
లిబియా తీరంలో ప్రమాదం నుంచి బయటపడిన వలసదారుల హర్షం
ట్రిపోలి: ఉత్తర ఆఫ్రికా నుంచి యూరప్ బయల్దేరిన రెండు పడవలు మధ్యదరా సముద్రంలో మునిగిపోయిన ప్రమాదాల్లో కనీసం 170 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అందులో ఒకటి లిబియా తీరంలో మునిగిపోగా, మరొకటి మొరాకో సమీపంలో మరో పడవను ఢీకొట్టి గల్లంతైనట్లు తెలిసింది. లిబియా తీరంలో ప్రమాదానికి గురైన పడవలో 120 మంది ప్రయాణిస్తున్నారని, అందులో ముగ్గురిని ప్రాణాలతో కాపాడినట్లు ఇటలీ నేవీ ప్రకటించింది. మిగతా వారి జాడ తెలియాల్సి ఉందని తెలిపింది.
మొరాకో సమీపంలో వేరే పడవ మరో పడవను ఢీకొనడంతో 53 మంది వలసదారులు గల్లంతైనట్లు స్పెయిన్ సహాయక బృందాలు వెల్లడించాయి. ఈ రెండు ప్రమాదాల్లో ఎందరు మృతిచెందారో ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా, లిబియాకు ఉత్తరంగా ఉన్న జువారా పట్టణంలో ప్రమాదంలో చిక్కుకున్న పడవ నుంచి 47 మందిని కాపాడినట్లు జర్మనీ సహాయక బృందాలు తెలిపాయి. గత ఏడాది మధ్యదరాలో 2 వేల మందికి పైగా వలసదారులు మృతి చెందడమో, గల్లంతవడమో జరిగింది.