మధ్యధరాలో పడవల మునక..250 మంది మృతి!
రోమ్: మధ్యధరా సముద్రంలో 250 మంది ఆఫ్రికన్ శరణార్థులు మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. లిబియా తీరానికి 15 కి.మి. దూరంలో సగం మునిగి, సగం తేలుతున్న రెండు రబ్బరు బోట్లను సహాయక సిబ్బంది గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మునిగిపోయిన బోట్ల సమీపంలో ఐదు మృతదేహాల్ని స్పెయిన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ సహాయక బోటు వెలికితీసింది. ఆ పడవల్లో భారీగా శరణార్థులు ఉండొచ్చని స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒక్కో పడవకు 120 నుంచి 140 మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందని చెప్పారు. మొత్తంగా 250 మంది శరణార్థులు మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. లభ్యమైన మృతదేహాలు ఆఫ్రికన్లవని, వారి వయసు 16–25 మధ్య ఉండొచ్చని వెల్లడించారు.