జూరాల, సాగర్ భద్రతపై ‘త్రినేత్రం’! | Jurala, Sagar security and surveillance | Sakshi
Sakshi News home page

జూరాల, సాగర్ భద్రతపై ‘త్రినేత్రం’!

Published Mon, Jul 20 2015 2:46 AM | Last Updated on Fri, May 25 2018 1:14 PM

జూరాల, సాగర్ భద్రతపై ‘త్రినేత్రం’! - Sakshi

జూరాల, సాగర్ భద్రతపై ‘త్రినేత్రం’!

* ద్రోన్ కెమెరాలతో అండర్ వాటర్ సర్వే
* ఢిల్లీ డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ తరహాలోనే...
* సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం
* కార్యాచరణ సిద్ధం చేస్తున్న అధికారులు
* ఫలితాలకు అనుగుణంగా చర్యలు
* జాతీయ సంస్థకు బాధ్యతలు!

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల భద్రతపై సర్కారు దృష్టిసారించింది. వాటి రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ అవసరమైన చోట పూర్తిస్థాయి మరమ్మతులు చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం నూతన సాంకేతిక పరిజ్ఞానం సాయం తీసుకోనుంది. ప్రాజెక్టుల భూగర్భ స్థితిగతులు, పునాదుల అంచనా, గేట్ల పరిస్థితి, లీకేజీల గుర్తింపు సహా ప్రాజెక్టుల లోపలి ప్రాంతాల నిశిత అధ్యయనానికి ‘ద్రోన్’ కెమెరాలతో సర్వే చేయించాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణలో భాగంగా పైప్‌లైన్ లీకేజీలు, పగుళ్లను ‘ద్రోన్’ కెమెరాలతో గుర్తిస్తున్న తరహాలోనే ప్రాజెక్టుల్లో ‘అండర్ వాటర్ సర్వే’ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తొలి దశలో జూరాల, నాగార్జునసాగర్  ప్రాజెక్టుల్లో ఈ తరహా సర్వే చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఫలితాలకు అనుగుణంగా రక్షణ చర్యలు చేపట్టాలని భావిస్తోంది.
 
 గతంలోనే సూచించిన కేంద్రం...
 కృష్ణా నదీ పరీవాహకంలో వరదను ఎదుర్కొనే కసరత్తు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. మునుపటి భయానక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని  ప్రాజెక్టుల భద్రతకు పెద్దపీట వేయాలని రాష్ట్రాలను గతంలోనే ఆదేశించింది. ఇందులో భాగంగా డ్యామ్‌ల పునాదుల నిర్మాణ పరిస్థితులను తొలుత అంచనా వేయాలని, గరిష్ట నీటి ప్రవాహాలు వచ్చినప్పుడు అక్కడున్న పరిస్థితులను అధ్యయనం (హైడ్రాలిక్ మోడల్ సర్వే) చేయాలని సూచించింది. డ్యామ్‌ల నిర్వహణ, భద్రతకు ప్రాధాన్యమిస్తూ నీటిని కిందకు వద లడంలో కీలకమైన క్రస్ట్‌గే ట్లు, వాటిని పైకి, కిందకు లాగేందుకు ఉపయోగించే వైర్ రోప్స్‌ల నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించింది. రోప్‌వైర్లు బలం గా ఉంటేనే గేట్లను ఎత్తిదించడం సాధ్యమవుతుంది. లేదంటే గేట్లు తెరుచుకోవడం కష్టం. దీంతోపాటే గేట్లకు ఎప్పటికప్పుడు పెయింటింగ్ వేయడం సైతం ముఖ్యం. పెయింటింగ్ వేయకుంటే అవి తుప్పుపట్టి గేట్లకు రంధ్రాలు ఏర్పడి డ్యామ్‌ల నుంచి లీకేజీలు జరిగే అవకాశం ఉంది. ఇది మొత్తంగా డ్యామ్‌ల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. ప్రాజెక్టుల వాస్తవ కెపాసిటీని దాటి వరద వచ్చిన సందర్భాల్లో డ్యామ్‌ల క్రస్ట్‌గేట్ల నిర్వహణ సరిగా లేకున్నా, లీకేజీలు ఉన్నా ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్రాలపైఉందని కేంద్రం స్పష్టం చేసింది.
 
 అయితే ఇంతవరకు రాష్ట్ర పరిధిలో అలాంటి చర్యలేవీ జరగలేదు. ముఖ్యంగా జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని డ్యామ్ సేఫ్టీ ప్యానళ్లు సైతం మరమ్మత్తుల అంశాన్ని మునుపటి పభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల పూర్తిస్థాయి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలకు ఉపక్రమించింది. ప్రాజెక్టుల స్థితిగతులకు సమగ్ర అధ్యయనానికి అండర్ వాటర్ సర్వే చేయించాలని నీటిపారుదలరంగ నిపుణులు ఇటీవలే ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా అందుకు సమ్మతించిన ప్రభుత్వం ద్రోన్ కెమెరాలతో సర్వే చేయాలని సూచించింది.
 
 జాతీయ సంస్థకు బాధ్యతలు : ప్రాజెక్టుల్లో అండర్ వాటర్ సర్వే బాధ్యతలను ఓ జాతీ య సంస్థకు కట్టబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టులో ఇలాంటి సర్వే చేసినప్పుడు దాని బాధ్యతలను గోవాకు చెందిన ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ’కి అప్పగించారు. భూగర్భ స్థితిగతులను, పునాది నిర్మాణాలను చిత్రీకరించడం ద్వారా అప్పట్లో ప్రాజెక్టు స్థితిగతులను అం చనా వేయగా ఇప్పుడు కచ్చితమైన త్రీడీ ఫోటోలతోపాటు భిన్న కోణాల్లో వీడియో తీయగలిగే ద్రోన్ కెమెరాలను వాడాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలాంటి ఆపరేషన్లలో విశేష అనుభవమున్న ఆ సంస్థ ప్రతినిధులు కొందరు ఇటీవలే ప్రభుత్వ పెద్దలను కలవగా వారు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement