జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఒలింపిక్ మెడలిస్ట్ కరణం మల్లేశ్వరి నేతృత్వంలో జిల్లాలో వెయిట్ లిఫ్టిం గ్ అకాడమీ నెలకొల్పుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ పీఆర్ మోహన్ ప్రకటించారు. శ్రీకాకుళంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం శాప్ బోర్డు పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడతలో శ్రీకాకుళంలో అథ్లెటిక్స్ అకాడమీ నెలకొల్పుతామని చెప్పారు. కోడిరామ్మూర్తి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరిస్తామని తెలిపారు. గతంలో శాప్ పాలకమండలి సమావేశాలు కేవలం హైదరాబాద్‌కే పరిమితమయ్యేవని, ఇకపై ప్రతి జిల్లాలోనూ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో అంతర్జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తామన్నారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతి లేదా విజయవాడలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలు నిర్మిస్తామని చెప్పారు.
పునరావాస కేంద్రాలు కావు..
స్పోర్ట్స్ స్కూల్స్ పునరావాస కేంద్రాలు కావని.. ప్రతిభ లేని క్రీడాకారులను ఇళ్లకు సాగనంపుతామని చైర్మన్ స్పష్టంచేశారు. ప్రతి మూడునెలలకు ఒకసారి ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. క్రీడా ఎంపికలో సిఫార్సులకు తావులేదన్నారు. శాప్, డీఎస్ఏ పరిధిలోని కాంట్రాక్ట్ అధికారులు, కోచ్‌లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపిం చామని చెప్పారు. రాష్ట్రంలో కోచ్‌ల కొరత వాస్తవమేనని అంగీకరించారు. అంతర్జాతీయ, జాతీయస్థాయిలో పతకాలు సాధించి నిరుద్యోగులగా ఉన్న వెటరన్ క్రీడాకారులను కోచ్‌లుగా నియమిస్తామన్నారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ప్రతి గ్రామంలోనూ వాకింగ్ ట్రాక్ ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. సీతంపేటలో గిరిజన స్పోర్ట్స్ స్కూల్ మంజూరు పై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కరణం మల్లేశ్వరి మాట్లాడుతూ కోడిరామ్మూర్తి స్టేడియంలో తాత్కాలికంగా వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని ఏర్పాటుచేసి.. శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలలో వసతి సదుపాయం కల్పించేందుకు కలెక్టర్ అంగీకరించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో శాప్ ఎండీ పి.రేఖారాణి, బోర్డు సభ్యులు కరణం మల్లేశ్వరి, బి.హనుమంతురావు, సత్యగీత, జయచంద్ర, షఫీ, డిప్యూటీ డెరైక్టర్ దుర్గాప్రసాద్, మోనటరింగ్ అధికారి ఎల్.దేవానందం, డీఎస్డీఓ బి.శ్రీనివాస్‌కుమార్ పాల్గొన్నారు.
చంద్రబాబు నామస్మరణ..
చైర్మన్ మోహన్ మాట్లాడిన ప్రతి పలుకులోనూ చంద్రబాబు నామస్మరణ చేశారు. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు దయవల్లే రాజకీయంగానే ఎంపికయ్యానని వెల్లడించారు. తనతోపాటు బోర్డు సభ్యుల నియామకం కూడా రాజకీయంగానే జరిగిందని అంగీకరించారు. అయినా ఎటువంటి లొసుగులకు అవకాశం లేకుండా నిజాయితీతో పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు.