welfare school
-
విద్యార్థినులపై జ్వరాల పంజా
విజయనగరం, సాలూరురూరల్: మండలంలోని కొత్తవలస గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు జ్వరాలబారిన పడ్డారు. సుమారు 20 మందికి పైగా విద్యార్థినులు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఎ. పావని, యు.కృష్ణవేణి, ఎం.హేమలత, సీహెచ్.భవానీ, జె.పార్వతి, కె.స్వప్న, జి.మేఘన, పి.వసుంధర, తదితరులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై హెచ్ఎం సంధ్యారాణి మాట్లాడుతూ, ఎనిమిది మంది విద్యార్థినులు జ్వరంబారిన పడినట్లు వైద్యులు తెలిపారని చెప్పింది. విద్యార్థినులకు మామిడిపల్లి పీహెచ్సీలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇద్దరి విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం సాలూరు పీహెచ్‌సీకి తరలించినట్లు సమాచారం. సేవకురాలిగా హెచ్ఎం.. పాఠశాల ఏఎన్ఎం ముంగి వెంకటలక్ష్మి విద్యార్థినులను తీసుకుని ఆస్పత్రులకు వెళ్తుండడంతో మిగిలిన విద్యార్థినులకు హెచ్ఎం సంధ్యారాణి దగ్గరుండి మరీ సేవలందిస్తోంది. ఎప్పటికప్పుడు టెంపరేచర్ తీయడం.. దగ్గరుండి మందులు వేయించడం.. తదితర పనులన్నీ హెచ్ఎం చేస్తోంది. ఒకే మంచంపై ఇద్దరు ఆశ్రమ పాఠశాలలోని సిక్ రూమ్‌లో ఒక్కో మంచంపై ఇద్దరేసి విద్యార్థినులు పడుకుంటున్నారు. ఒక్కో మంచంపై ముగ్గురేసి కూడా ఉండి వైద్యసేవలు పొందుతున్నారు. తడవడం వల్లే.. భోజనాలకు వెళ్లే సమయంలో తడిసి పోవడం వల్లే జ్వరాలు ప్రబలాయని విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెస్ వద్ద భోజనం చేసే సౌకర్యం లేకపోవడంతో భోజనం పట్టుకుని తిరిగి డార్మిటరీకి వచ్చే క్రమంలో తడిసిపోతున్నామని పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థినులు జ్వరాల బారిన పడడం వల్ల సిబ్బందికి కూడా ఇక్కట్లు తప్పడం లేదు. ఆస్పత్రికి తీసుకెళ్లడం.. రిపోర్టులు తీసుకురావడం వంటి పనులతో వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక విద్యార్థినులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను తమతో పంపించాలని కోరుతున్నారు. అయితే ఇళ్లకు వెళ్లినా అక్కడ జరగరానిది ఏదైనా జరిగితే తమకే ఇబ్బందని, అందుకే ఇక్కడే వైద్యసేవలందిస్తామని సిబ్బంది చెబుతున్నారు. -
వార్డెన్, హెచ్ఎంను సస్పెండ్ చేయాలి
ఇల్లెందు: గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ వార్డెన్, పాఠశాల హెడ్మాస్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డుపై ఆందోళన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడ్ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహానికి చెందిన 11 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా తరలిపోయాయి. ఈ వ్యవహారంలో వార్డెన్‌ను, హెచ్ఎంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న సహాయ గిరిజన సంక్షేమ అధికారి అక్కడికి వచ్చి వారికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
గర్భం దాల్చిన గురుకుల విద్యార్థిని
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో గురుకుల పాఠశాలకు చెందిన ఒక విద్యార్థిని గర్భం దాల్చిన సంఘటన సంచలనం సృష్టించింది. అనారోగ్యంతో బాధపడుతున్న టెన్త్ విద్యార్థినిని మంగళవారం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె ఐదు నెలల గర్భిణిని అని వైద్యులు చెప్పారు. దీంతో విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గురుకులంలో ‘సమ్మర్ సమురాయ్'
కొండాపూర్: విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు ఎంతో అవసరమని గుర్తించిన రంగారెడ్డి జిల్లా గురుకుల పాఠశాల వేసవిలో' సమ్మర్ సమురాయ్' పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. విద్యా సంబంధ అంశాలతోపాటు ఆటపాటల్లో నిపుణులైన వారితో విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. మెదక్ జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలకు చెందిన 125 మంది విద్యార్థులను కొండాపూర్‌లోని గురుకుల ఉన్నత పాఠశాలలో వసతి సౌకర్యాలు కల్పించింది. ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా గురుకుల పాఠశాలల కో ఆర్డినేటర్ గణపతి తెలిపారు. చదువుతో పాటు ఆటపాటలు కూడా విద్యార్థికి ఎంతో అవసరమని గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారని, ఆయన ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం తలపెట్టినట్లు పాఠశాల ప్రిన్సిపల్ గోదావరి తెలిపారు. -
ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత
రాజవొమ్మంగి: తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీలోని గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఎడమవైపు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న నలుగురు విద్యార్థినులను పాఠశాల సిబ్బంది రాజవొమ్మంగి ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల క్రితం ఇలాంటి లక్షణాలతోనే 7వ తరగతి విద్యార్థిని దుర్గాజ్యోతి (13) మృతి చెందింది. తాజా పరిణామంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. -
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య
ఏలూరు క్రైమ్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దెందులూరు మండలం, రామారావుగూడెంకు చెందిన కత్తె రచన(15) పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి తరగతి గదిలో చున్నీతో ఉరివేసుకోగా... బుధవారం ఉదయం వాచ్‌మ్యాన్ చూసి ప్రిన్సిపల్ కు సమాచారం అందించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రచన ఆత్మహత్యతో తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.