ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 130 ఏళ్ల తర్వాత మహారాష్ట్రలోని నాసిక్ లో గల ప్రముఖ స్నానఘట్టం రామ్ కుంద్ పూర్తిగా ఎండిపోయే పరిస్థితి కొచ్చింది.
నాసిక్, మహారాష్ట్ర: ఎండల తీవ్రత, క్షామ పరిస్థితులకు, అడుగంటి పోతున్న భూగర్భజలాలకు ఇదొక ఉదాహరణ. భవిష్యత్లో ఇలాంటివి మరిన్ని చోట్ల జరగొచ్చని చెప్పేందుకు సజీవ సాక్ష్యం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 130 ఏళ్ల తర్వాత మహారాష్ట్రలోని నాసిక్ లో గల ప్రముఖ స్నానఘట్టం రామ్ కుంద్ పూర్తిగా ఎండిపోయే పరిస్థితి కొచ్చింది. ఒకప్పుడు పుణ్య, పవిత్ర స్నానాలకు అలవాలమైన గోదావరి నది పైనే ఉన్న ఈ నీటి కొలను ఇప్పుడు అక్కడికి వస్తున్న భక్తులకు కలవరాన్ని కలిగిస్తోంది.
ఇందులో ఇప్పుడు చిన్నారులు క్రికెట్, ఫుట్ బాల్ వంటివి అడుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగాఉందో అర్థం చేసుకోవచ్చు. 'జూలై నెల పూర్తయ్యేనాటికిగానీ తిరిగి ఎప్పటిలాగా రామ్ కుంద్లో భక్తులు పవిత్ర స్నానాలు చేయలేకపోవచ్చు' అని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గుర్మీత్ బగ్గా తెలిపారు. అయితే, హిందువులు పవిత్రంగా జరుపుకునే ఉగాది పండుగను గుడి పడ్వా పేరిట మహారాష్ట్రలో జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా కుప్పలుగా భక్తులు రామ్ కుంద్ వద్ద స్నానాలు ఆచరించేందుకు రాగా వారికి నిరాశే ఎదురైంది. దీంతో కనీసం వాటర్ ట్యాంకుల ద్వారానైనా నీటిని సప్లయ్ చేయాలని పురోహితులు, భక్తులు నాసిక్ పౌరసరఫరాల సిబ్బందిని వేడుకుంటున్నారు.