ట్రంప్ గెలవాలని బలంగా కోరుకున్నాను
చెన్నై: అతడు మాములు రెస్టారెంటు యజమాని. కానీ, రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి. ఎక్కడ ఎన్నికలు జరుగుతున్న తీక్షణగా గమనిస్తుంటాడు. అలాగే, అమెరికా ఎన్నికలు కూడా ఫాలో అయ్యాడు. అధ్యక్ష అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయం తెలుసుకుంటూనే ఉన్నాడు. కానీ, గతంలోకంటే రెట్టింపు ఉత్సాహంతో. అందుకు ప్రధాన కారణం ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్. సంచలన వ్యాఖ్యలతో అందరినీ ఆకర్షించినట్లుగానే చెన్నైకి చెందిన ముకుందు అనే హోటల్ యజమానిని ఆకర్షించాడు.
ఎంతలా అంటే.. ట్రంప్ విజయంతో ప్రపంచమంతా ఖంగుతినగా ఆ ముకుందు మాత్రం పండగ చేసుకున్నాడు. తన జోస్యం నిజమైనందుకు సంబరాలు చేసుకున్నాడు. ఆ రోజు తన వద్దకు వచ్చినవారందరికీ వైట్ దోశ(ట్రంప్) మరింత రుచిగా వేసి ఇచ్చి ఔరా అనిపించాడు. వార్తల్లో నిలిచాడు. 'నేను అధ్యక్ష అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి అమెరికా ఎన్నికలు ఫాలో అవుతున్నాను. నేనెప్పుడూ ట్రంప్‌కు మద్దతిచ్చేవాడిని. అతడు మాట్లాడే విధానం, ధోరణి చాలా బాగుంటుంది. ఆయన అధ్యక్షుడు కావాలని బలంగా కోరుకున్నాను.
మీడియా మొత్తం ట్రంప్ ఓడిపోతాడని చెబితే నేను మాత్రం గెలుస్తాడని చెప్పాను. నిజంగా గెలిచాడు. అందుకే దీనిని ఒక ఉత్సవంగా జరుపుకోవాలనుకున్నాను. బాగా ఆలోచించి ట్రంప్ దోశ వేయాలనుకున్నాను. నా కుమారులతో చర్చించి 10 నుంచి 15 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత రుచికరమైన తెల్లదోశను వేయగలిగాం' అలా ఆరోజంతా అందరికీ ట్రంప్ దోశ వేసి పండుగ చేసుకున్నాను' అనఇ ముకుందు చెప్పాడు.