water - tree
-
అంచనాలు.. అను‘మతిపోవాల్సిందే’ !
► నీరు–చెట్టులో ఆమ్యామ్యాలు ► అధికారులకు ఏకంగా 22 శాతం కమీషన్ ► అధికార పార్టీ నేతలకు 15 శాతం ► కలెక్టర్‌కు చేరిన ఫిర్యాదులు ► సీఎంఓకూ ఫిర్యాదు చేసేందుకు మరికొందరు సమాయత్తం సాక్షి ప్రతినిధి, కర్నూలు: నీరు–చెట్టు పనుల్లో అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అంచనాలు వేయడం మొదలు.. అనుమతులు వచ్చే వరకూ కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య సమన్వయంతో వ్యవహారం మొదలవుతోంది. ఇక నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు తమకు ఇష్టం వచ్చిన వారికి పనులు అప్పగిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు 15 శాతం మేరకు కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, అధికార పార్టీ నేతలను తలదన్నేలా అధికారులు ఏకంగా 22 శాతం కమీషన్ తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంచనాలు రూపొందించడంలోనే అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కమీషన్ల దందాపై నేరుగా కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మరోవైపు నీరు–చెట్టు పనుల్లో కమీషన్లు బాగా ముట్టజెప్పిన నియోజకవర్గాల్లో పనుల విలువను అమాంతంగా పెంచేస్తున్నారని కొద్ది మంది అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి(సీఎంఓ) ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. అంచనాల నుంచే మొదలు...! నీరు–చెట్టు పనుల్లో అవినీతి వ్యవహారం మొత్తం అంచనాల వద్దే మొదలవుతోంది. ఒక్కో పనిని అంచనాలను రూపొందించేందుకే అధికారులు కాంట్రాక్టర్ల వద్ద నుంచి కమీషన్లను దండుకోవడం ప్రారంభమవుతోంది. ఒక్కో పని అంచనాను రూపొందించేందుకు రూ.15 వేల వరకూ తీసుకుంటున్నారని సమాచారం. ఇక అంచనాలను రూపొందించడంలోనే పని విలువను 30 నుంచి 50 శాతం వరకూ పెంచేస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకూ ఏకంగా 22 శాతం మేర కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని కాంట్రాక్టర్లే వ్యాఖ్యానిస్తున్నారు. దీనికితోడు అధికార పార్టీ నేతలకు 15 శాతం మేర కమీషన్ సమర్పించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ విధంగా కేవలం కమీషన్ల రూపంలోనే 37 శాతం పోను మిగిలిన దాంట్లో పనిచేసేది 40 నుంచి 50 శాతానికి మించే అవకాశం లేదని సాగునీటి శాఖ అధికారులే పేర్కొంటున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.200 కోట్ల విలువ చేసే 2,086 పనులకు అధికారిక అనుమతి లభించింది. ఫిర్యాదుల పరంపర...! నీరు–చెట్టు పనుల విషయంలో అధికార పార్టీ నేతల మధ్యే రగడ మొదలయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు గుప్పుమంటున్నాయి. ఈ విధంగా కొన్ని నియోజకవర్గాల్లో నీరు–చెట్టు పనుల్లో జరుగుతున్న తంతుపై అధికారపార్టీకి చెందిన నేతలే కొందరు నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అంచనాల విలువను కొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా 50 శాతం వరకూ పెంచిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. మరోవైపు ఒక నియోజకవర్గంలో తన వ్యతిరేకులకు నీరు–చెట్టు కాంట్రాక్టు పనులను సదరు ఎమ్మెల్యే 15 శాతం కమీషన్ తీసుకుని అప్పగించారంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే మండిపడుతున్నారు. ఈ విషయంపై నేరుగా సీఎంఓకే ఫిర్యాదు చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. నీరు–చెట్టు పనుల అప్పగింత వ్యవహారంలో ఉన్నతాధికారి భారీగానే కమీషన్లు దండుకుంటున్న విషయంపై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద రూ.200 కోట్ల విలువైన నీరు–చెట్టు పనులపై ఫిర్యాదులు కూడా అంతకు మించి వస్తుండటం గమనార్హం. -
మట్టినీ అమ్ముకుంటున్నారు
నీరు-చెట్టు కింద జిల్లావ్యాప్తంగా చేపట్టిన పనులు 5,102 మంజూరైన నిధులు రూ. 38.96 కోట్లు ఇప్పటివరకు 45శాతం పనులు కాగా.. అందులో 50 శాతం నిధులు దుర్వినియోగం సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం కొత్తూరు చెరువులోని మట్టిని ఇటుకల బట్టీకి తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. రోసనూరుకు చెందిన టీడీపీ నాయకుడు చెరువులో పూడికతీత పనులు చేయకుండా సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్ద ఉన్న గ్రావెల్‌తో కాలనీకి రోడ్డువేశారు. అశాఖ అధికారులతో కుమ్మక్కై నిధులు స్వాహా చేసే ప్రయత్నంలో ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. శిరసనంబేడు చెరువులో పూడికతీత పనులు చేపట్టకుండా టీడీపీకి చెందిన ఓ నాయకుడు రొయ్యల సాగు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటను తీసి నీరు-చెట్టు పథకం కింద నిధులు రాబట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో తమ్ముళ్లు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం భూగర్భజలాల అభివృద్ధి.. పర్యావరణ పరిరక్షణ కోసం ‘నీరు-చెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద జిల్లావ్యాప్తంగా 5,102 పనులును చేపట్టారు. ఇందులో ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో చెరువులు, అటవీశాఖ ద్వారా కుంటలు, డ్వామా పరిధిలో కాలువలు, చెరువుల పూడికతీత పనులు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి మొత్తం రూ.38.96 కోట్లు నిధులు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. చెరువుల్లో నుంచి తీసిన మట్టిన రైతుల పొలాలకు తరలించాల్సి ఉంది. అయితే అనేకచోట్ల టీడీపీ నాయకులు ఫ్యాక్టరీలు, ఇటుకబట్టీలు, కృష్ణపట్నం పోర్టుకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీరు-చెట్టు పథకం కింద ఇప్పటివరకు 45 శాతం నిధులు ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. అందులో 50 శాతం వరకు నిధులు దుర్వినియోగమైనట్లు అధికారి ఒకరు వెల్లడించారు. నీరు-చెట్టు పథకం కేవలం తమ్ముళ్లకు లబ్ధి చేకూర్చేందుకే ప్రవేశపెట్టారని అధికారులు కొందరు చెపుతున్నారు. పనులు చేయకపోయినా కాసులే జిల్లాలో అనేకచోట్ల టీడీపీ నేతలు గ్రామసభలు నిర్వహించుకుండానే పనులు చేపట్టారు. ఉదయగిరి, సూళ్లూరుపేట, గూడూరు, కావలి, కోవూరు, వెంకటగిరి పరిధిలోని కొన్ని చెరువుల్లో గతంలో పూడికతీత పనులు చేసి ఉన్నారు. వాటిని తాజాగా నీరు-చెట్టు కింద పనులు చేపట్టినట్లు రికార్డులు సృష్టించుకున్నట్లు సమాచారం. గతంలో ఎవరో పనులు చేసి ఉంటే.. తాజాగా టీడీపీ నేతలు చేసినట్లు గిమ్మిక్కులు చేసి నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఒక్క ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోనే రూ.56 లక్షల వరకు నిధులు దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలో 36 చెరువుల్లో రెండు విడతలుగా పనులు చేపట్టారు. ఒక్కో చెరువుకు రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.78 లక్షలు నిధులు మంజూరయ్యాయి. వాటిలో 60 శాతం నిధులు మింగేశారు. అదేవిధంగా సూళ్లూరుపేట, ఓజిలి, కోట, వాకాడు, చిల్లకూరు మండలాల్లో కొందరు మట్టిని అమ్ముకుని సొమ్ముచేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నాయుడుపేట పరిధిలో 20 చెరువుల్లో పనులు చేపడితే.. అందులో 50 శాతం మట్టిని అమ్మి సొమ్ముచేసుకున్నట్లు సమాచారం. సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలో చేపట్టిన చెరువు పనుల్లోనూ పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెరువులో గ్రావెల్ తీసి దాన్ని రెండు రకాలుగా వినియోగించి బిల్లులు చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి జెడ్పీ మీటింగ్‌లో అధికారులను నిలదీశారు. ఇకపోతే జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికే చెరువు మట్టిని తరలించాలి. అలాకాకుండా వేరొకరికి తరలిస్తే నిధులు మంజూరుకాకుండా అడ్డుకుంటున్నట్లు పలు ప్రాంతాల నుంచి రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినట్ల్లు తెలిసింది. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో నీరు-చెట్టు పథకంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి నిధులు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
నీరు.. చెట్టు.. ఎక్కని మెట్టు!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం ముక్కుతూ మూల్గుతోంది. రెండు నెలలు గడిచినా లక్ష్యం చేరుకోలేకపోవడం అసలు ఉద్దేశాన్ని నీరుగారుస్తోంది. మొక్కల పెంపకంతో పాటు ప్రతి నీటి బొట్టును పొదుపు చేయాలనే ఆశయానికి ఆదిలోనే చుక్కెదురవుతోంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం.. జల వనరులు, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా చెరువుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి సమీపంలోని రైతుల పొలాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. పనుల తీరుతెన్నులను పరిశీలిస్తే లక్ష్యం ఎన్నటికి నెరవేరుతుందోననే అనుమానం కలుగక మానదు. వాస్తవానికి పనులు జూన్ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా.. పూడిక తరలింపునకు రైతులు ఆసక్తి కనబర్చకపోవడంతో మొదటికే మోసమొచ్చినట్లయింది. జిల్లాలో మొదటి విడత నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా 13 నియోజకవర్గాల్లోని 22 చెరువుల్లో పూడికతీతకు అనుమతి లభించింది. ఇందుకోసం రూ.4.41 కోట్లు కేటాయించారు. జల వనరుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులకు నేరుగా ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుండగా.. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని పనులకు ఉపాధిహామీ నిధులను డ్వామా కేటాయిస్తోంది. జలవనరులు శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులకు జేసీబీలు, పొక్లెయిన్లు ఉపయోగించే వీలుండగా.. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలోని పనులను ఉపాధి కూలీలతోనే చేయించాలని నిర్ణయించారు. పనులు ప్రారంభించింది మొదలు.. సిబ్బందితో పాటు పొక్లెయిన్లు, జేసీబీల కొరతతో సగం కాలం గడిచిపోయింది. ఇప్పుడిప్పుడే పనులు గాడిన పడుతున్నాయనుకుంటున్న తరుణంలో పూడికను తరలించేందుకు రైతులు ముందుకు రాకపోవడం అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక ట్రాక్టర్ పూడిక తరలింపునకు ప్రభుత్వం రూ.200 మాత్రమే ఇస్తుండగా.. యజమానులు ఆ మొత్తానికి ట్రాక్టర్ పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగా ఆర్థిక స్థోమత కలిగిన రైతులు మాత్రమే పూడికను తరలించుకుంటున్నారు. అ‘లక్ష్యం’: జిల్లా అధికారులు 22 చెరువుల నుంచి 17.70 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను రైతుల పొలాలకు తరలించాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఖరీఫ్ నాటికి అంటే జూన్ మొదటి వారంలోపు పనులను పూర్తి చేయాల్సి ఉంది. అయితే రైతులపై ఆర్థిక భారం పడుతుండడంతో పూడిక తరలింపునకు రైతులు పెద్దగా ఆసక్తి కనబర్చని పరిస్థితి. ఫలితంగా ఇప్పటి వరకు 4.62 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను మాత్రమే తరలించగలిగారు. పనులు ప్రారంభమై రెండు నెలలు గడుస్తుండటం.. మరో 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో లక్ష్యం ఎన్నటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పనులకు వరుణ దేవుడు నిలువరిస్తే పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది. రెండో విడతలో 22 పనులు మంజూరు: మొదటి విడత పనులే కొనసాగుతుండగా.. రెండో విడత కింద మరో 22 చెరువుల్లో పూడిక తరలింపునకు చర్యలు చేపట్టింది. 17 చెరువుల్లో రూ.3.98 కోట్లతో పనులను చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ విజయమోహన్ పాలనా పరమైన అనుమతులు మంజూరు చేశారు. ఈ పనులను కూడా జూన్ నాటికే పూర్తి చేయాలని నిర్ణయించడంతో లక్ష్యం చేరుకోవడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రిప్పుకు రూ.300 తీసుకుంటున్నారు నా పొలానికి ట్రిప్పు పూడిక తరలించేందుకు రూ.300 తీసుకున్నారు. చెరువుకు దగ్గర్లో ఉన్నా ఇంత మొత్తం తీసుకుంటే ఎలా. ఇంకాస్త దూరం ఉండే పొలాలకు రూ.600 వరకు వసూలు చేస్తున్నారు. అందుకే చానా మంది వద్దనుకుంటున్నారు. రవాణా చార్జీలు ప్రభుత్వమే భరించాల. ట్రాక్టర్ల యజమానులకు ముందే బాడుగ చెల్లిస్తున్నాం.. ప్రభుత్వం మాకెప్పుడిస్తాదో తెలదు. - సోమన్న, హుళేబీడు కూలి ఎంతిస్తారో చెప్పనేలేదు ఉపాధి పనుల కింద పనులు చేయిస్తున్నారు. ఎంత కూలి ఇ స్తారో.. ఎప్పుడిస్తారు ఇప్పటికీ చెప్పనేలేదు. పనులు లేకపోవడంతో సరే చూద్దామని వచ్చినాం. ఎండలో చానా ఇబ్బం దిగా ఉంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుందో లేదోనని బెంగగా ఉంది. కనీసం కూలి గురించి చెప్తేనైనా బాగుంటాది. - మల్లేశప్ప, హుళేబీడు