క్లిక్ చేయండి.. నగరాన్ని గెలిపించండి!
సాక్షి, హైదరాబాద్: మెరుగైన రవాణా వ్యవస్థ, ఐటీ రంగ అభివృద్ధి, హరిత భవనాల నిర్మాణాలు.. వంటి అనేక అంశాలు ఏ నగరంలో మెరుగ్గా ఉన్నాయని ప్రపంచ దేశాల్లో వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్) ఆన్లైన్లో ఓ పోటీని నిర్వహిస్తోంది. 14 దేశాల్లోని మొత్తం 34 నగరాలు ఎంపికైన ఈ పోటీలో మన దేశం నుంచి కేవలం 3 నగరాలు మాత్రమే పోటీలు నిలబడ్డాయి. ఇందులో హైదరాబాద్‌కూ చోటు దక్కించుకుంది. మిగిలిన రెండు నగరాలు.. కొచ్చి, కోయంబత్తూర్ నగరాలు. ఈ పోటీ విశేషాలివిగో..
నైపుణ్యం గల ఉద్యోగులు లభించటం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నివసించటానికి అనుకూలమైన వాతావరణం, పెరుగుతున్న హరిత భవనాలు, నష్టభయం పెద్దగా లేకపోవటం, విద్యుత్, రోడ్ల అభివృద్ధి, పన్ను రాయితీలు, మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాట్లు తదితర కారణాల వల్ల హైదరాబాద్ ఈ పోటీలో నిలిచింది. అంతేకాకుండా దేశంలోనే తొలిసారిగా నగరంలో నిర్మించిన ‘జీవవైవిధ్య సూచి’ హైదరాబాద్‌ను ప్రపంచ దేశాల్లో తలమానికంగా నిలుపుతోంది.
ఐటీ పెట్టుబడులు పెరగటం, పునరుత్పాదక శక్తి వినియోగంలో ముందంజలో ఉండటం వల్ల కోయంబత్తూర్.. హరిత భవన నిర్మాణాలుండటం, వాతావరణంలో కార్బన్ శాతం తక్కువగా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో కొచ్చి నగరాలు ఈ పోటీలో నిలిచాయి.
విజేతల ఎంపిక ఇలా..
రవాణా వ్యవస్థ, అందుబాటులో ఉన్న సదుపాయాలు, మౌలిక వసతులు, పార్కులు, విశాలమైన ప్రదేశాలు, విద్యుత్, నీటి వినియోగం వంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలించి ఉత్తమ నగరాన్ని ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ ఓట్ల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. మార్చి 27న కెనడాలో జరిగే కార్యక్రమంలో ‘నేషనల్ ఎర్త్ అవర్ క్యాపిటల్ అవార్డు’ను అందిస్తారు.