెపాసిటీ, రిజిస్ట్రేషన్ లేదనే నెపంతో నవయుగపై అనర్హత వేటు వేసిన అధికారులు.. ఈసారి ఆ సంస్థకు అన్ని అర్హతలు ఉన్నాయని తేల్చారు. దాంతో ఆ రెండు సంస్థలు ప్రైస్ బిడ్‌కు అర్హత సాధించాయి.
శనివారం ప్రైస్ బిడ్‌ను పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ఎస్ఈ సుగుణాకర్‌రావు తెరిచారు. 4.55 శాతం అధిక ధరలకు కోట్ చేస్తూ మెగా, 4.90 శాతం అధిక ధరలకు కోట్ చేస్తూ నవయుగ షెడ్యూళ్లు దాఖలు చేశాయి. దీంతో మెగా సంస్థను ఎల్–1గా నిర్ణయించి, ఆ సంస్థకే పనులు కట్టబెట్టాలని ప్రతిపాదిస్తూ ఈఎన్సీకి నివేదిక పంపారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ పరిశీలనకు పంపించారు. టెండర్లను ఆమోదించి, ‘మెగా’కే పనులు అప్పగించాలంటూ హైపవర్ కమిటీపై ‘ముఖ్య’నేత పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్నారు. హైపవర్ కమిటీ ఇక ఆమోదముద్ర వేయడమే తరువాయి.. కాంట్రాక్టర్‌తో జలవనరుల శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. ‘ముఖ్య’నేతతో కుదిరిన ఒప్పందం ప్రకారం టెండర్ బరి నుంచి తప్పుకున్న నవయుగ సంస్థకు ప్రభుత్వం ఏదో ఒక ప్రాజెక్టు రూపంలో భారీ ప్రయోజనం కల్పించినున్నట్లు సమాచారం.
నోటిఫికేషన్లోనే నిబంధనల ఉల్లంఘన
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రూ.1,638 కోట్లను ఐబీఎం(ఇంటర్నర్ బెంచ్ మార్క్)గా నిర్ణయించి న జలవనరుల శాఖ.. ఈపీసీ(ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్ స్ట్రక్షన్)–టర్న్‌కీ విధానంలో నవంబర్ 15న 14 రోజుల స్వల్పకాలిక వ్యవధి తో కూడిన టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదీ నిబంధనలకు విరుద్ధమే. బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్(జీవోసీఈ) కమిటీ నివేదిక ప్రకారం 30 రోజుల కాల వ్యవధితో కూడిన టెండర్ విధానం రాష్ట్రంలో అమల్లో ఉంది. ఎవైనా పను లు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి స్వల్పకాలిక వ్యవధితో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలంటే ప్రత్యేక అనుమతి అవసరం. టెండర్లో ఇతర కాంట్రాక్టర్లకు కనీసం షెడ్యూళ్లు కూడా దాఖలు చేసే అవకాశం లేకుండా చేస్తే.. అస్మదీయులకు సులభంగా పనులు కట్టబెట్ట వచ్చన్న ఎత్తుగడతోనే నిబంధనలకు తుంగలో తొక్కి పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు 14 రోజుల వ్యవధితో కూడిన షార్ట్ టెండర్‌ను పిలిచినట్లు స్పష్టమవుతోంది.
‘మెగా’ బ్రోచరే టెండర్ నిబంధనలు
► మన దేశంలోని కాంట్రాక్టర్లకు మురికివాడలు కట్టడం మినహా మరేమీ చేతకాదంటూ పదే పదే అపహాస్యం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు... పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి వచ్చేసరికి మాట మార్చారు. దేశీయ కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లలో షెడ్యూల్ దాఖలు చేయడానికి అర్హులని.. విదేశీ కాంట్రాక్టర్లు అనర్హులని నిబంధన విధించారు. దేశీయ కాంట్రాక్టర్లు విదేశీ సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడినా షెడ్యూల్ దాఖలు చేయడానికి అర్హులు కారని స్పష్టం చేశారు.
► 2006–07 నుంచి 2015–16 వరకూ పదేళ్లలో ఏ ఒక్క ఏడాదైనా రూ.990 కోట్ల టర్నోవర్ ఉన్న దేశీయ కాంట్రాక్టర్లు మాత్రమే షెడ్యూళ్లు దాఖలు చేయడానికి అర్హులని మరో నిబంధన విధించారు.
► దేశీయ సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడితే.. అందులో ప్రధాన భాగస్వామికి కనీసం 51 శాతం వాటా ఉండాలి. అంటే గత పదేళ్లలో ఏ ఒక్క ఏడాదైనా కనీసం రూ.494 కోట్ల విలువైన పనులు చేసి ఉండాలి. మిగతా భాగస్వాములు రూ.248 కోట్ల పనులు చేసి ఉండాలని పేర్కొన్నారు.
► రూ.611 కోట్ల నగదు నిల్వలు చూపిన కాంట్రాక్టర్లే షెడ్యూళ్లు దాఖలు చేయడానికి అర్హులని తేల్చిచెప్పింది.
► గత పదేళ్లలో ఏ ఒక్క ఏడాదైనా కనీసం 10 క్యూమెక్కుల సామర్థ్యంతో కనీసం ఏడు వర్టికల్ టర్బైన్ పంపులను సరఫరా చేసి, బిగించి.. ట్రయల్ రన్ నిర్వహించిన అనుభవం ఉండాలని ఇంకో నిబంధన పెట్టారు.
► గత పదేళ్లలో ఏ ఒక్క ఏడాదైనా కనీసం నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసే ఏడు ఎలక్ట్రికల్ మోటార్లు సరఫరా చేసి, బిగించి, ట్రయల్ రన్ నిర్వహించిన అనుభవం ఉండాలని మరో షరతు విధించారు.
► గత పదేళ్లలో కనీసం ఏ ఒక్క ఏడాదైనా రెండు మీటర్ల వ్యాసార్ధంతో కూడిన ఎంఎస్ ప్రైజర్ మైన్లను 37 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు మాత్రమే షెడ్యూళ్లు దాఖలు చేయడానికి అర్హులని తేల్చేశారు.
► పనులను తొ మ్మిది నెలల్లోగా పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు.
► పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో పనులను గడువులోగా పూర్తి చేస్తే 16.99 శాతం బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. పురుషోత్తపట్నం ఎత్తిపోతలను గడువులోగా పూర్తి చేయకపోతే జరిమానా విధించే నిబంధన పెట్టకపోవడం గమనార్హం.
► వీటన్నింటినీ పరిశీలిస్తే ‘మెగా’ సంస్థకే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు దక్కేలా నిబంధనలు రూపొందించారని జలవనరుల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ సంస్థ బ్రోచర్‌ను చది వి, ఈ టెండర్ నిబంధనలు రూపొందించినట్లుగా ఉందని అధికారులు అభిప్రాయపడు తున్నారు.