
అంచనాలు.. అను‘మతిపోవాల్సిందే’ !
► నీరు–చెట్టులో ఆమ్యామ్యాలు
► అధికారులకు ఏకంగా 22 శాతం కమీషన్
► అధికార పార్టీ నేతలకు 15 శాతం
► కలెక్టర్‌కు చేరిన ఫిర్యాదులు
► సీఎంఓకూ ఫిర్యాదు చేసేందుకు మరికొందరు సమాయత్తం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నీరు–చెట్టు పనుల్లో అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అంచనాలు వేయడం మొదలు.. అనుమతులు వచ్చే వరకూ కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య సమన్వయంతో వ్యవహారం మొదలవుతోంది. ఇక నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు తమకు ఇష్టం వచ్చిన వారికి పనులు అప్పగిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు 15 శాతం మేరకు కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, అధికార పార్టీ నేతలను తలదన్నేలా అధికారులు ఏకంగా 22 శాతం కమీషన్ తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంచనాలు రూపొందించడంలోనే అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కమీషన్ల దందాపై నేరుగా కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మరోవైపు నీరు–చెట్టు పనుల్లో కమీషన్లు బాగా ముట్టజెప్పిన నియోజకవర్గాల్లో పనుల విలువను అమాంతంగా పెంచేస్తున్నారని కొద్ది మంది అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి(సీఎంఓ) ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
అంచనాల నుంచే మొదలు...!
నీరు–చెట్టు పనుల్లో అవినీతి వ్యవహారం మొత్తం అంచనాల వద్దే మొదలవుతోంది. ఒక్కో పనిని అంచనాలను రూపొందించేందుకే అధికారులు కాంట్రాక్టర్ల వద్ద నుంచి కమీషన్లను దండుకోవడం ప్రారంభమవుతోంది. ఒక్కో పని అంచనాను రూపొందించేందుకు రూ.15 వేల వరకూ తీసుకుంటున్నారని సమాచారం. ఇక అంచనాలను రూపొందించడంలోనే పని విలువను 30 నుంచి 50 శాతం వరకూ పెంచేస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకూ ఏకంగా 22 శాతం మేర కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని కాంట్రాక్టర్లే వ్యాఖ్యానిస్తున్నారు.
దీనికితోడు అధికార పార్టీ నేతలకు 15 శాతం మేర కమీషన్ సమర్పించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ విధంగా కేవలం కమీషన్ల రూపంలోనే 37 శాతం పోను మిగిలిన దాంట్లో పనిచేసేది 40 నుంచి 50 శాతానికి మించే అవకాశం లేదని సాగునీటి శాఖ అధికారులే పేర్కొంటున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.200 కోట్ల విలువ చేసే 2,086 పనులకు అధికారిక అనుమతి లభించింది.
ఫిర్యాదుల పరంపర...!
నీరు–చెట్టు పనుల విషయంలో అధికార పార్టీ నేతల మధ్యే రగడ మొదలయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు గుప్పుమంటున్నాయి. ఈ విధంగా కొన్ని నియోజకవర్గాల్లో నీరు–చెట్టు పనుల్లో జరుగుతున్న తంతుపై అధికారపార్టీకి చెందిన నేతలే కొందరు నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అంచనాల విలువను కొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా 50 శాతం వరకూ పెంచిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది.
మరోవైపు ఒక నియోజకవర్గంలో తన వ్యతిరేకులకు నీరు–చెట్టు కాంట్రాక్టు పనులను సదరు ఎమ్మెల్యే 15 శాతం కమీషన్ తీసుకుని అప్పగించారంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే మండిపడుతున్నారు. ఈ విషయంపై నేరుగా సీఎంఓకే ఫిర్యాదు చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. నీరు–చెట్టు పనుల అప్పగింత వ్యవహారంలో ఉన్నతాధికారి భారీగానే కమీషన్లు దండుకుంటున్న విషయంపై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద రూ.200 కోట్ల విలువైన నీరు–చెట్టు పనులపై ఫిర్యాదులు కూడా అంతకు మించి వస్తుండటం గమనార్హం.