జలాన్ని దేవతా రూపంలో తల్లిగా భావించి పూజించడం హిందువుల సంప్రదాయం. నదీస్నానాలు, కోనేటి స్నానాలు, మంగళ స్నానాలు, సముద్ర స్నానాలు... అలాగే తీర్థ యాత్రలు, పుణ్య క్షేత్రాలు దర్శనం... సమస్తం నీటితో ముడిపడి వున్నాయి. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్య ప్రదమని హిందువుల విశ్వాసం. సకల జీవరాశులకు ప్రధానమైన జలస్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు. ‘తుంగే పానీ.. గంగే స్నానే’ అన్నది ఆర్యోక్తి. గంగానదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని దీనికి అర్థం! అసలు తుంగభద్ర నది ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం...
హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో వేయగా శ్రీ మహావిష్ణువు వరాహావతారమెత్తి తన కోరలతో భూమిని సాగరం నుండి పైకెత్తి సర్వజీవులనూ రక్షించాడు. తుంగ (ఎత్తు) నుండి రావడం వల్ల తుంగానదిగానూ, హిరణ్యాక్షుని సంహరించే సమయంలో వరాహరూపుడైన విష్ణువు కుడి కోర నుండి కారిన లాలాజలం భద్రానదిగానూ ఉద్భవించాయి.
పుష్కరాలు జరిగే 12 నదులలో తుంగభద్ర ఒకటి. రాష్ట్రంలో చివరి తుంగభద్ర పుష్కరాలు 2008 లో జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి తుంగభద్ర పుష్కరాలు ఇవే. నవగ్రహాల్లో ఒకటైన గురు గ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో పరిభ్రమిస్తుంటుంది. బృహస్పతి మకరరాశిలో ప్రవేశించే సమయంలో తుంగభద్ర నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ముక్కోటి దేవతలు ఆ నదిలో కొలువై ఉంటారని, ఈ సమయంలో ఆ నదిలో స్నానమాచరించిన వారి పాపాలు తొలిగి.. పుణ్యం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రముఖ దేవాలయాలను తాకుతూ వెళుతున్న తుంగభద్ర..
కర్ణాటక: శృంగేరి (చిక్మగుళూరు), పంపావతి దేవాలయం(కంప్లి), హరిహరేశ్వర దేవాలయం(హంపి).
ఆంధ్రప్రదేశ్: రాఘవేంద్రస్వామి ఆలయం, (మంత్రాలయం), శివరామాలయం (గుండ్రేవుల).
తెలంగాణ: సంతాన వేణుగోపాలస్వామి ఆలయం (వేణిసోంపురం), వైకుంఠ నారాయణ స్వామి ఆలయం (రాజోళి), సూర్యనారాయణ స్వామి ఆలయం (పుల్లూరు), జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు (అలంపూర్), సంగమేశ్వరాలయం.
తుంగ, భద్ర నదులు కలసి కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తాయి. ఈ రెండు నదులు కలిసి తుంగభద్ర నదిగా మారి.. కర్ణాటకలో కృష్ణా పరివాహక ప్రాంతం మీదుగా ప్రవహిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేళగనూరు వద్ద ప్రవేశిస్తుంది. తెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కుట్కనూరు వద్ద తుంగభద్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం పులికల్, రాజోళి, పుల్లూరు మీదుగా సాగుతూ నదీతీరంలో కొలువైన దేవతల పాదాలను అభిషేకిస్తూ.. సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. తుంగభద్ర నది రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత సుమారు 90 కిలోమీటర్ల మేర ప్రవహించి సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో సంగమం అవుతున్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో తుంగభద్ర నది జలకళను సంతరించుకుంది.
పుష్కరాల సందర్భంగా పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేసింది. పిండ ప్రదానం తదితర కార్యక్రమాలకు రేట్లను ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ నిర్ధారించి, ఆ వివరాలను వీటి కోసం కేటాయించిన షెడ్ల వద్ద ప్రదర్శించనుంది. పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా దేవదాయ శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. కాగా నేటి మధ్యాహ్నం కర్నూలు జిల్లాలోని సంకల్‌బాగ్ పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహనరెడ్డి పాల్గొంటారు.
– ఇన్‌పుట్స్:
అంబటి తిరుమలేష్
సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజమ్
Comments
Please login to add a commentAdd a comment