నీళ్లు లేకుండా బట్టలు ఉతికేద్దామా?
అదెలా సాధ్యం అనే డౌట్ వచ్చిందా? నీళ్లు లేకుండా చిన్న పని కూడా చేయలేం కదా? అలాంటిది బట్టలు ఉతకడమా? వినడానికే వింతగా ఉంది.. అని అనుకుంటున్నారా? టెక్నాలజీతో ఏదైనా సాధ్యమే. సమస్త ప్రాణకోటికీ నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ప్రపంచం సాంకేతికంగా ఎంత ముందుకు వెళుతున్నా.. నీటి కష్టాలు మాత్రం తీరడంలేదు. ఈ భూ మండలంపై 71 శాతానికి పైగా నీరున్నా.. మనిషి అవసరాలకు ఉపయోగపడేది కేవలం ఒక శాతం మాత్రమే. జనం పెరిగిపోవడం, వాతావరణ మార్పులు వెరసి.. నీటి కష్టాలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. నిత్య జీవితంలో మనిషికి నీటి అవసరం చాలా ఉంటుంది. పట్టణాల్లో అయితే సగటున ఒక వ్యక్తి వంటకు, స్నానాలకు, బట్టలు ఉతకడానికి, ఇంటి అవసరాలు తదితరాల కోసం రోజూ 135 లీటర్ల నీటిని వినియోగిస్తున్నాడు. ఇక మన దేశంలో అయితే ఒక్కో ధోబీ ఘాట్‌లో రోజుకు 78 వేల లీటర్లకు పైగా నీటిని వినియోగిస్తున్నారు. పైగా ఇలా బట్టలు ఉతకడం వల్ల నీటి వృథా అవడమే కాదు.. టన్నుల కొద్దీ డిటర్జెంట్లు, మైక్రో ప్లాస్టిక్లు, రసాయనాలు నదులు, సరస్సుల్లోకి విడుదలై ఆ నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. మరి ప్రత్యామ్నాయమేంటి? బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్లు వినియోగించడం తెలిసిందే. సాధారణంగా వాషింగ్ మెషీన్లో ఒకసారి బట్టలు ఉతకడానికి 30 నుంచి 40 లీటర్ల నీళ్లు సరిపోతాయి. మామూలుగా బట్టలు ఉతకడంతో పోలిస్తే ఇది తక్కువే. ప్రస్తుతం బట్టలు ఉతకడానికి నీరు (హెచ్‌టూఓ) తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ నేపథ్యంలో అసలు నీళ్లే లేకుండా బట్టలు ఉతకలేమా అనే ఆలోచన రావడంతో ఆ దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. తొలుత నైలాన్ బీడ్స్ సహాయంతో దుస్తులు ఉతికే వాషింగ్ మెషీన్ వచి్చంది.అయితే, ఇది పూర్తిగా నీరు, డిటర్జెంట్ లేకుండా ఆ పని చేయలేకపోయింది. కానీ 80 శాతం వరకు నీటిని ఆదా చేసింది. తర్వాత కాలంలో కూడా వీటికి సంబంధించి పలు పరిశోధనలు జరిగాయి. ఈ క్రమంలో కార్బన్ డైఆక్సైడ్ (సీ వోటూ) ఉపయోగిస్తే.. నీటి అవసరమే ఉండదని తేల్చారు. ద్రవరూప కార్బన్ డై ఆక్సైడ్తో బట్టలు ఉతకడం సులభమేనని నిర్ధారణకు వచ్చారు. ఎలా పనిచేస్తుంది? ఇది మామూలు వాషింగ్ మెషీన్ల కంటే పెద్దగా ఉంటుంది. ఇందులో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రూపంలో ఉంటుంది. దుస్తులను నిర్దేశిత చాంబర్లో వేసి స్విచ్ ఆన్ చేయాలి. అప్పుడు గ్యాస్ రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ద్రవరూపంలోకి మారి బట్టలకు ఉన్న మురికిని వదిలిస్తుంది. బట్టలు ఉతకడం పూర్త యిన తర్వాత ఆ ద్రవం తిరిగి గ్యాస్ రూపంలోకి మారిపోయి.. పునరి్వనియోగానికి సిద్ధంగా ఉంటుంది. నీటి వినియోగం లేనందున బట్టలు మళ్లీ ఆరబెట్టాల్సిన అవసరం లేదు. బట్టలు ఉతకడం పూర్తయిన తర్వాత పొడిగానే బయటకు వస్తాయి. ప్రయోజనాలేంటి? ఈ మెషీన్‌కు నీళ్లే కాదు.. ఎలాంటి డిటర్జెంట్లూ అవసరం లేదు. దుస్తులు పాడైపోతాయనే బెంగా లేదు. పైగా ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. అంతేకాదు ఇది పర్యావరణ అనుకూలంగానూ ఉంటుంది. ఇక ప్రతికూలతల విషయానికి వస్తే.. ఖరీదు కాస్త ఎక్కువే. దీన్ని ఇంట్లో పెట్టడానికి కాస్త ఎక్కువ ప్లేస్ కావాలి. అయితే నీరు, ఇతరత్రా నిర్వహణ వ్యయం ఆదాతో పోలిస్తే వీటిని ప్రతికూలతలుగా పరిగణించక్కర్లేదనేది నిపుణుల మాట.మన మార్కెట్లో అందుబాటులో ఉన్నాయా? ప్రస్తుతానికి ఈ వాషింగ్ మెషీన్లు యూఎస్, యూకే, జపాన్ వంటి దేశాల్లో వినియోగంలో ఉన్నాయి. ముఖ్యంగా హోటళ్లు, ఆస్పత్రుల వంటి చోట్ల వినియోగిస్తున్నారు. ఇంటి అవసరాలకు ఉపయోగించడం ఇంకా మొదలుకాలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు వాషింగ్ మెషీన్ల బ్రాండ్లు వీటిని పరీక్షిస్తున్నాయి. అయితే అత్యధిక జనాభా కలిగి, అత్యధిక నీటి అవసరం ఉన్న భారత్ మాత్రం ఆ దిశగా ఇంకా ప్రయతి్నంచడం లేదు. ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ అవగాహన కల్పించి, ఆ మేరకు సాంకేతికతను అందిపుచ్చుకుంటే మనం కూడా ఎంతో నీటిని ఆదా చేసే అవకాశం ఉంటుంది.