water tomb
-
మధ్యదరాలో 170 మంది జలసమాధి!
ట్రిపోలి: ఉత్తర ఆఫ్రికా నుంచి యూరప్ బయల్దేరిన రెండు పడవలు మధ్యదరా సముద్రంలో మునిగిపోయిన ప్రమాదాల్లో కనీసం 170 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అందులో ఒకటి లిబియా తీరంలో మునిగిపోగా, మరొకటి మొరాకో సమీపంలో మరో పడవను ఢీకొట్టి గల్లంతైనట్లు తెలిసింది. లిబియా తీరంలో ప్రమాదానికి గురైన పడవలో 120 మంది ప్రయాణిస్తున్నారని, అందులో ముగ్గురిని ప్రాణాలతో కాపాడినట్లు ఇటలీ నేవీ ప్రకటించింది. మిగతా వారి జాడ తెలియాల్సి ఉందని తెలిపింది. మొరాకో సమీపంలో వేరే పడవ మరో పడవను ఢీకొనడంతో 53 మంది వలసదారులు గల్లంతైనట్లు స్పెయిన్ సహాయక బృందాలు వెల్లడించాయి. ఈ రెండు ప్రమాదాల్లో ఎందరు మృతిచెందారో ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా, లిబియాకు ఉత్తరంగా ఉన్న జువారా పట్టణంలో ప్రమాదంలో చిక్కుకున్న పడవ నుంచి 47 మందిని కాపాడినట్లు జర్మనీ సహాయక బృందాలు తెలిపాయి. గత ఏడాది మధ్యదరాలో 2 వేల మందికి పైగా వలసదారులు మృతి చెందడమో, గల్లంతవడమో జరిగింది. -
టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం
-
126 మంది జల సమాధి
నైరోబి: టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. విక్టోరియా లేక్‌లో గురువారం పడవ మునిగిన ఘటనలో 126 మంది మృతి చెందారు. సహాయ సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం వరకు 126 మృత దేహాలను వెలికి తీశారని, మరికొన్నిటిని గుర్తించారని టాంజానియాæ రవాణా మంత్రి ఇసాక్ కమ్వెలె చెప్పారు. బాధితులంతా బుగొలొరా పట్టణంలో జరిగిన సంత నుంచి తిరిగి వస్తున్నారు. ఉకారా తీరం 50 మీటర్ల దూరంలో ఉందనగా కిందికి దిగే ప్రయత్నంలో అంతా పడవకు ఒకే వైపునకు చేరడంతో పడవబోల్తాపడింది. ప్రయాణికుల సంఖ్యకు సంబంధించి నిర్వాహకుల వద్ద ఎలాంటి రికార్డులూ లేకపోవడంతో గల్లంతైన వారి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. వందమందిని మాత్రమే తీసుకెళ్లే ఎంవీ న్యెరెరె అనే ఈ పడవలో రెట్టింపు సంఖ్యలో 200 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు అధికార వార్తా సంస్థ తెలిపింది. పాతకాలం నాటి ఈ పడవలో ప్రయాణికులతోపాటు పెద్ద మొత్తం లో సిమెంటు, మొక్కజొన్న, పండ్లు వంటి లగేజి కూడా ఉందని చెబుతున్నారు. టాంజాని యా, ఉగాండా, కెన్యాల పరిధిలో 27వేల చద రపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న విక్టోరియా లేక్‌లో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం. -
సముద్ర తీరంలో 180 మంది జలసమాధి!
-
180 మంది జలసమాధి!
లిబియాలో సముద్ర తీరంలో ప్రమాదం రోమ్: ఐరోపా దేశాల్లో వలసల బతుకులు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. మరుభూమిగా మారిన తమ దేశంలో బతుక లేక... మర పడవల్లో పొరుగు దేశాలకు పయనమవుతున్న శరణార్థులు మధ్యధరా సముద్రంలో జలసమాధి అవుతున్నారు. తాజాగా లిబియా నుంచి ఇటలీకి వెళుతున్న శరణార్థుల్లో 180 మంది మధ్యధరా సముద్రంలో గల్లంతయ్యారు. తూర్పు ఆఫ్రికాకు చెందిన వీరంతా మరణించారని భావిస్తున్నారు. ఏడాది ఆరంభంలో ఇది అతిపెద్ద విషాదం. శనివారం లిబియా తీరంలో బయలుదేరిన టూటైర్ పడవ... సముద్రంలో ఐదు గంటలు ప్రయాణించింది. ఆ సమయంలో మోటారు చెడిపోయింది. క్రమంగా పడవలోకి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. ఒక్కొక్కరుగా ప్రయాణికులు నీటిలో మునిగిపోయారని ప్రత్యక్ష సాక్షుల కథనం ఆధారంగా అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదం నుంచి తప్పించుకున్న 38 మంది వలసదారులు మంగళవారం ట్రపానిలోని సిసిలియాన్ నౌకాశ్రయానికి చేరుకున్నారు. గత ఏడాది వేలాది మంది వలస బాటలో ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం), ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) ప్రతినిధులు, రెస్క్యూ బృందాలు మృతదేహాల కోసం గాలిస్తున్నాయి. 2016లో దాదాపు 1.81 లక్షల మంది శరణార్థులు ఇటలీ తీరానికి చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి. -
ఆరని కన్నీటి తడి
గోదావరిఖని: జీడీకే-7ఎల్ఈపీ ఘోర దుర్ఘటనకు సోమవారంతో పదకొండేళ్లు నిండాయి. ఈ ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న 17 మంది కార్మికులు జలసమాధి అయ్యారు. 2003 జూన్ 16న ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీ జరిగి పదేళ్లు గడిచాయి. బొగ్గు వెలికితీసిన స్థలంలో ఇసుక నింపకపోవడం వల్లనే అందులో నీరు చేరిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అయినప్పటికీ నాడు దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు మాత్రం తీసుకోలేదు. ఏటా జూన్ 16న మృతి చెందిన కార్మికులను స్మరించుకుని వారికి శ్రద్ధాంజలి ఘటించడం తప్ప చేసిందేమీ లేదని కార్మికులు అంటున్నారు. కార్మిక సంఘాలు గట్టి పట్టుతో డిమాండ్ చేయలేకపోవడం వల్లనే బాధ్యులైన అధికారులు తప్పించుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగకపోవడంతో పదకొండేళ్లుగా వారి కన్నీటి తడి ఆరడం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే.. 2003 జూన్ 16న ఉదయం షిఫ్టులో విధులకు వెళ్లిన 17 మంది కార్మికులు విధుల్లో నిమగ్నమయ్యారు. కొద్దిసేపటికే గనిలోని మూడో లెవల్లో ఊట నుంచి ఒక్కసారిగా నీరు ఉబికి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులంతా ప్రాణభయంతో తప్పించుకునే యత్నం చేశారు. కానీ అప్పటికే నీటి ప్రవాహం పెరగడంతో అందులో చిక్కుకున్నారు. హెడ్ ఓవర్‌మెన్ కైరి మల్లయ్య, ఎలక్ట్రీషియన్ రాపెల్లి మల్లయ్య, ఫిట్టర్ కుంట సమ్మయ్య, టింబర్‌మెన్ పుల్యాల నర్సయ్య, జనరల్ మజ్దూర్లు ఇజ్జగిరి రాంచందర్, దాసరి సత్యనారాయణ, ఆరెళ్లి వెంకటి, బదిలీ ఫిల్లర్లు రాగం బాపు, కె.వెంకటస్వామి, కుక్కల కొమురయ్య, కేవీ.శ్రీనివాస్, తాళ్ల తిరుపతి, తాటికొండ శ్రీనివాస్, కోల్ఫిల్లర్లు కె.గోపాల్‌రెడ్డి, పులి వెంకటి, లెక్కల బుచ్చయ్య, ట్రామర్ తాడూరి రాయమల్లు జలసమాధి అయ్యారు. నీటిలో చిక్కుకోవడంతో శరీరాలు ఉబ్బి కనీసం మృతదేహాలను చూసేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. విచారణ జరిగినా...చర్యలు శూన్యం ఈ ఘటనపై అప్పటి హైకోర్టు జడ్జి జస్టిస్ బిలాల్నజ్కీ, రిటైర్డ్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఏకే.రుద్రా, ట్రేడ్ యూనియన్ నాయకుడు కమలేష్ సహాయ్‌తో కూడిన కమిటీ విచారణ చేసింది. సుమారు ఎనిమిది పర్యాయాలు గోదావరిఖని సింగరేణి బి-గెస్ట్‌హౌస్‌లో విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతోపాటు డీజీఎంఎస్ అధికారులు గోదావరిఖని మున్సిఫ్ కోర్టులో సింగరేణి అధికారులపై దావా వేశారు. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. ఈ సంఘటన జరిగిన తర్వాత గని ఏజెంట్ నాగయ్య, మేనేజర్ రవితోపాటు సేఫ్టీ ఆఫీసర్, సర్వే ఆఫీసర్లను బాధ్యులు చేస్తు యాజమాన్యం కొంతకాలం వీరిని సస్పెన్షన్‌లో ఉంచింది. తర్వాత వీరందరికీ పదోన్నతులను కల్పించింది. 17 మంది కార్మికులు చనిపోయిన నేపథ్యంలో సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గనిని సందర్శించారు. ఆ సమయంలో ఆయనను అడ్డుకుని ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. దీంతో ఆయన రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్ ఉన్నప్పటికీ గుర్తింపు సంఘాలు కూడా ప్రేక్షకపాత్ర వహించాయి. విచారణ పూర్తి చేసినప్పటికీ దాన్ని బహిర్గత పరచాలని ఏ సంఘం కూడా గట్టిగా పట్టుపట్టకపోవడం విచారకరం. ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన నేపథ్యంలో నూతన ప్రభుత్వం మృతుల కుటుంబాల సంక్షేమానికి పాటుపడాలని కార్మికవర్గం కోరుతోంది. నేడు గని వద్ద సంస్మరణ సభ జీడీకే-7 ఎల్ఈపీ గని ప్రమాదంలో మృతిచెందిన 17 మంది కార్మికులు, సూపర్వైజర్లను స్మరిస్తూ సోమవారం ఉదయం 7 గంటలకు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి గని అధికారులతోపాటు కార్మిక సంఘాల నాయకులు, మృతిచెందిన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు,స్నేహితులు హాజరుకానున్నారు.