ఏడాదిని మింగేసిన కరోనా మహమ్మారి
కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోతోంది. ఒక ఉద్యమంతో మొదలై, ఒక మహమ్మారితో తీవ్రంగా వణికిపోయి, మరో మహోద్యమంతో 2020 ముగుస్తోంది. ఈ ఏడాదంతా కరోనా, కరోనా, కరోనా అంతే.. మరో మాటకి తావు లేదు. వేరే చర్చకి ఆస్కారం లేదు. కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తూనే దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కరోనా నేర్పిన పాఠాలను అర్థం చేసుకుంటూనే సామాజిక, ఆర్థిక మార్పులకి అలవాటు పడుతూ ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారం చేసుకోవడానికి అడుగులు పడుతున్నాయి. వ్యాక్సిన్‌తో కరోనా పీడ విరగడైపోతుందన్న ఉత్సాహంతో యావత్ భారతావని కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడానికి సిద్ధమైంది.
ఉవ్వెత్తున ఉద్యమాలు
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మైనార్టీలకు భారత పౌరసత్వాన్ని ఇవ్వడానికి వీలు కల్పించే పౌరసత్వ సవరణ చట్టంపై పెల్లుబుకిన ఆగ్రహంతో మొదలైన ఈ ఏడాది కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు కన్నెర్ర చేయడంతో ముగుస్తోంది. ప్రపంచ దేశాల దృష్టిని కూడా ఈ రెండు ఉద్యమాలు ఆకర్షించాయి. పౌరసత్వ సవరణ చట్టంతో (సీఏఏ)అభద్రతా భావంలో పడిపోయిన మైనార్టీలు ఢిల్లీలో షహీన్‌బాగ్ వేదికగా కొన్ని నెలల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ ఏడాది మార్చిలో కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం చప్పున చల్లారిపోయింది. ఏడాది చివర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ, పంజాబ్ సరిహద్దుల్లో గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా అన్నదాతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలతో వ్యవసాయం కార్పొరేటీకరణ జరుగుతుందని, కనీస మద్దతు ధరకే ఎసరు వస్తుందన్న ఆందోళనతో రైతన్న నెలరోజులై ఆందోళనలు ఉధృతంగా నిర్వహిస్తున్నారు.
వామ్మో కరోనా
కంటికి కనిపించని సూక్ష్మక్రిమి ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఏడాదంతా కరోనా తప్ప మరే మాట వినిపించలేదు. చైనాలోని వూహాన్లో తొలి సారిగా బట్టబయలైన ఈ వైరస్ అక్కడ్నుంచి వచ్చిన ఒక విద్యార్థి ద్వారా జనవరి 30న భారత్‌లోని కేరళకి వచ్చింది. ఆ తర్వాత మార్చికల్లా ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరుకి విస్తరించింది. దీంతో కేంద్రం మార్చి 25 నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ విధించింది. సరిహద్దులన్నీ మూసివేసి కార్యకలాపాలన్నీ నిలిపివేయడంతో సామాజికంగా, ఆర్థికంగా కొత్త సవాళ్లు ఎదురయ్యాయి ఆ తర్వాత దశల వారీగా పాక్షికంగా లాక్‌డౌన్‌ని కొనసాగించిన∙కేంద్రం జూన్ 1 నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించింది. ప్రపంచ దేశాల పట్టికలో కోటికి పైగా కేసులతో రెండో స్థానంలో ఉన్నప్పటికీ పోరాట పటిమ ప్రదర్శించిన భారత్‌ను డబ్ల్యూహెచ్‌వో కూడా ప్రశంసించింది.
బతుకు నడక
130 కోట్ల జనాభా కలిగిన భారత్ వంటి దేశంలో కరోనా కట్టడికి లాక్డౌన్ మినహా మరో మార్గం లేకపోవడంతో కేంద్రం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంది. దీంతో అతి పెద్ద మానవీయ సంక్షోభం తలెత్తింది. కేంద్రం నిర్ణయం 4 కోట్ల మంది వలస కార్మికులపై తీవ్రమైన ప్రభావం పడింది. పనులు లేకపోవడం, కరోనా మహమ్మారి ఎలాంటి ఆపద తీసుకువస్తుందోన్న ఆందోళనలతో వలస కార్మికులు చావైనా బతుకైనా సొంత గడ్డపైనేనని నిర్ణయించుకొని స్వగ్రామాలకు పయనమయ్యారు. కాళ్లు బొబ్బలెక్కేలా మైళ్లకి మైళ్లు నడిచారు. ఈ క్రమంలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రమైన జీవితం కోసం వారు పడ్డ ఆరాటం, సాగించిన నడక మనసుని బరువెక్కించే దృశ్యంగా నిలిచింది.
మూగబోయిన స్వరాలు
కరోనా మహమ్మారి గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆగస్టు 5న కరోనా సోకడంతో చెన్నైలో ఆసుపత్రిలో చేరిన ఆయన 40 రోజుల పాటు మహమ్మారితో పోరాడి సెప్టెంబర్ 25న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హిందూస్తానీ సంగీతంలో సుప్రసిద్ధులైన పండిట్ జస్రాజ్ 90 ఏళ్ల వయసులో గుండె పోటు రావడంతో అమెరికాలో తుది శ్వాస విడిచారు. ఈ ఇద్దరు సంగీత సామ్రాట్‌లను కోల్పోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆలయాలకి భూమి పూజ
శ్రీరాముడి భక్తుల కలలు ఫలించే అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో పాటు, ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి పార్లమెంటు కొత్త భవనానికి ఈ ఏడాది భూమి పూజ మహోత్సవాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిరానికి పునాది రాయి పడింది. 40కేజీల బరువున్న వెండి ఇటుకని శంకుస్థాపన కోసం వాడారు. మరోవైపు పార్లమెంటు కొత్త భవనానికి డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచుతూ ఉండడంతో 1,224 మంది సభ్యులు కూర్చొనే సామర్థ్యంతో ఈ భవనం నిర్మాణం జరుపుకుంటోంది.
ఒక హత్య, మరో ఆత్మహత్య
ఈ ఏడాది జరిగిన క్రైమ్ సీన్లో హాథ్రస్ అత్యాచారం, హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తదనంతరం బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై జరిగిన విచారణ అంతే ప్రకంపనలు రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా బూల్హరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతి సెప్టెంబర్ 14న వ్యవసాయ క్షేత్రానికి వెళితే అగ్రవర్ణానికి చెందినవారుగా అనుమానిస్తున్న కొందరు పశువుల్లా మారి గ్యాంగ్ రేప్ చేయడంతో తీవ్రగాయాలతో బాధపడుతూ ఢిల్లీ ఆస్పత్రిలో బాధితురాలు సెప్టెంబర్ 29న మరణించింది. యూపీ పోలీసులు ఆమె మృతదేహానికి పోస్టు మార్టమ్ నిర్వహించకుండా 30 తెల్లవారుజామున 2.30 గంటలకు హడావుడిగా అంత్యక్రియలు చేయడంతో ఈ రేప్ కేసు రాజకీయ ప్రకంపనలు రేపింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలో తన స్వగృహంలో జూన్ 14న ఆత్మహత్య చేసుకోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు బాలీవుడ్‌ని ఒక్క కుదుపు కుదిపేశాయి. బాలీవుడ్లో ఏళ్ల తరబడి వేళ్లూనుకుపోయిన నెపోటిజంపై చర్చ మళ్లీ మొదలైంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌ని మించిన మలుపులతో సాగిన ఈ ఉదంతం బాలీవుడ్ మాఫియా లింకుల్ని కూడా బయటకు లాగడంతో ప్రకంపనలు సృష్టించింది. సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అరెస్ట్ చేయడంతో బాలీవుడ్ తారలకే చుక్కలు కనిపించాయి. దీపిక పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ వంటి వారు ఎన్సీబీ ఎదుట హాజరవాల్సి వచ్చింది.
సరిహద్దుల్లో సై
నాలుగు దశాబ్దాల తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కయ్యాలమారి చైనా నిబంధనలన్నీ తుంగలో తొక్కి, ఆయుధాలు వాడకూడదన్న ఒప్పందాల్ని తోసి రాజని మన జవాన్లపై జూన్ 15 అర్ధరాత్రి దాడులకు దిగింది. మన సైన్యం కూడా గట్టిగా ఎదురుదాడికి దిగడంతో డ్రాగన్ తోక ముడిచింది. ఈ ఘర్షణల్లో భారత్ సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోతే, చైనా నుంచి జరిగిన ప్రాణ నష్టాన్ని ఆ దేశం ఇప్పటివరకు బయట పెట్టలేదు. చైనాను దీటుగా ఎదుర్కోవడానికి వాస్తవాధీన రేఖలో జవాన్లకు అత్యద్భుమైన సదుపాయాలను కల్పించడంతో పాటు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన క్షిపణుల్ని మోహరించి భారత్ సైనిక రంగంలో తన సత్తా చాటుకుంది.
అవీ.. ఇవీ..
► నిర్భయ హత్యాచారం కేసులో ఆమె తల్లిదండ్రుల పన్నెండేళ్ల పోరాటం ఫలించింది. దోషులైన పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముఖేష్ కుమార్‌లకు మార్చి 20న ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉరి శిక్ష అమలు చేశారు.
► మహారాష్ట్రలోని పాలగఢ్ జిల్లాలో ఏప్రిల్‌లో జరిగిన మూకదాడిలో ఇద్దరు సాధువులు సహా ముగ్గురు మరణించారు. యూపీలోని ఒక ఆలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలు మతం రంగు పులుముకోవడంతో బీజేపీ, శివసేన మాటల యుద్ధానికి దిగాయి.
► ఒకవైపు కోవిడ్ మహమ్మారితో సతమతమవుతూ ఉంటే మేలో అంఫా తుఫాన్ ఈశాన్య భారతాన్ని కలవరపెట్టింది. బెంగాల్లో తుపాన్ ధాటికి 72 మంది ప్రాణాలు కోల్పోతే, లక్ష కోట్ల రూపాయల నష్టం కలిగింది.
► ఐరాసభద్రతా మండలికి నాన్ పర్మెనెంట్ సభ్యదేశంగా భారత్ జూన్ 18న ఎన్నికైంది. వచ్చే జనవరి నుంచి కొత్త మండలిలో భారత్ చేరనుంది.
► ముంబైని పీఓకేతో పోల్చడం, రాష్ట్ర పోలీసుల్ని విమర్శిస్తూ ట్వీట్లు పెట్టడంతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు, శివసేన సర్కార్ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. సెప్టెంబర్‌లో ఆమె నివాసాన్ని కూడా కూల్చివేయడానికి ముంబై నగరపాలక సంస్థ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో కంగనాకు కేంద్రం వై ప్లస్ భద్రత కల్పించడం విమర్శలకు దారి తీసింది.