ఎస్కేప్ చానల్ నుంచి నీటిని వదలడంతో చెరువును తలపిస్తున్న కురుగోడు వాగు
కర్నూలు, ఆదోని/హొళగుంద/హాలహర్వి/ మంత్రాలయం: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు మళ్లీ గండి పడింది. కర్ణాటకలోని 60.8 కి.మీ. వద్ద కురుగోడు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున కాలువకు గండి పడినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఎగువనున్న ఎస్కేప్ చానల్ ఎత్తి కురుగోడు వాగుకు నీటిని వదిలేశారు. దీంతో కురుగోడు వాగు చెరువును తలపించింది. అక్కడి రైతులు కొందరు చెరువులు, వంకలు, వాగులను నింపుకునేందుకే అర్ధరాత్రి కాలువ గట్టుకు గండి పెట్టి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 27న తుంగభద్ర జలాశయం సమీపంలో 8.4 కి.మీ. వద్ద రక్షణ గోడ కుప్పకూలడంతో దాదాపు 12 రోజుల పాటు ఎల్లెల్సీకి నీటి సరఫరా నిలిచిపోయింది. గోడ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఈ నెల 7న నీటి సరఫరాను పునరుద్ధరించారు. మూడు రోజుల క్రితం నీరు బోర్డు సరిహద్దుకు చేరింది. పునరుద్ధరించిన నీటి సరఫరా ఇంకా పూర్తి స్థాయికి చేరుకునే లోగానే మళ్లీ కాలువకు గండి పడడంతో ఎల్లెల్సీ రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బోర్డు కార్యదర్శి నాగమోహన్, ఎస్‌ఈ రమణ, ఈఈ విశ్వనాథ్‌రెడ్డి గండి పడిన చోటుకు చేరుకున్నారు. మూడు రోజుల్లో గండిని పూడ్చి వేస్తామని ఎస్‌ఈ రమణ తెలిపారు. ఆదోని దిగువ కాలువ ప్రాజెక్ట్ నం.2 డీఈఈ విశ్వనాథ్‌రెడ్డి, జేఈ రంగనాథ్ పరిస్థితిని సమీక్షించారు. మూడు రోజుల్లో గండిని పూడ్చి వేసినా జిల్లాకు నీరు చేరేందుకు మరో నాలుగు రోజులు పడుతుందని డీఈఈ విశ్వనాథ్‌రెడ్డి చెప్పారు.
గండిపై ఎన్నో అనుమానాలు
గండి పడిన చోట కాలువ గట్టు దాదాపు 30 అడుగుల వెడల్పుతో ఎంతో పటిష్టంగా ఉంది. రెండేళ్ల క్రితం గట్టునుసీసీ లైనింగ్‌తో ఆధునికీకరించారు. దీంతో సహజ గండి పడేందుకు దాదాపు అవకాశాల్లేవు. దీంతో కర్ణాటక రైతులే గండి కొట్టి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కురుగోడు సమీపంలో ఓ పెద్ద చెరువు ఉంది. కురుగోడు చెరువు, వంక, తుంగభద్ర నది ఆధారంగా రైతులు వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువు, వంకకు నీటి సమస్య నెలకొనడం, తుంగభద్రలోనూ ప్రవాహం నిలిచిపోవడంతో వరి పంట ఎండుముఖం పట్టింది. దాన్ని రక్షించుకోవడానికి కాలువకు గండి పెట్టి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు కూడా ఇవే అనుమానాలు ఉండడంతో కురుగోడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని బోర్డు ఈఈ విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.
బోర్డు అధికారుల నిర్లక్ష్యం!
జలాశయం సమీపంలో 8.4 కి.మీ. మలుపు వద్ద ఓ వాగుకు నిర్మించిన రక్షణ గోడ దాదాపు శిథిలదశకు చేరుకుంది. గత ఏప్రిల్ నుంచి దాదాపు నాలుగు నెలల పాటు కాలువకు నీటి సరఫరా లేదు. ఆ సమయంలో బలహీనంగా మారిన రక్షణ గోడను కూల్చివేసి.. కొత్తది నిర్మించి ఉంటే నీటి సరఫరాలో అంతరాయం ఉండేది కాదని దిగువ కాలువ రైతులు అంటున్నారు. తమ గురించి బోర్డు అధికారులు అసలు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తాము ఏ ఏడాది పంట భూములను బీడుగా పెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రశ్నార్థకంగా మారిన సాగు
దిగువ కాలువకు జూలై 22న నీటి సరఫరా ప్రారంభమైంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా జరగలేదు. బోర్డు సరిహద్దు 250 కి.మీ. హానువాళు వద్ద 600 క్యూసెక్కులు నీరు సరఫరా చేయాలని జిల్లా సాగునీటి శాఖ అధికారులు బోర్డుకు ఇండెంట్ పెట్టారు. అయితే 200 నుంచి 400 క్యూసెక్కుల వరకు మాత్రమే సరఫరా అవుతోంది. దీనికి తోడు రక్షణ గోడ కూలి 12 రోజులు, ఇప్పుడు కురుగోడు వద్ద గండితో మరోసారి నీటి సరఫరా నిలిచిపోయింది. కాలువ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాలలో ఖరీఫ్‌లో 42,420 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇందులో ఇప్పటి వరకు 16వేల ఎకరాలలో మాత్రమే వరి నాట్లు వేశారు. మిగిలిన ఆయకట్టు భూములు బీడుగా ఉన్నాయి. రాష్ట్ర వాటా మేరకు నీటి సరఫరా జరగకపోవడం, గండ్లు పడుతుండడంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు ఎమ్మిగనూరు, కోడుమూరు సబ్‌డివిజన్లకు చుక్క నీరు చేరలేదు. ఈ సబ్ డివిజన్లలో నేటికీ ఎకరాలో కూడా వరి నాట్లు పడలేదు. ఎగువనున్న ఆలూరు, ఆదోని నియోజకవర్గాలలోని చివరి ఆయకట్టు భూములకు కూడా సాగునీరు అందడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment