రియల్టీ కింగ్.. డీఎల్ఎఫ్ సింగ్.. లిస్ట్‌లో తెలుగువారు!
న్యూఢిల్లీ: దేశీ రియల్ ఎస్టేట్ రంగంలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రూ. 59,030 కోట్ల సంపదతో మరోసారి నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. 2023కి గాను దేశీ రియల్టీ కుబేరులతో కిచెన్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ సంస్థ గ్రోహె, రీసెర్చ్ సంస్థ హురున్ ఇండియా సంయుక్తంగా ఈ లిస్టును రూపొందించింది. 16 నగరాలకు చెందిన 67 కంపెనీలకు సంబంధించి 100 మంది సంపన్నులకు ర్యాంకింగ్ ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది చోటు దక్కించుకున్నారు.
జీఏఆర్ కార్పొరేషన్ వ్యవస్థాపక చైర్మన్ జీ అమరేందర్ రెడ్డి కుటుంబం (రూ. 15,000 కోట్లు) పదో స్థానంలో నిల్చింది. మంగళవారం విడుదల చేసిన సంపన్నుల జాబితా ప్రకారం.. రూ. 42,270 కోట్ల సంపదతో మంగళ్ ప్రభాత్ లోధా కుటుంబం (మాక్రోటెక్ డెవలపర్స్ – లోధా గ్రూప్) రెండో స్థానంలో, రూ. 37,000 కోట్ల సంపదతో ఆర్ఎంజెడ్ కార్ప్ అర్జున్ మెండా కుటుంబం మూడో స్థానంలో ఉన్నాయి. ఈసారి లిస్టులో 25 మందికి కొత్తగా చోటు దక్కగా, 36 మంది సంపద తగ్గింది.
ఇతర వివరాలు..
రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 37 మంది రియల్టీ కుబేరులు ఉన్నారు. ఢిల్లీ (23), కర్ణాటక (18) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 9 మంది, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరు ఉన్నారు.
నగరాలవారీగా చూస్తే ముంబై (29 మంది), న్యూఢిల్లీ (23), బెంగళూరు (18) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
టాప్ 10లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద 2017లో రూ. 3,350 కోట్లుగా ఉండగా ప్రస్తుతం రూ. 15,000 కోట్లకు ఎగిసింది. అలాగే టాప్ 50లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద రూ. 660 కోట్ల నుంచి రూ. 1,330 కోట్లకు చేరింది.
టాప్ 100 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 4% పెరిగి రూ. 4,72,330 కోట్లుగా (57 బిలియన్ డాలర్లు) ఉంది. ఇందులో టాప్ 10 కుబేరుల వాటా 60%గా ఉంది.
డీఎల్ఎఫ్కు చెందిన పియా సింగ్, రేణుకా తల్వార్ అత్యంత సంపన్న మహిళలుగా ఉన్నారు.
ఇదీ చదవండి: Income Tax Return: అందుబాటులోకి ఐటీఆర్ 1, 4 ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా..