thungabhadra river
-
‘ఎగువ భద్ర’పై పునఃసమీక్షించలేం..కర్ణాటకకు వంతపాడిన కేంద్రం!
సాక్షి, హైదరాబాద్: దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ ఇష్టారీతిగా నీటిని వినియోగించుకొనేలా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి వంత పాడింది. తుంగభద్ర జలాల గరిష్ట వినియో గం లక్ష్యంగా చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుతో తెలంగాణ, ఏపీ నష్టపోతాయన్న వాదనను పక్కనపెట్టి కర్ణాటక వాదనకే మొగ్గు చూపింది. మొదటి కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ జరిపిన కేటాయింపుల్లోంచే కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నీటి వినియోగం చేస్తోందని, అందుకే ప్రాజెక్టుకు అడ్వయిజరీ కమిటీ ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ చేసిన ఫిర్యాదులపై స్పష్టత ఇస్తూ కేంద్ర జల సంఘం డైరెక్టర్ నిత్యానంద ముఖర్జీ రాష్ట్రానికి గురువారం లేఖ రాశారు. తొలి నుంచి వివాదమే... తుంగభద్ర ఎగువన 29.90 టీఎంసీల నీటిని వినియోగించేలా అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపట్టింది. కృష్ణా మొదటి ట్రిబ్యునల్ కేటాయించిన 10 టీఎంసీలు, తుంగ ఆనకట్ట ఆధునీకరణ వల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునీకరణ వల్ల 0.50, విజయనగర చానల్స్ ఆధునీకరణ వల్ల 6.25 వెరసి 13 టీఎంసీలు మిగిలాయని, వాటికి అదనంగా కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో దక్కే వాటాలో 2.40 టీఎంసీలు, మిగులు జలాలు 6 టీఎంసీలు వెరసి 31.4 టీఎంసీల లభ్యత పెరిగిందని, ఇందులో ప్రవాహ నష్టాలు పోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటామని కేంద్ర జల సంఘానికి సమర్పించిన డీపీఆర్‌లో కర్ణాటక పేర్కొంది. అయితే ఈ ప్రాజెక్టును తెలంగాణ తొలి నుంచీ వ్యతిరేకించింది. రెండో కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌లో అప్పర్ తుంగకు 11 టీఎంసీలు, అప్పర్ భద్రకు 9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని, అయితే ఈ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కానందున ఈ నీటి వినియోగానికి కర్ణాటకకు అవకాశం లేదని కేంద్రానికి తెలిపింది. అదీగాక తీర్పులో పేర్కొన్న దానికన్నా అధికంగా నీటిని వినియోగించేలా అప్పర్ భద్రను కర్ణాటక చేపట్టిందని వివరించింది. దీనికితోడు ఒక నదిలో నీటి వినియోగంతో దిగువ రాష్ట్రాలకు నష్టం జరిగితే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 నిబంధనల మేరకు పరీవాహక ప్రాంతంలోని దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోవాలని, కానీ అలాంటిదేమీ లేకుండానే అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా 29.90 టీఎంసీలను తరలించడానికి కేంద్ర జల సంఘం అనుమతించడాన్ని తప్పుబట్టింది. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే తుంగభద్ర జలాశయానికి వచ్చే వరద ప్రవాహం కనిష్ట స్థాయికి తగ్గుతుందని, దీనివల్ల దిగువ రాష్ట్రాల ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందని కేంద్రానికి లేఖ రాసింది. అవి రాష్ట్రాలవారీ కేటాయింపులే.. తెలంగాణ ఫిర్యాదుపై కేంద్రం స్పందిస్తూ... ‘మొదటి ట్రిబ్యునల్ రాష్ట్రాలవారీగానే కేటాయింపులు చేసింది కానీ ప్రాజెక్టులవారీగా చేయలేదు. కర్ణాటకకు ట్రిబ్యునల్ 734 టీఎంసీలు కేటాయించింది. ఈ వాటాలోంచే నీటిని వినియోగించుకొనేలా కర్ణాటక అప్పర్ భద్ర చేపట్టింది. దీంతోపాటే వివిధ ఆధునీకరణ పనులు, మైనర్ ఇరిగేషన్ లో తమకు దక్కే వాటాల్లోంచే 29.90 టీఎంసీల నీటిని వాడుకుంటున్నామని కర్ణాటక మాస్టర్ ప్లాన్ లో పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే గతేడాది డిసెంబర్లో జరిగిన అడ్వయిజరీ సమావేశంలో ప్రాజెక్టును ఆమోదించాం. ప్రస్తుతం ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించలేం’అని తెలంగాణకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. -
తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్
-
తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్
-
తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, కర్నూలు: పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం సంకల్‌భాగ్ ఘాట్‌లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. కాగా.. కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి డిసెంబర్ 1వరకు.. 12 రోజులపాటు తుంగభద్ర పుష్కరాలను నిర్వహించనున్నారు. ఐదువేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో సీఎం జగన్ వెంట మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కంగాటి శ్రీదేవి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్ ఉన్నారు. -
నేడు కర్నూలుకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కర్నూలు రానున్నారు. సంకల్‌భాగ్ ఘాట్‌లో పుష్కర పూజలు నిర్వహించనున్నారు. నేపథ్యంలో సంకల్‌భాగ్ ఘాట్‌లో ఏర్పాట్లను గురువారం మధ్యాహ్నం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్ పరిశీలించారు. ఈ ఘాట్‌లోకి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్ప, ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, ఏపీఎస్పీ బెటాలియన్‌లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్దిమందికి అవకాశం కల్పించనున్నారు. (నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు) సీఎం పర్యటన కొనసాగుతుందిలా.. శుక్రవారం ఉదయం 11 గంటలు: తాడేపల్లిలోని ఇంటి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు 11.20: గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు 11.30: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఓర్వకల్లుకు విమానంలో బయలు దేరుతారు 12.30: ఓర్వకల్లు ఎయిర్ పోర్టు చేరుకుంటారు 12.40: ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు బయలు దేరుతారు 12.55: ఏపీఎస్పీ బెటాలియన్ చేరుకుంటారు 1 గంట: ఎస్పీఎస్పీ బెటాలియన్ నుంచి రోడ్డు మార్గన సంకల్‌భాగ్ పుష్కర్ ఘాట్‌కు బయలు దేరుతారు 1.10: సంకల్‌భాగ్ పుష్కర ఘాట్ చేరుకుంటారు 01.10 నుంచి 01.50 గంటలు: పుష్కర ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు 01.50: సంకల్‌భాగ్ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్‌కు బయలు దేరుతారు 2 గంటలు: ఏపీఎస్పీ బెటాలియన్ చేరుకుంటారు 02.05: బెటాలియన్ నుంచి హెలికాప్టర్లో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు 2.20: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు చేరుకుంటారు 2.30: ఓర్వకల్లు నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్తారు -
పుష్కరతుంగ... భద్రగంగ
జలాన్ని దేవతా రూపంలో తల్లిగా భావించి పూజించడం హిందువుల సంప్రదాయం. నదీస్నానాలు, కోనేటి స్నానాలు, మంగళ స్నానాలు, సముద్ర స్నానాలు... అలాగే తీర్థ యాత్రలు, పుణ్య క్షేత్రాలు దర్శనం... సమస్తం నీటితో ముడిపడి వున్నాయి. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్య ప్రదమని హిందువుల విశ్వాసం. సకల జీవరాశులకు ప్రధానమైన జలస్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు. ‘తుంగే పానీ.. గంగే స్నానే’ అన్నది ఆర్యోక్తి. గంగానదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని దీనికి అర్థం! అసలు తుంగభద్ర నది ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం... హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో వేయగా శ్రీ మహావిష్ణువు వరాహావతారమెత్తి తన కోరలతో భూమిని సాగరం నుండి పైకెత్తి సర్వజీవులనూ రక్షించాడు. తుంగ (ఎత్తు) నుండి రావడం వల్ల తుంగానదిగానూ, హిరణ్యాక్షుని సంహరించే సమయంలో వరాహరూపుడైన విష్ణువు కుడి కోర నుండి కారిన లాలాజలం భద్రానదిగానూ ఉద్భవించాయి. పుష్కరాలు జరిగే 12 నదులలో తుంగభద్ర ఒకటి. రాష్ట్రంలో చివరి తుంగభద్ర పుష్కరాలు 2008 లో జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి తుంగభద్ర పుష్కరాలు ఇవే. నవగ్రహాల్లో ఒకటైన గురు గ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో పరిభ్రమిస్తుంటుంది. బృహస్పతి మకరరాశిలో ప్రవేశించే సమయంలో తుంగభద్ర నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ముక్కోటి దేవతలు ఆ నదిలో కొలువై ఉంటారని, ఈ సమయంలో ఆ నదిలో స్నానమాచరించిన వారి పాపాలు తొలిగి.. పుణ్యం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రముఖ దేవాలయాలను తాకుతూ వెళుతున్న తుంగభద్ర.. కర్ణాటక: శృంగేరి (చిక్మగుళూరు), పంపావతి దేవాలయం(కంప్లి), హరిహరేశ్వర దేవాలయం(హంపి). ఆంధ్రప్రదేశ్: రాఘవేంద్రస్వామి ఆలయం, (మంత్రాలయం), శివరామాలయం (గుండ్రేవుల). తెలంగాణ: సంతాన వేణుగోపాలస్వామి ఆలయం (వేణిసోంపురం), వైకుంఠ నారాయణ స్వామి ఆలయం (రాజోళి), సూర్యనారాయణ స్వామి ఆలయం (పుల్లూరు), జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు (అలంపూర్), సంగమేశ్వరాలయం. తుంగ, భద్ర నదులు కలసి కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తాయి. ఈ రెండు నదులు కలిసి తుంగభద్ర నదిగా మారి.. కర్ణాటకలో కృష్ణా పరివాహక ప్రాంతం మీదుగా ప్రవహిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేళగనూరు వద్ద ప్రవేశిస్తుంది. తెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కుట్కనూరు వద్ద తుంగభద్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం పులికల్, రాజోళి, పుల్లూరు మీదుగా సాగుతూ నదీతీరంలో కొలువైన దేవతల పాదాలను అభిషేకిస్తూ.. సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. తుంగభద్ర నది రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత సుమారు 90 కిలోమీటర్ల మేర ప్రవహించి సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో సంగమం అవుతున్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో తుంగభద్ర నది జలకళను సంతరించుకుంది. పుష్కరాల సందర్భంగా పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేసింది. పిండ ప్రదానం తదితర కార్యక్రమాలకు రేట్లను ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ నిర్ధారించి, ఆ వివరాలను వీటి కోసం కేటాయించిన షెడ్ల వద్ద ప్రదర్శించనుంది. పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా దేవదాయ శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. కాగా నేటి మధ్యాహ్నం కర్నూలు జిల్లాలోని సంకల్బాగ్ పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహనరెడ్డి పాల్గొంటారు. – ఇన్పుట్స్: అంబటి తిరుమలేష్ సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజమ్ -
తుంగభద్ర పుష్కరాలకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు(సెంట్రల్): తుంగభద్ర పుష్కరాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పర్యటన ఖరారైంది. ఈ నెల 20న కర్నూలులోని సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌ను సందర్శిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పర్యటన సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం సందర్శించే సంకల్‌భాగ్ (వీఐపీ) పుష్కర ఘాట్‌లోకి ఆయన పర్యటన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్పా ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం తిరిగి వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, ఏపీఎస్పీ బెటాలియన్‌లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్దిమందికి అవకాశం కల్పించనున్నారు. సమన్వయంతో పని చేయండి సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. మంగళవారం ఆయన సునయన ఆడిటోరియంలో ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, జేసీలు ఎస్.రామసుందర్‌రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్‌తో కలిసి తుంగభద్ర పుష్కరాలపై సమీక్షించారు. పుష్కరాలకు సీఎం వస్తున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్ పనులన్నీ బుధవారం సాయంత్రంలోపు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో బి.పుల్లయ్య, కేఎంసీ కమిషనర్ డీకే బాలాజీ, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా మంగళవారం సాయంత్రం కలెక్టర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, నగరపాలక కమిషనర్ డీకే బాలాజీతో కలిసి నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో హెలిప్యాడ్, సంకల్‌భాగ్ ఘాట్‌ను పరిశీలించారు. అలాగే బెటాలియన్ నుంచి కొత్తబస్టాండ్, బంగారు పేట, ఎస్టీబీసీ కళాశాల, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, నరసింగరావు పేట మీదుగా సంకల్‌భాగ్‌లోని పుష్కరఘాట్ వరకు సీఎం వెళ్లే దారిని చూశారు. సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌లో ముఖ్యమంత్రి చేయనున్న పూజలకు సంబంధించిన ఏర్పాట్లు చూడాలని నగరపాలక కమిషనర్‌ను ఆదేశించారు. పర్యటన సాగేదిలా.. ఉదయం 11 గంటలు : తాడేపల్లిలోని ఇంటి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు. 11.20 : గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11.30 : గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లుకు బయలుదేరుతారు. 12.30 : ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 12.40 –12.55 : ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట : ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి రోడ్డుమార్గాన సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌కు బయలు దేరుతారు. 1.10 : సంకల్‌భాగ్‌కు చేరుకుంటారు 1.10 – 1.50 : పుష్కర ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 1.50– 2.00 : సంకల్‌భాగ్ నుంచి బయలుదేరి బెటాలియన్‌కు చేరుకుంటారు. 2.05– 2.20 : బెటాలియన్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 2.30 : ఓర్వకల్లు నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళతారు. -
ఎల్లెల్సీకి మళ్లీ గండి
కర్నూలు, ఆదోని/హొళగుంద/హాలహర్వి/ మంత్రాలయం: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు మళ్లీ గండి పడింది. కర్ణాటకలోని 60.8 కి.మీ. వద్ద కురుగోడు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున కాలువకు గండి పడినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఎగువనున్న ఎస్కేప్ చానల్ ఎత్తి కురుగోడు వాగుకు నీటిని వదిలేశారు. దీంతో కురుగోడు వాగు చెరువును తలపించింది. అక్కడి రైతులు కొందరు చెరువులు, వంకలు, వాగులను నింపుకునేందుకే అర్ధరాత్రి కాలువ గట్టుకు గండి పెట్టి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 27న తుంగభద్ర జలాశయం సమీపంలో 8.4 కి.మీ. వద్ద రక్షణ గోడ కుప్పకూలడంతో దాదాపు 12 రోజుల పాటు ఎల్లెల్సీకి నీటి సరఫరా నిలిచిపోయింది. గోడ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఈ నెల 7న నీటి సరఫరాను పునరుద్ధరించారు. మూడు రోజుల క్రితం నీరు బోర్డు సరిహద్దుకు చేరింది. పునరుద్ధరించిన నీటి సరఫరా ఇంకా పూర్తి స్థాయికి చేరుకునే లోగానే మళ్లీ కాలువకు గండి పడడంతో ఎల్లెల్సీ రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బోర్డు కార్యదర్శి నాగమోహన్, ఎస్ఈ రమణ, ఈఈ విశ్వనాథ్‌రెడ్డి గండి పడిన చోటుకు చేరుకున్నారు. మూడు రోజుల్లో గండిని పూడ్చి వేస్తామని ఎస్ఈ రమణ తెలిపారు. ఆదోని దిగువ కాలువ ప్రాజెక్ట్ నం.2 డీఈఈ విశ్వనాథ్‌రెడ్డి, జేఈ రంగనాథ్ పరిస్థితిని సమీక్షించారు. మూడు రోజుల్లో గండిని పూడ్చి వేసినా జిల్లాకు నీరు చేరేందుకు మరో నాలుగు రోజులు పడుతుందని డీఈఈ విశ్వనాథ్‌రెడ్డి చెప్పారు. గండిపై ఎన్నో అనుమానాలు గండి పడిన చోట కాలువ గట్టు దాదాపు 30 అడుగుల వెడల్పుతో ఎంతో పటిష్టంగా ఉంది. రెండేళ్ల క్రితం గట్టునుసీసీ లైనింగ్‌తో ఆధునికీకరించారు. దీంతో సహజ గండి పడేందుకు దాదాపు అవకాశాల్లేవు. దీంతో కర్ణాటక రైతులే గండి కొట్టి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కురుగోడు సమీపంలో ఓ పెద్ద చెరువు ఉంది. కురుగోడు చెరువు, వంక, తుంగభద్ర నది ఆధారంగా రైతులు వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువు, వంకకు నీటి సమస్య నెలకొనడం, తుంగభద్రలోనూ ప్రవాహం నిలిచిపోవడంతో వరి పంట ఎండుముఖం పట్టింది. దాన్ని రక్షించుకోవడానికి కాలువకు గండి పెట్టి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు కూడా ఇవే అనుమానాలు ఉండడంతో కురుగోడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని బోర్డు ఈఈ విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు. బోర్డు అధికారుల నిర్లక్ష్యం! జలాశయం సమీపంలో 8.4 కి.మీ. మలుపు వద్ద ఓ వాగుకు నిర్మించిన రక్షణ గోడ దాదాపు శిథిలదశకు చేరుకుంది. గత ఏప్రిల్ నుంచి దాదాపు నాలుగు నెలల పాటు కాలువకు నీటి సరఫరా లేదు. ఆ సమయంలో బలహీనంగా మారిన రక్షణ గోడను కూల్చివేసి.. కొత్తది నిర్మించి ఉంటే నీటి సరఫరాలో అంతరాయం ఉండేది కాదని దిగువ కాలువ రైతులు అంటున్నారు. తమ గురించి బోర్డు అధికారులు అసలు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తాము ఏ ఏడాది పంట భూములను బీడుగా పెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నార్థకంగా మారిన సాగు దిగువ కాలువకు జూలై 22న నీటి సరఫరా ప్రారంభమైంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా జరగలేదు. బోర్డు సరిహద్దు 250 కి.మీ. హానువాళు వద్ద 600 క్యూసెక్కులు నీరు సరఫరా చేయాలని జిల్లా సాగునీటి శాఖ అధికారులు బోర్డుకు ఇండెంట్ పెట్టారు. అయితే 200 నుంచి 400 క్యూసెక్కుల వరకు మాత్రమే సరఫరా అవుతోంది. దీనికి తోడు రక్షణ గోడ కూలి 12 రోజులు, ఇప్పుడు కురుగోడు వద్ద గండితో మరోసారి నీటి సరఫరా నిలిచిపోయింది. కాలువ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాలలో ఖరీఫ్‌లో 42,420 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇందులో ఇప్పటి వరకు 16వేల ఎకరాలలో మాత్రమే వరి నాట్లు వేశారు. మిగిలిన ఆయకట్టు భూములు బీడుగా ఉన్నాయి. రాష్ట్ర వాటా మేరకు నీటి సరఫరా జరగకపోవడం, గండ్లు పడుతుండడంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు ఎమ్మిగనూరు, కోడుమూరు సబ్డివిజన్లకు చుక్క నీరు చేరలేదు. ఈ సబ్ డివిజన్లలో నేటికీ ఎకరాలో కూడా వరి నాట్లు పడలేదు. ఎగువనున్న ఆలూరు, ఆదోని నియోజకవర్గాలలోని చివరి ఆయకట్టు భూములకు కూడా సాగునీరు అందడం లేదు. -
నదుల తీరం.. చమురు క్షేత్రం !
అలంపూర్ రూరల్: తెలంగాణకు దక్షిణ సరిహద్దులో ప్రవహించే కృష్ణా, తుంగభద్ర నదుల తీరాల్లో చమురు నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధనలు సాగుతున్నాయి. అలంపూర్ మండలంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) జీపీఎస్ శాటిలైట్ ద్వారా న్యాచురల్ గ్యాస్(సహజ వాయువు), పెట్రోల్ , క్రూడాయిల్ వంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెండు రోజులుగా అలంపూర్ ప్రాంతంలోని తుంగభద్ర నది బిడ్జి కేంద్రంగా పరిసర ప్రాంతాలైన సుల్తానాపురం, ర్యాలంపాడు, కాశీపురం, సింగవరం తదితర గ్రామాల్లో రిగ్గు బోర్లు వేస్తూ మట్టి, నీటి నమూనాలను సేకరించారు. అత్యాధునిక రాడార్ వాహనం ద్వారా చమురు నిక్షేపాలను గుర్తించే తరంగాలను రిగ్గులోకి పంపుతూ అక్కడి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని క్రోడీకరించుకుని తమ వద్ద ఉన్న ప్రత్యేక కంప్యూటర్లలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తూ డెహ్రాడూన్‌లోని తమ ప్రధాన కార్యాలయానికి చేరవేస్తున్నారు. ఈ ప్రక్రియనంతా డేటా కలెక్షన్గా పేర్కొంటున్నట్లు ప్రాజెక్టు మేనేజర్ మురిగేషన్ ‘సాక్షి’కి వెల్లడించారు. 40 ఏళ్ల క్రితమే సర్వే.. ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాలు ఉన్నట్టు గత 40 ఏళ్ల క్రితమే నాటి సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు పంపినట్లు ప్రాజెక్టు మేనేజర్ మురుగేషన్ తెలిపారు. ప్రస్తుతం క్రూడాయిల్ కోసం పశ్చిమ దేశాలపై ఆధారపడ్డాం. దేశంలోని మోదీ ప్రభుత్వంలో సహజ వాయువులు, చమురు నిక్షేపాలను గుర్తించేందుకు జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించుకుని పరిశోధన నియమాలను సులభతరం చేసినందుకు డాటా కలెక్షన్ ప్రారంభమైందన్నారు. గతంలో డీబేర్స్ అనే వజ్రాల సంస్థ నడిగడ్డ ప్రాంతమైన కృష్ణా– తుంగభద్ర నదీతీర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన విషయం కూడా విధితమే. చమురు నిక్షేపాలను గుర్తించడం నదీతీరాల దగ్గర చమురు నిక్షేపాలు అధికంగా ఉన్నాయని జీపీఎస్ శాటిలైట్ సిస్టం ద్వారా గుర్తించిన ఓఎన్జీసీ ఈ నిక్షేపాల పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు 60 మీటర్ల విస్తీర్ణంలో శాటిలైట్ గుర్తించిన ప్రదేశాల్లో రిగ్గులను తవ్వి రాడార్ సంకేతాలను ఆ రిగ్గులోకి పంపుతున్నారు. అలా పంపిన సంకేతాలతో అక్కడ ఖనిజ నిక్షేపాలు, సహజ సిద్ధమైన వాయువులు, వాటి పీడనాలు ఏ విధంగా ఉన్నాయో సేకరిస్తున్నారు. జియోగ్రాఫికల్ సంకేతాల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని ఓఎన్జీసీ సంస్థ విశ్లేషించి మరికొన్ని సార్లు పరిశోధించి చమురు నిక్షేపాలు లభ్యమయ్యే ప్రాంతాన్ని గుర్తిస్తుంది. అనంతరం నిర్ధారించుకున్న తర్వాత వాటిపై పరిశోధనలు జరిపి ఖనిజ నిక్షేపాలను భావితరాల అవసరాలకు అందేలా చర్యలు చేపడుతుంది. -
తుంగ..బెంగ
కర్నూలు సిటీ: తుంగభద్ర జలాశయం నీరు వారం రోజులైనా జిల్లాకు చేరకపోవడంతో జలవనరుల శాఖ అధికారులకు బెంగ పట్టుకుంది. గత నెల 23న పవర్ కెనాల్ ద్వారా విడుదల చేసినా.. తుంగభద్ర నది పూర్తిగా తడారి పోవడంతో ప్రవాహం నెమ్మదించింది. ఈ నెల 4వ తేదీ నాటికే వాటా విడుదల ముగియనుండ టంతో అసలు నీరు వస్తుందా రాదా అనే సంశయంలో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక కాస్తో కూస్తో వచ్చిన నీటిని ఎండిపోతున్న ఆయకట్టు పొలాలకు ఇవ్వాలో.. కర్నూలు నగర ప్రజల దాహం తీర్చాలో అనే మరో ప్రశ్న అధికారుల ముందుంది. ఆలస్యంగా స్పందించిన అధికారులు.. టీబీ డ్యాంలోని కేసీ కోటా నీరు విడుదల చేయాలని సుమారు రెండు నెలలకుపైగా జల వనరుల శాఖ ఇంజినీర్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. చివరకు ఆయకట్టుదారుల నుంచి, నదీతీర గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గత నెల 23న తెలంగాణ కోటాతో కలిసి 4.37 టీఎంసీల నీటిలో నుంచి 2 టీఎంసీల నీటిని డ్యాం నుంచి తీసుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో కేసీ కోటాలో నుంచి 2 వేలు, ఆర్డీఎస్ కోటాలో నుంచి 1850 క్యుసెక్కుల నీటితో కలిíపి పవర్ కెనాల్ ద్వారా విడుదల చేశారు. అయితే నీరు ఆర్డీఎస్కు కూడా చేరకముందే తెలంగాణ కోటా పూర్తి కావడం, ప్రస్తుతం డ్యాం నుంచి కేవలం 2 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతుండటంతో సుంకేసుల బ్యారేజీకి ఎప్పుడు చేరుతుందోనని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. తుంగభద్ర జలాలు ఆర్డీఎస్ ఆనకట్టకు చేరాయి గత నెల 23న నీటిని విడుదల చేసిన తుంగభద్ర జలాలు ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టకు చేరాయి. నది తడారి పోవడంతో ప్రవాహం నెమ్మదిగా ఉంది. 0.5 టీఎంసీల నుంచి 0.75 టీఎంసీల నీరు రావొచ్చు. ఒక వేళ 1 టీఎంసీ నీరు వస్తే ఆయకట్టుకు కొంత, తాగు నీటికి కొంత కేటాయించుకుని వినియోగిస్తాం. – శ్రీరామచంద్రామూర్తి,ఎస్ఈ, జల వనరుల శాఖ 20 రోజులుగా తడవని ఆయకట్టు పొలాలు.. 0 నుంచి 40 కి.మీ వరకు ఉన్న ఆయకట్టు పొలాలు 20 రోజులకుపైగా నీటి తడులకు నోచుకోక ఎండిపోతున్నాయి. పంటలు చేతికి రాకపోతే తమ గతి ఏమిటని రైతులు దిగులు చెందుతున్నారు. దీనికి తోడు సుంకేసుల బ్యారేజీలో నీటి నిల్వలు అట్టడుగుకు చేరడంతో కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని తాగు నీటి సమస్య తీవ్రమైంది. జిల్లాకు 0.7 టీఎంసీల నీరు మాత్రమే చేరే అవకాశం 2 టీఎంసీల నీటిని గత నెల 23న రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పన డ్యాం నుంచి విడుదల చేశారు. ఈ నీటికి ఆర్డీఎస్ కోటా నుంచి తెలంగాణ వాటా 0.9 టీఎంసీలు కలిపి నది ద్వారా విడుదల చేశారు. వారం రోజులైనా జిల్లాకు చేరలేదు. ప్రస్తుతం ఆర్డీఎస్ వద్ద కేవలం అడుగు నీటి మట్టం మాత్రమే ఉన్నట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. మరో నాలుగు రోజులు గడిస్తే గానీ సుంకేసుల బ్యారేజీకి చేరే పరిస్థితి లేదు. డ్యాం వద్ద ఏపీ వాటా 2 టీఎంసీలు, ఆర్డీఎస్ 0.9 టీఎంసీల నీరు రోజుకు 3,850 వేల క్యూసెక్కులు విడుదల చేస్తే 140 కి.మీ దూరం నదిలో వచ్చేందుకు 6 రోజుల పట్టిందంటే, ఆ ఆనకట్ట నుంచి 89 కి.మీ దూరంలోని సుంకేసుల బ్యారేజీకి చేరుకునేందుకు ఇంకెంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇక నదిలోని నీటి ప్రవాహాన్ని బట్టి కేవలం 0.7 టీఎంసీల నీరు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఈ నీటితో 0 నుంచి 40 కి.మీ వరకు ఉన్న 37 వేలు, 120 నుంచి 150 కి.మీ వరకు ఉన్న మరో 30 వేల ఎకరాల ఆయకట్టుకు ఇస్తారా? లేక నగరపాలక సంస్థ పరిధిలోని తాగు నీటి అవసరాలు తీర్చేందుకు వినియోగిస్తారా అనేది ప్రశ్నార్థకం. -
‘తుమ్మిళ్ల’పై ఏపీ అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చేపట్టిన తుమ్మిళ్లపై ఏపీ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు కోసం కృష్ణాబోర్డు నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గత నెల 8న తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారని పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకుండానే, రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టు చేపడుతోందని వివరించింది. ఈ ఎత్తిపోతల కారణంగా రాయలసీమ ప్రాంతాలకు నీటిని తరలించే కేసీ కెనాల్‌కు నీటి లభ్యత తగ్గుతుందని, దీంతో రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలకు కొరత ఏర్పడుతుందని తెలిపింది. ఈ దృష్ట్యా తుమ్మిళ్లను అడ్డుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన కృష్ణాబోర్డు తుమ్మిళ్ల ఎత్తిపోతలకు సంబంధించి డీపీఆర్‌లను తమ ముందుంచాలని తెలంగాణను ఆదేశించింది. ఇప్పటికే ఓసారి ఏపీ ఫిర్యాదు.. తుమ్మిళ్లకు రూ.783 కోట్లతో పరిపాలనా అనుమతులిచ్చిన వెంటనే దీనిపై గతేడాది ఏప్రిల్‌లోనే ఏపీ తన అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై బోర్డు వివరణ కోరగా, తెలంగాణ సమాధానం ఇచ్చింది. ‘బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటిని కేటాయించింది. అయితే కాల్వల పూడిక కారణంగా తెలంగాణకు దక్కుతున్న వాటా గరిష్టంగా 4 టీఎంసీలు దాటట్లేదు. దీంతో ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలకు సాగునీరందాల్సి ఉన్నా 30 వేల ఎకరాలకు సైతం అందట్లేదు. ఈ దృష్ట్యానే నీరందని 55,600 ఎకరాలకు సాగునీరు, దారిలోని గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో సుంకేశుల బ్యాక్‌వాటర్ ఫోర్‌షోర్‌లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించాం. తుంగభద్ర జలాల్లో నీటిప్రవాహం ఉన్నప్పుడే నీటిని తీసుకుంటాం. దీనివల్ల సుంకేశులకు ఎలాంటి నష్టం లేదు’అని వివరణ ఇచ్చింది. అయినా కూడా ఏపీ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేయడంతో కృష్ణా బోర్డు తెలంగాణను వివరణ కోరింది. -
తుంగభద్ర నదిలో పడి వ్యక్తి మృతి
మంత్రాలయం: మద్యం మత్తులో నది దాటుతూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. శనివారం కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రాలయం కు చెందిన గురురాజు(40) శనివారం ఉదయం సరిహద్దు కర్ణాటకలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి తిరుగు ప్రయాణంలో తుంగభద్ర నది దాటుతూ ప్రమాదవశాత్తూ నీటిలో పడి మునిగిపోయాడు. తోటి ప్రయాణికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గురురాజు మద్యం మత్తులో ఉన్నాడని వారు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.