water survey
-
వాటర్.. బెటర్!
సాక్షి, సిటీబ్యూరో: వచ్చే వేసవిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ‘అడ్వాన్స్ సమ్మర్ స్పెషల్ యాక్షన్ ప్లాన్– 2025’ కు జలమండలి సిద్ధమైంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సూక్ష్మస్థాయిలో తాగునీటి సమస్యపై పర్యవేక్షణ కోసం ఫిబ్రవరి 15 నుంచి జూన్ 15 వరకు ‘120 డేస్ మైక్రో వాటర్ మానిటరింగ్ డ్రెవ్’ నిర్వహించాలని నిర్ణయించింది. అంతకు ముందు క్షేత్రస్థాయి పరిస్థితిపై సమగ్ర పరిశీలన కోసం ఈ నెల 5 నుంచి 20 రోజుల పాటు ‘ప్రీ సమ్మర్ వాటర్ సర్వే’కు శ్రీకారం చుట్టనుంది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏ మేరకు ఉంటుంది? ఏయే ప్రాంతాల్లో సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని ముందస్తుగానే గుర్తించనుంది. సెక్షన్ మేనేజర్ పరిధిలో పరిస్థితులపై సమగ్రంగా పరిశీలించి వేసవిలో నీటి ఎద్దడిపై అంచనాపై నివేదికలు రూపొందించేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ఈ నెల మొదటి వారంలో ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించి ప్రీ సమ్మర్ వాటర్ సర్వేపై దశాదిశ నిర్దేశించనుంది. అవసరాలు పెరిగినా.. గత పదేళ్లలో దేశం నలు మూలల నుంచి వలసలు పెరగడంతో హైదరాబాద్ నగరంలో 30 శాతం జనాభా పెరిగింది. మరోవైపు జలమండలి పరిధి విస్తరించింది. నల్లా కనెక్షన్లు అదే స్థాయిలో పెరిగాయి. ప్రధాన జలాశయాల్లో తాగునీటి కేటాయింపు మాత్రం పెరగలేదు. ప్రస్తుతం పదేళ్ల నాటి కేటాయింపుల నీటి సరఫరా జరుగుతోంది. వేసవిలో అవసరమైతే ఎప్పటి మాదిరిగానే అదనంగా పది ఎంజీడీలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరాలు పెరిగినా.. కేటాయింపులు పెరగక పోవడంతో ఉన్న నీటిని సర్దుబాటు చేసుకునేందుకు జలమండలి వృథా నీటిపై దృష్టి సారించింది. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైనా.. భూగర్భ జలాలు పలు ప్రాంతాల్లో ఆశాజనకంగా పెరగలేదు. ఈ నేపథ్యంలో నీటికి భారీగా డిమాండ్ ఎదురయ్యే అవకాశం ఉంటుందని జలమండలి అంచనా వేసింది. గత వేసవిలో ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు డెడ్‌స్టోరేజీకి చేరడంతో అత్యవసర పంపింగ్ తప్పలేదు. ఈసారి అలాంటి సమస్య పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించింది. ట్యాంకర్ల బుకింగ్ సర్దుబాటు వేసవిలో డిమాండ్‌కు తగ్గ ట్యాంకర్లలను సకాలంలో సరఫరా చేసేలా జలమండలి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఒక ఫిల్లింగ్ స్టేషన్లో డిమాండ్ అధికంగా ఉండి.. దగ్గరలోని మరో ఫిల్లింగ్ స్టేషన్లో డిమాండ్ తక్కువగా ఉంటే అక్కడికి క్యాన్ నంబర్ ట్రాన్స్ఫర్తో సర్దుబాటు చేసేలా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తోంది. మరోవైపు ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ట్యాంకర్ ట్రిప్ కూడా అక్రమంగా బయటకు వెళ్లకుండా కట్టడి చేసేందుకు బాధ్యులైన ఆపరేటర్‌పై భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించింది. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ పనితీరుపై పర్యవేక్షణ æకోసం డీజీఎం స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించనుంది. ప్రతి ట్యాంకర్ బుకింగ్ ఎంసీసీ ద్వారానే జరిగే విధంగా చర్యలు చేపట్టనుంది. రాత్రి పూట ప్రత్యేక షిఫ్ట్ రాతి వేళల్లో కమర్షియల్, బల్క్ వినియోగదారుల కోసం ట్యాంకర్లను సరఫరా చేసేలా ప్రత్యేకంగా షిఫ్ట్ నడిపించాలని జలమండలి నిర్ణయించింది. పగటి వేళల్లో గృహావసరాలకు మాత్రమే ట్యాంకర్లు సరఫరా చేసి రాత్రి వేళల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, ఆసుపత్రులు ఇతరత్రా వాణిజ్య అవసరాలకు సంబంధించి ట్యాంకర్లను సరఫరా చేసేలా చర్యలు చేపట్టనుంది. కాగా.. ఇప్పటికే ఐటీ సంస్కరణలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్ర స్థాయి పనితీరు పర్యవేక్షిస్తున్న జలమండలి తాజాగా వేసవిలో తాగు నీటి సరఫరాపై కూడా డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షణకు సిద్ధమైంది. తాగునీటి సరఫరాపై సూక్ష్మ స్థాయి పర్యవేక్షణ వేసవిలో సమర్థంగా తాగునీరు సరఫరా చేసేందుకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు సూక్ష్మ స్థాయి ప్రణాళికకు సిద్ధమయ్యాం. తాగు నీటిసమస్య ఉత్పన్నమయ్యే ప్రాంతాలు గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. సూక్ష్మ స్థాయి పర్యవేక్షణతో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. – అశోక్ రెడ్టి, జలమండలి ఎండీ -
జూరాల, సాగర్ భద్రతపై ‘త్రినేత్రం’!
-
జూరాల, సాగర్ భద్రతపై ‘త్రినేత్రం’!
* ద్రోన్ కెమెరాలతో అండర్ వాటర్ సర్వే * ఢిల్లీ డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ తరహాలోనే... * సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం * కార్యాచరణ సిద్ధం చేస్తున్న అధికారులు * ఫలితాలకు అనుగుణంగా చర్యలు * జాతీయ సంస్థకు బాధ్యతలు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల భద్రతపై సర్కారు దృష్టిసారించింది. వాటి రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ అవసరమైన చోట పూర్తిస్థాయి మరమ్మతులు చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం నూతన సాంకేతిక పరిజ్ఞానం సాయం తీసుకోనుంది. ప్రాజెక్టుల భూగర్భ స్థితిగతులు, పునాదుల అంచనా, గేట్ల పరిస్థితి, లీకేజీల గుర్తింపు సహా ప్రాజెక్టుల లోపలి ప్రాంతాల నిశిత అధ్యయనానికి ‘ద్రోన్’ కెమెరాలతో సర్వే చేయించాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణలో భాగంగా పైప్‌లైన్ లీకేజీలు, పగుళ్లను ‘ద్రోన్’ కెమెరాలతో గుర్తిస్తున్న తరహాలోనే ప్రాజెక్టుల్లో ‘అండర్ వాటర్ సర్వే’ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తొలి దశలో జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో ఈ తరహా సర్వే చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఫలితాలకు అనుగుణంగా రక్షణ చర్యలు చేపట్టాలని భావిస్తోంది. గతంలోనే సూచించిన కేంద్రం... కృష్ణా నదీ పరీవాహకంలో వరదను ఎదుర్కొనే కసరత్తు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. మునుపటి భయానక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టుల భద్రతకు పెద్దపీట వేయాలని రాష్ట్రాలను గతంలోనే ఆదేశించింది. ఇందులో భాగంగా డ్యామ్‌ల పునాదుల నిర్మాణ పరిస్థితులను తొలుత అంచనా వేయాలని, గరిష్ట నీటి ప్రవాహాలు వచ్చినప్పుడు అక్కడున్న పరిస్థితులను అధ్యయనం (హైడ్రాలిక్ మోడల్ సర్వే) చేయాలని సూచించింది. డ్యామ్‌ల నిర్వహణ, భద్రతకు ప్రాధాన్యమిస్తూ నీటిని కిందకు వద లడంలో కీలకమైన క్రస్ట్‌గే ట్లు, వాటిని పైకి, కిందకు లాగేందుకు ఉపయోగించే వైర్ రోప్స్ల నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించింది. రోప్‌వైర్లు బలం గా ఉంటేనే గేట్లను ఎత్తిదించడం సాధ్యమవుతుంది. లేదంటే గేట్లు తెరుచుకోవడం కష్టం. దీంతోపాటే గేట్లకు ఎప్పటికప్పుడు పెయింటింగ్ వేయడం సైతం ముఖ్యం. పెయింటింగ్ వేయకుంటే అవి తుప్పుపట్టి గేట్లకు రంధ్రాలు ఏర్పడి డ్యామ్‌ల నుంచి లీకేజీలు జరిగే అవకాశం ఉంది. ఇది మొత్తంగా డ్యామ్‌ల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. ప్రాజెక్టుల వాస్తవ కెపాసిటీని దాటి వరద వచ్చిన సందర్భాల్లో డ్యామ్‌ల క్రస్ట్‌గేట్ల నిర్వహణ సరిగా లేకున్నా, లీకేజీలు ఉన్నా ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్రాలపైఉందని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇంతవరకు రాష్ట్ర పరిధిలో అలాంటి చర్యలేవీ జరగలేదు. ముఖ్యంగా జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని డ్యామ్ సేఫ్టీ ప్యానళ్లు సైతం మరమ్మత్తుల అంశాన్ని మునుపటి పభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల పూర్తిస్థాయి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలకు ఉపక్రమించింది. ప్రాజెక్టుల స్థితిగతులకు సమగ్ర అధ్యయనానికి అండర్ వాటర్ సర్వే చేయించాలని నీటిపారుదలరంగ నిపుణులు ఇటీవలే ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా అందుకు సమ్మతించిన ప్రభుత్వం ద్రోన్ కెమెరాలతో సర్వే చేయాలని సూచించింది. జాతీయ సంస్థకు బాధ్యతలు : ప్రాజెక్టుల్లో అండర్ వాటర్ సర్వే బాధ్యతలను ఓ జాతీ య సంస్థకు కట్టబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టులో ఇలాంటి సర్వే చేసినప్పుడు దాని బాధ్యతలను గోవాకు చెందిన ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ’కి అప్పగించారు. భూగర్భ స్థితిగతులను, పునాది నిర్మాణాలను చిత్రీకరించడం ద్వారా అప్పట్లో ప్రాజెక్టు స్థితిగతులను అం చనా వేయగా ఇప్పుడు కచ్చితమైన త్రీడీ ఫోటోలతోపాటు భిన్న కోణాల్లో వీడియో తీయగలిగే ద్రోన్ కెమెరాలను వాడాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలాంటి ఆపరేషన్లలో విశేష అనుభవమున్న ఆ సంస్థ ప్రతినిధులు కొందరు ఇటీవలే ప్రభుత్వ పెద్దలను కలవగా వారు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.