బియాస్.. జాడేది?
స్కానర్కూ అందని విద్యార్థుల ఆచూకీ
ఫలితమివ్వని పదోరోజు సెర్చింగ్
గాలింపు చర్యల్లో తెలంగాణ పోలీస్ బృందం
పర్యవేక్షిస్తున్న ఇక్కడి డీజీపీ
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పదో రోజైన మంగళవారం చేపట్టిన గాలింపు చర్యలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. నావికా దళానికి చెందిన అత్యాధునిక పరికరం సైడ్ స్కాన్ సోనార్‌ను వినియోగిస్తున్నారు.
లార్జీ డ్యామ్-పండో డ్యామ్‌ల మధ్య ఉన్న ప్రాంతాన్ని మంగళవారం తెలంగాణ స్పెషల్ పోలీసు అదనపు డీజీ రాజీవ్ త్రివేది, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ కార్తికేయ నేతృత్వంలోని 15 మంది తెలంగాణ రాష్ట్ర పోలీసు వాటర్ స్పోర్ట్స్ టీమ్ సిబ్బంది స్థానిక అధికారుల సాయంతో జల్లెడపట్టారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సైతం మంగళవారం అక్కడికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. లార్జీ డ్యామ్‌కు ఎగువన ఆదివారం భారీ వర్షం కురవడంతో సెర్చ్ ఆపరేషన్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. లార్జీ డ్యామ్ నుంచి దిగువకు వస్తున్న నీటి ప్రవాహం గణనీయంగా పెరిగిపోవడం, బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పూర్తిస్థాయిలో ఆపరేషన్ జరగట్లేదని రాజీవ్ త్రివేది ‘సాక్షి’కి తెలిపారు.
- సాక్షి, హైదరాబాద్.