అండమాన్ సముద్రంలో అల్పపీడనం
రానున్న 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: అండమాన్ సముద్రంలో సోమవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. దీనికి ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. దీంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడింది.
ప్రస్తుతం దక్షిణ కోస్తాకు ఆనుకుని మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో జల్లులుగానీ, మోస్తరు వర్షంగానీ కురిసే అవకాశం ఉంది. అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం బలపడ్డాక ఈ నెల 13, 14 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ తెలిపింది. గడచిన 24 గంటల్లో కాకినాడ, పెద్దాపురం, గుండపాలెంలలో 3 సెం.మీ, ఒంగోలు, బాపట్ల, రెంటచింతలలో ఒక సెం.మీ. చొప్పున వర్షం పడింది.
సముద్ర తీరంలో ఇద్దరు గల్లంతు
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలోని పెంటకోట తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన వంగలపూడి అనిల్ కుమార్ (20), బారుగుల రామకృష్ణ(16) గల్లంతయ్యారు. ఐదుగురు స్నానానికి దిగగా అలల ఉధృతికి సముద్రంలోనికి ఇద్దరు కొట్టుకుపోయారు. బి.మురళి, బి.శ్రీకాంత్, నరేంద్ర అనే వారిని రక్షించారు.