whip issue
-
బీజేపీ ఎంపీలకు విప్
న్యూఢిల్లీ: అధికార బీజేపీ తమ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు శుక్రవారం విప్ జారీ చేసింది. శనివారం పార్లమెంట్లో చాలా ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టనున్నందున చర్చ, ఆమోదం నిమిత్తం పార్టీ సభ్యులంతా తప్పక హాజరుకావాలని అందులో కోరింది. దీంతో, పార్లమెంట్ సమావేశాల్లో ఆఖరి రోజైన శనివారం ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపడుతుందోనన్న చర్చ మొదలైంది. -
రైతు అభీష్టానికి... రాజ్యం తలొగ్గిన వేళ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే వివాదాస్పద మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును కేంద్రం ప్రభుత్వం తొలిరోజే లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. బిల్లును సభ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. సోమవారం తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆదేశించాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎస్పీజీ)కు చట్టబద్ధతతోపాటు రైతాంగం డిమాండ్లు, సమస్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా కొనసాగుతున్న పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారు. ఈ మేరకు ఒక సంతాప తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 కొనసాగుతాయి. సెలవులు పోగా ఈసారి పార్లమెంట్లో మొత్తం 19 సెషన్స్ (పనిదినాలు) ఉంటాయి. క్రిప్టోకరెన్సీలపై నిషేధం పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుతోపాటు మరో 25 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. క్రిప్టోకరెన్సీలపై నిషేధం బిల్లు కూడా వీటిలో ఉంది. ఆర్బీఐ ఆధ్వర్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని మాత్రమే ప్రభుత్వం అనుమతించనుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు–2019పై జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్(జేసీపీ) నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు.పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించడంతోపాటు డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు నిమిత్తం ఈ బిల్లును 2019లో ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతిపక్షాల సూచన మేరకు బిల్లును క్షుణ్నంగా పరిశీలించడానికి జేసీపీని ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ చట్టం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ తదితర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు మినహాయింపు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కీలక బిల్లులివే.. గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానంలో నార్కోటిక్స్ డ్రగ్, సైకోటిక్ సబ్‌స్టాన్సెస్ బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్(సవరణ) బిల్లును ఈసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడిగింపునకు సంబంధించిన బిల్లులు ఇందులో ఉన్నాయి. రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల జాబితా సవరణకు ఉద్దేశించిన ‘కానిస్టిట్యూషన్ (ఎస్సీలు, ఎస్టీలు) ఆర్డర్(సవరణ) బిల్లును సైతం ప్రవేశపెట్టనుంది. -
‘109 మంది ఎమ్మెల్యేలు మా వెంటే’
-
‘109 మంది ఎమ్మెల్యేలు మా వెంటే’
జైపూర్/న్యూఢిల్లీ: సంక్షోభం దిశగా పయనిస్తున్న రాజస్తాన్ రాజకీయాల్లో ఎవరి బలాన్ని వారు ప్రకటిస్తున్నారు. తన వెంట 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని పార్టీ యువ నాయకుడు, ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ ఆదివారం తిరుగుబాటు జెండా ఎగరేసిన సంగతి తెలిసిందే. కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతిస్తున్నారన్నారు. ప్రస్తుతం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని స్పష్టం చేశారు. పైలట్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఆదివారం ఈ ప్రకటన వెలువడింది. అయితే, తాజాగా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, రాజస్తాన్ వ్యవహారాల ఇన్చార్జ్ అవినాష్ పాండే సీఎం అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని అంటున్నారు. ముఖ్యమంత్రికి 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సోమవారం తెల్లవారుజాము 2.30 గంటలకు పాండే వెల్లడించారు. (చదవండి: రెబల్ పైలట్) సీఎం గహ్లోత్ నివాసంలో ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో గహ్లోత్ నాయకత్వాన్ని బలపరుస్తూ వారంతా సంతకాలు కూడా చేశారని పేర్కొన్నారు. మరికొందరు ఇతర పార్టీల, స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారని తెలిపారు. నేడు జైపూర్‌లో 10.30 గంటలకు జరగనున్న కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) భేటీకి ఎమ్మెల్యేలంతా హాజరుకాలని విప్ జారీ చేసినట్టు ఆయన చెప్పారు. మీటింగ్‌కు గైర్హాజరు అయినవారిపట్ల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. నేటి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ భేటీలో తాను పాల్గొనటం లేదని ఆదివారం వెలువడిన వాట్సాప్ సందేశంలో సచిన్ పైలట్ పేర్కొన్నారు. దీంతో పైలట్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా, 200 మంది రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మం ది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. (రాజస్తాన్ సంక్షోభం : సింధియా ట్వీట్) -
వివాదాస్పద బిల్లుపై తృణమూల్ ఎంపీలకు విప్ జారీ
సాక్షి, ఢిల్లీ : కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్న పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. ఈ బిల్లు సోమవారం పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశముందని, ఈ నేపథ్యంలో సోమవారం నుంచి గురువారం వరకు పార్టీకి చెందిన ఉభయ సభల సభ్యులందరూ తప్పనిసరిగా సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ విషయంపై ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రియన్ మాట్లాడుతూ.. భారత స్పూర్తికి విరుద్ధమైన ఈ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నామని శుక్రవారం స్పష్టం చేశారు. నాలుగు నెలల క్రితం ఉమ్మడి పౌర స్మృతి విషయంలో అధికార పార్టీ వారు ఒకే దేశం, ఒకే చట్టం అని ఊదరగొట్టారని, కానీ ఇప్పుడు విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ శుక్రవారం కోలకతాలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పౌరసత్వ బిల్లు, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) రెండూ ఒకే నాణేనికి ఉన్న బొమ్మా, బొరుసు లాంటివని వ్యాఖ్యానించారు. పౌరసత్వం అందరికీ ఇస్తానంటే తమకు అభ్యంతరం లేదని, కానీ మతం ఆధారంగా పౌరసత్వం కల్పిస్తామంటే ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని వెల్లడించారు. పడిపోతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బీజేపీ ఈ బిల్లును ముందుకు తెచ్చిందని విమర్శించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న 12 ప్రతిపక్ష పార్టీలను కలిసి ఏం చేయాలనే దానిపై అందరం ఒక నిర్ణయానికి వస్తామన్నారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపర వేధింపులకు గురువుతున్న ముస్లిమేతర వర్గాల వారికి భారత పౌరసత్వ అవకాశం కల్పిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం పౌరసత్వ సవరణ బిల్లు- 2019ను ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే మత పరమైన వివక్షకు గురవుతున్న ముస్లింలలోని అల్పసంఖ్యాక వర్గాలైన షియా, అహ్మదీయ వర్గాలకు కూడా ఈ సదుపాయం కల్పించాలనే డిమాండ్‌తో ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఎన్నార్సీని కూడా పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నార్సీని అమలుచేయనీయమని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేయగా, పశ్చిమ బెంగాల్లో కూడా కుదరదని మమతా బెనర్జీ ఎప్పటినుంచో చెప్తోంది. అయితే ఇటీవల జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 2024 లోగాదేశ వ్యాప్తంగా ఎన్నార్సీని ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, ఇటు జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య పరిస్థితి నువ్వా, నేనా అన్నట్టు కొనసాగుతోంది. -
రేపు రాజ్యసభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుపై పాలక బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖాముఖీ పోరుకు సంసిద్ధమయ్యాయి. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ తాజా బిల్లును ఆమోదింపచేసుకున్న ప్రభుత్వం సోమవారం పెద్దల సభలోనూ బిల్లును ప్రవేశపెడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై ఓటింగ్ జరుగుతుందనే అంచనాతో బీజేపీ, కాంగ్రెస్‌లు తమ సభ్యులను సోమవారం పార్లమెంట్ సమావేశాలకు విధిగా హాజరు కావాలని కోరుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం తలదూర్చరాదని ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లోని సభ్యులను పార్లమెంట్ సమావేశాలకు విధిగా హాజరు కావాలని విప్ జారీ చేసింది. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లు గత గురువారం విపక్షాల వాకౌట్ మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది ఇక సోమవారం రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టి, సభామోదం పొందాలని బీజేపీ పట్టుదలగా ఉంటే, బిల్లును తాము సూచించిన మార్పులు చేపట్టకుంటే ఆమోదించేది లేదని కాంగ్రెస్ తేల్చిచెబుతోంది. -
పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : పార్టీ లోక్‌సభ ఎంపీలందరూ నేడు, రేపు విధిగా సభలో ఉండాలని మూడు వాక్యాలతో కూడిన విప్‌ను బీజేపీ గురువారం జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టనుండటంతో సభ్యులకు విప్ జారీ చేసింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును సభ ముందుంచేందుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకుమందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్ధాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ బిల్లుకు మద్దతివ్వాలని విపక్షాలను ప్రభుత్వం కోరింది. పార్లమెంట్లో అవాంతరాలతో కీలక సభా సమయం వృధా అవుతోందని ప్రధాని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా పార్లమెంట్ ఉభయసభలూ సాగాలని ఆకాంక్షించారు. -
ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం సభలో చర్చకు రానున్న నేపథ్యంలో బీజేపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. శుక్రవారం నుంచి సభకు విధిగా హాజరుకావాలని కోరుతూ ఎంపీలకు మూడు లైన్లతో కూడిన విప్‌ను జారీ చేశారు. కాగా, పార్టీ చీఫ్ విప్‌గా అనురాగ్ ఠాకూర్‌ను బుధవారం ఉదయం బీజేపీ నియమించింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను తమ ఎంపీలకూ విప్ జారీ చేయాలని బీజేపీ కోరింది. మరోవైపు నరేంద్ర మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సమావేశాల్లో విధిగా పాల్గొనాలని కోరుతూ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బుధవారం స్పీకర్ సుమిత్రా మహజన్ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి అనంతకుమార్ స్పందిస్తూ మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, చర్చలో అన్ని అంశాలను వెల్లడిస్తామన్నారు. -
వైఎస్ఆర్సీపీకి విప్ జారీ అధికారం
శ్రీకాకుళం: మండల, జిల్లాపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి విప్ జారీ చేసే అధికారం వైఎస్ఆర్సీపీకి కూడా ఉందని జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్ స్పష్టం చేశారు. ఈ విషయమై ఎన్నికల సంఘం నుంచి వివరణ తీసుకున్నామన్నారు. ఆ పార్టీకి కూడా విప్ జారీ చేసే అధికారం ఉన్నట్టు తెలిపారని చెప్పారు. మండల, జిల్లాపరిషత్ ఎన్నికల్లో సభ్యులు అనుసరించాల్సిన విధివిధానాలను ఆయన విలేకరులకు బుధవారం వెల్లడించారు. విప్ ధిక్కరించిన వారికి పదవి పోయే ప్రమాదం ఉందన్నారు. అయితే వారు విప్‌ను ధిక్కరించి వేసే ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుందన్నారు. విప్‌ను జారీ చేసే వారుగానీ, పార్టీ ప్రతినిధులుగానీ విప్‌ను ధిక్కరించిన విషయమై మూడు రోజుల్లోగా తెలియజేస్తే ఏడు రోజుల్లోగా సంబంధిత సభ్యులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాత అనర్హతపై ప్రిసైడింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని వివరించారు. జూలై 4న మండల పరిషత్ అధ్యక్ష, 5న జిల్లాపరిషత్ అధ్యక్ష ఎన్నికలు పరోక్ష పద్ధతిన జరుగుతాయన్నారు. ముందుగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తామని.. వారు మండల పరిధిలో ఓటరై ఉండడంతోపాటు మైనార్టీ సామాజిక వర్గానికి చెంది ఉండాలన్నారు. ఉదయం 10 గంటలలోగా నామినేషన్ దాఖలు చేయాలని వాటిపై పరిశీలన పూర్తి చేసిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఎన్నిక ఉంటుందన్నారు. ఎన్నిక అనివార్యమైతే చేతులెత్తే పద్ధతిన ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. తరువాత మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను ప్రత్యేక సమావేశం ద్వారా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఎన్నిక అనివార్యమైతే కేవలం సభ్యులు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుందని కో-ఆప్షన్ సభ్యులకు ఓటింగ్ చేసే అధికారం లేదన్నారు. మండల, జిల్లాపరిషత్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండరని పేర్కొన్నారు.