సుంకేసుల బ్యారేజీలో అడుగంటిన నీటి నిల్వలు
కర్నూలు సిటీ: తుంగభద్ర జలాశయం నీరు వారం రోజులైనా జిల్లాకు చేరకపోవడంతో జలవనరుల శాఖ అధికారులకు బెంగ పట్టుకుంది. గత నెల 23న పవర్ కెనాల్ ద్వారా విడుదల చేసినా.. తుంగభద్ర నది పూర్తిగా తడారి పోవడంతో ప్రవాహం నెమ్మదించింది. ఈ నెల 4వ తేదీ నాటికే వాటా విడుదల ముగియనుండ టంతో అసలు నీరు వస్తుందా రాదా అనే సంశయంలో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక కాస్తో కూస్తో వచ్చిన నీటిని ఎండిపోతున్న ఆయకట్టు పొలాలకు ఇవ్వాలో.. కర్నూలు నగర ప్రజల దాహం తీర్చాలో అనే మరో ప్రశ్న అధికారుల ముందుంది.
ఆలస్యంగా స్పందించిన అధికారులు..
టీబీ డ్యాంలోని కేసీ కోటా నీరు విడుదల చేయాలని సుమారు రెండు నెలలకుపైగా జల వనరుల శాఖ ఇంజినీర్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. చివరకు ఆయకట్టుదారుల నుంచి, నదీతీర గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గత నెల 23న తెలంగాణ కోటాతో కలిసి 4.37 టీఎంసీల నీటిలో నుంచి 2 టీఎంసీల నీటిని డ్యాం నుంచి తీసుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో కేసీ కోటాలో నుంచి 2 వేలు, ఆర్డీఎస్ కోటాలో నుంచి 1850 క్యుసెక్కుల నీటితో కలిíపి పవర్ కెనాల్ ద్వారా విడుదల చేశారు. అయితే నీరు ఆర్డీఎస్‌కు కూడా చేరకముందే తెలంగాణ కోటా పూర్తి కావడం, ప్రస్తుతం డ్యాం నుంచి కేవలం 2 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతుండటంతో సుంకేసుల బ్యారేజీకి ఎప్పుడు చేరుతుందోనని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు.
తుంగభద్ర జలాలు ఆర్డీఎస్ ఆనకట్టకు చేరాయి
గత నెల 23న నీటిని విడుదల చేసిన తుంగభద్ర జలాలు ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టకు చేరాయి. నది తడారి పోవడంతో ప్రవాహం నెమ్మదిగా ఉంది. 0.5 టీఎంసీల నుంచి 0.75 టీఎంసీల నీరు రావొచ్చు. ఒక వేళ 1 టీఎంసీ నీరు వస్తే ఆయకట్టుకు కొంత, తాగు నీటికి కొంత కేటాయించుకుని వినియోగిస్తాం. – శ్రీరామచంద్రామూర్తి,ఎస్‌ఈ, జల వనరుల శాఖ
20 రోజులుగా తడవని ఆయకట్టు పొలాలు..
0 నుంచి 40 కి.మీ వరకు ఉన్న ఆయకట్టు పొలాలు 20 రోజులకుపైగా నీటి తడులకు నోచుకోక ఎండిపోతున్నాయి. పంటలు చేతికి రాకపోతే తమ గతి ఏమిటని రైతులు దిగులు చెందుతున్నారు. దీనికి తోడు సుంకేసుల బ్యారేజీలో నీటి నిల్వలు అట్టడుగుకు చేరడంతో కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని తాగు నీటి సమస్య తీవ్రమైంది.
జిల్లాకు 0.7 టీఎంసీల నీరు మాత్రమే చేరే అవకాశం
2 టీఎంసీల నీటిని గత నెల 23న రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పన డ్యాం నుంచి విడుదల చేశారు. ఈ నీటికి ఆర్డీఎస్ కోటా నుంచి తెలంగాణ వాటా 0.9 టీఎంసీలు కలిపి నది ద్వారా విడుదల చేశారు. వారం రోజులైనా జిల్లాకు చేరలేదు. ప్రస్తుతం ఆర్డీఎస్ వద్ద కేవలం అడుగు నీటి మట్టం మాత్రమే ఉన్నట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. మరో నాలుగు రోజులు గడిస్తే గానీ సుంకేసుల బ్యారేజీకి చేరే పరిస్థితి లేదు. డ్యాం వద్ద ఏపీ వాటా 2 టీఎంసీలు, ఆర్డీఎస్ 0.9 టీఎంసీల నీరు రోజుకు 3,850 వేల క్యూసెక్కులు విడుదల చేస్తే 140 కి.మీ దూరం నదిలో వచ్చేందుకు 6 రోజుల పట్టిందంటే, ఆ ఆనకట్ట నుంచి 89 కి.మీ దూరంలోని సుంకేసుల బ్యారేజీకి చేరుకునేందుకు ఇంకెంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇక నదిలోని నీటి ప్రవాహాన్ని బట్టి కేవలం 0.7 టీఎంసీల నీరు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఈ నీటితో 0 నుంచి 40 కి.మీ వరకు ఉన్న 37 వేలు, 120 నుంచి 150 కి.మీ వరకు ఉన్న మరో 30 వేల ఎకరాల ఆయకట్టుకు ఇస్తారా? లేక నగరపాలక సంస్థ పరిధిలోని తాగు నీటి అవసరాలు తీర్చేందుకు వినియోగిస్తారా అనేది ప్రశ్నార్థకం.
Comments
Please login to add a commentAdd a comment