ఆర్ కాం జియో కి షాకిస్తుందా?
ముంబై: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఎయిర్ సెల్ , ఆర్ కాం విలీనానికి రంగం సిధ్దమైంది. అనిల్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో మరో టెలీకాం సంస్థ ఎయిర్సెల్ సంస్థ విలీనంపై ఈ నెలలోనే అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండియాలో వినియోగదారుల పరంగా టాప్-3 టెలికం సంస్థగా ఆవిర్భవించాలన్న కోరికతో ఉన్న అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. బుధవారం జరగబోయే ఆర్ కాం బోర్డ్ సమావేశం అనంతరం ఈ డీల్ పై అధికారిక ప్రకటన వెలువడవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సుమారు రూ. 14వేల కోట్ల వాటాల జారీ విధానం ద్వారా ఈ ఒప్పందం ఖరారు కానుంది. దీని ద్వారా 196 మిలియన్ల ఖాతాదారులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సమాచారం.
ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు ఒక కొత్త బ్రాండ్ నేమ్ తో పనిచేయన్నాయి. ఎయిర్ సెల్,ఆర్ కాం సమాన భాగస్వామ్యంతో ఈ కొత్త సంస్థ పనిచేయనుంది. చెరి 580 మిలియన్ డాలర్ల పెట్టబడులతో 7600కోట్ల ఈక్విటీ పూల్ ను సాధించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొత్త కంపెనీ స్పెక్ట్రం లైసెన్స్ 800, 900,1800, 2100, 2300 ఎంహెచ్జె బాండ్ విడ్త్ తో ఉంటుందని అంచనా. అయితే ఈ వార్తలను ధృవీకరించడానికి ఇరు సంస్థలు నిరాకరించాయి.
కాగా ఉచిత సేవలు, ఉచితరోమింగ్ అంటూ సంచలనంగా మార్కెట్ లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియోకి పోటీగా ఆర్ కాం తాజాగా 40రూపాయలకే ఫుల్ టాక్ టైం, 1 జీబీ డాటా ఉచితంగా అందించే ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే మూడవ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సంస్థ ఏర్పాటుపై కన్నేసిన అనిల్ ఆధ్వర్యంలోని ఆర్ కాం సోదరుడు ముకేష్ సొంతమైన జియోకి షాకిస్తుందా అనే అభిప్రాయం మార్కెట్ లో నెలకొంది.