Wholesale Price
-
చుక్కలు చూపిస్తున్న హోల్ సేల్ ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ ఆగస్టులో 11.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే ఈ బాస్కెట్ ఉత్పత్తుల ధర 11.39 శాతం పెరిగిందన్నమాట. సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ధరలుసహా అన్ని విభాగాల్లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఒక్క ఆహార ఉత్పత్తుల విభాగం మాత్రం ఊరటనిస్తోంది. వరుసగా ఐదు నెలల నుంచీ టోకు ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగుతోంది. ముఖ్య విభాగాలు ఇలా... ♦ఆహార ఉత్పత్తుల ధరలు వరుసగా నాల్గవ నెలా తగ్గాయి. ఆగస్టులో అసలు పెరక్కపోగా 1.29 శాతం దిగివచ్చాయి. అయితే ఉల్లి (62.78 శాతం), పప్పు దినుసుల (9.41 శాతం) ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కూరగాయల ధరలు 13.30 శాతం తగ్గాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీ రేటు రెపోకు (ప్రస్తుతం 4 శాతం) ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో పూర్తి అదుపులోకి (5.3 శాతం) వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం ఈ శ్రేణి 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి. ♦క్రూడ్, పెట్రోలియం, సహజవాయువుల ధరలు 40.03 శాతం ఎగశాయి. ఫ్యూయల్, పవర్ విషయంలో ద్రవ్యోల్బణం 26.1 శాతంగా ఉంది. ఎల్పీజీ (48.1 శాతం), పెట్రోల్ (61.5 శాతం), డీజిల్ (50.7 శాతం) ధరలు భారీగా ఎగశాయి. ♦తయారీ ఉత్పత్తుల ధరలు 11.39% పెరిగాయి. జూలైలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 11.20%గా ఉంది. వరుసగా నాలుగు నెలల నుంచీ తయారీలో ధరల స్పీడ్ రెండు అంకెలపైన కొనసాగుతోంది. -
మూడోనెలా... రెండంకెలపైనే టోకు ధరలు!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో వరుసగా మూడవనెలా రెండంకెలపైనే కొనసాగింది. జూన్‌లో 12.07 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 జూన్‌తో పోల్చితే 2021 జూన్‌లో టోకు ధరల బాస్కెట్‌లోని ఉత్ప త్తుల ధరలు 12.07% పెరిగాయన్నమాట. కాగా, ఇదే ఏడాది మే నెలతో పోల్చితే, జూన్‌లో టోకు ద్రవ్యోల్బణం కొంచెం తగ్గడం (మేలో 12.94%) కొంతలో కొంత ఊరట. మేతో పోల్చితే, జూన్‌లో టోకు బాస్కెట్‌లోని ఆహారం, క్రూడ్ ధరలు తగ్గడం దీనికి కారణం. ‘తీవ్రత’కు బేస్ కూడా కారణం కాగా టోకు ద్రవ్యోల్బణం వరుసగా మూడవనెల కూడా రెండంకెల పైన కనబడ్డానికి గత ఏడాది లో బేస్ ఎఫెక్ట్ కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 జూన్ నెలను తీసుకుంటే, కరోనా సవాళ్లు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో వ్యవస్థలో డిమాండ్ పడిపోయి ఏకంగా 1.81 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఇది తాజా సమీక్షా నెల టోకు ధరలు తీవ్రంగా కనబడ్డానికి దారితీసింది. ఇలాంటి ధోరణే 2021 అక్టోబర్ వరకూ కొనసాగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2020 జూన్‌తో పోల్చితే తాజా సమీక్షా నెల్లో పెట్రోల్, డీజిల్, నాఫ్తా, ఏవియేషన్ ఫ్యూయెల్, ఫర్నీస్ ఆయిల్ వంటి మినరల్ ఆయిల్స్, వీటితోపాటు బేసిక్ మెటల్ , ఫుడ్ ప్రొడక్ట్స్, కెమికల్ ప్రొడక్ట్స్ ధరలు పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది. ► కాగా జూన్‌లో ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ 32.83 శాతం పెరిగింది. మేలో ఇది ఏకంగా 37.61 శాతంగా ఉంది. ► ఫుడ్ ఆర్టికల్స్ విషయంలో రేట్లు 4.31% (2021 మే నెల) నుంచి 3.09%కి తగ్గింది. ► మొత్తం సూచీలో మెజారిటీగా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరల స్పీడ్ జూన్‌లో 10.88 శాతం. మే నెల్లో ఇది 10.83 శాతం. ► కాగా ఆర్బీఐ తన రెపో రేటు విధానానికి (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో ప్రస్తుతం 4%) ప్రాతిపదికగా తీసుకునే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 6.26%గా ఉంది. కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్న స్థాయి (2–6) కన్నా అధికంగా కొనసాగడం ఇది వరుసగా రెండవనెల. -
టన్ను బత్తాయి ధర ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలో డిమాండ్ పెరగడంతో బత్తాయికి రికార్డు స్థాయిలో ధర లభించింది. హోల్‌సేల్ మార్కెట్లో టన్ను బత్తాయి ధర రూ.లక్ష పలుకుతోంది. సామాన్యులు మార్కెట్లో కొనుగోలు చేయాలంటే కిలో బత్తాయి రూ.100 కు విక్రయిస్తున్నారు. ఈ ధర గతంలో ఎప్పుడూ లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. విటమిన్–సి పుష్కలంగా ఉండడంతో డాక్టర్లు కోవిడ్ పేషెంట్లను బత్తాయి తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది బత్తాయి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కొత్తపేట్‌లో శుక్రవారం గతంలో ఎన్నడూలేని విధంగా టన్ను లక్ష రూపాయలు పలికింది. మరోవైపు రోజు మార్కెట్‌కు 800 టన్నుల బత్తాయి దిగుబడి రావాలి. కానీ గత నెల నుంచి డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక కూడా ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం కేవలం 300 టన్నుల బత్తాయి మాత్రమే మార్కెట్‌కు దిగుమతి అవుతోందని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. కరోనా కాలంలో కొత్తపేట పండ్ల మార్కెట్ నుంచి బత్తాయి ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధర టన్ను బత్తాయి ధర రూ.లక్ష పలకడం కొత్తపేట మార్కెట్ చరిత్రలోనే రికార్డు. కోవిడ్ నేపథ్యంలో బత్తాయి వినియోగం దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడి మార్కెట్ నుంచే ఎగుమతులు అవుతాయి. ఈ ఏడాది బత్తాయి పూత సమయంలో వర్షాలతో పూత రాలి దిగుబడి తగ్గింది. దీంతో కూడా డిమాండ్‌కు మేర సరుకు లేక ధర పెరిగింది. – సయ్యద్ అఫ్సర్, హోల్‌సేల్ వ్యాపారి, కొత్తపేట చదవండి: అమ్మ నా ‘బత్తాయో’..! ధర అంతేంటి? -
టోకు ద్రవ్యోల్బణం... 9 నెలల గరిష్టం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో 1.55 శాతంగా నమోదయ్యింది. అంటే టోకు బాస్కెట్‌లోని ఉత్పత్తుల ధర 2019 నవంబర్‌తో పోల్చితే, 2020 నవంబర్‌లో 1.55 శాతం పెరిగిందన్నమాట. ఫిబ్రవరిలో 2.26 శాతం నమోదు తర్వాత, గడచిన తొమ్మిది నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 60 శాతంగా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. 2020 అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం స్పీడ్ 1.48 శాతం అయితే, గత ఏడాది నవంబర్‌లో ఇది 0.58 శాతంగా ఉంది. ► నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 3.94 శాతంగా ఉంది. అక్టోబర్ (6.37 శాతం)లో నమోదుకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. ఒక్క కూరగాయల ధరలను చూస్తే, 12.24 శాతం పెరిగాయి. ఆలూ విషయంలో ధరల పెరుగుదల తీవ్రంగా 115.12 శాతంగా ఉంది. ► నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విషయానికి వస్తే, ధరల పెరుగుదల 8.43%. ► ఫ్యూయెల్, పవర్ బాస్కెట్లో ధర లు పెరక్కపోగా 9.87% తగ్గాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 6.93 శాతం మరోవైపు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నవంబర్‌లో ఇది 6.93 శాతంగా నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష, కీలక రేట్ల నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదికగా ఉంటుంది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 – 2 శాతం మధ్య ఉండాలి. దీని ప్రకారం నవంబర్ సూచీ అధికంగానే ఉన్నప్పటికీ, అక్టోబర్ 7.61 శాతం కన్నా తగ్గడం గమనార్హం. -
గరిష్టస్థాయికి గుడ్డు ధర..
-
‘గుడ్లు’ తేలేయాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు పెరుగుతున్న కూరగాయల ధరలు.. మరోవైపు ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో గతంలో ఎన్నడూ లేనంతగా కోడి గుడ్డు ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రతికూల పరిస్థితులు, వ్యాపార ఒడిదుడుకులు, రెట్టింపైన వినియోగం కూడా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ లో గుడ్డు ధర రూ.4.66 కాగా.. రిటైల్‌లో రూ.5.25.. చిల్లరగా మాత్రం గుడ్డు ఒక్కొక్కటీ రూ.6 పలుకుతోంది. దీంతో గుడ్డుతో పూట గడుస్తుందని భావించే సామాన్యులపై గుదిబండ పడినట్లయింది. సగానికి తగ్గిన ఉత్పత్తి.. రాష్ట్రంలో కోడి గుడ్ల ఉత్పత్తి సగానికి పడిపోయింది. రాష్ట్రం మొత్తం మీద ప్రతిరోజూ సగటున నాలుగు కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతాయి. మూడు కోట్ల వరకూ వినియోగం ఉంటుంది. ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు సగటున 1.20 కోట్ల గుడ్ల వరకు డిమాండ్ ఉంటుంది. శివారు ప్రాంతాల్లోని పౌల్ట్రీల నుంచి అత్యధికంగా గుడ్లు నగరానికి సరఫరా అవుతాయి. అయితే మూడేళ్లుగా పౌల్ట్రీ వ్యాపారం బాగా దెబ్బతింది. కోళ్లకు రోగాలు రావడం, నిర్వహణ ఖర్చులు ఎక్కువ కావడంతో వ్యాపారులు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. పెద్ద నోట్ల రద్దు పౌల్ట్రీ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ప్రజల వద్ద సరిపడా డబ్బులు లేకపోవడంతో ఒక్కసారిగా గుడ్ల వినియోగం తగ్గింది. గుడ్డు ధర కూడా పడిపోయింది. చిన్న వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోయి ఉత్పత్తికి దూరమయ్యారు. దీంతో ఉత్పత్తి సగం మేర నిలిచిపోయింది. ఇదిలా ఉండగా మార్కెట్లో మాత్రం గుడ్డు వినియోగం పెరిగింది. గతంలో అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి మూడుసార్లు గుడ్లు అందిస్తే.. ఇప్పుడు ప్రతిరోజు అందిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంలో గుడ్డు తప్పనిసరి చేశారు. దీంతో వీటి వినియోగం అధికమైంది. కానీ మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో గుడ్డు ధర ఆకాశాన్నంటింది. గరిష్టస్థాయికి గుడ్డు ధర.. ఆరు నెలలుగా కోడి గుడ్ల ధర ఎగబాకుతూ వస్తోంది. గత నెల వరకూ గుడ్డు హోల్‌సేల్ ధర రూ.3.60 ఉండగా.. నవంబర్ 1వ తేదీకి అది రూ.4.27కు చేరింది. మరో పది రోజుల్లోనే గరిష్టంగా రూ.4.66కు పెరిగింది. ఇక రిటైల్ ధర రూ.5.25 ఉన్నప్పటికీ మార్కెట్లో గుడ్డు ధర రూ.6 పలుకుతోంది. చలికాలం కావటంతో ఏటా ఈ సీజన్లో గుడ్డు ధర పెరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సీజన్ ప్రారంభంలోనే ఇలా ఉంటే వచ్చే మూడు నెలల్లో ధర ఎంత పెరగవచ్చోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా కూరగాయలు, ఆకుకూరల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో వినియోగదారులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. కార్తీక మాసం కూడా ముగుస్తుండటం, వచ్చే వారం నుంచి శుభకార్యాలు జరిగే అవకాశం ఉండటంతో గుడ్డు వినియోగం ఎక్కువ అవుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. -
టోకు ద్రవ్యోల్బణం @3.57 శాతం
• వరుసగా ఏడు నెలల పెరుగుదలకు బ్రేక్ • ఆహారోత్పత్తుల ధరలు తగ్గడమే కారణం • ద్రవ్యోల్బణం తగ్గుతోంది.. రేట్లలో కోత విధించండి • పారిశ్రామిక వర్గాల డిమాండ్ న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం గత నెలలో 3.57 శాతానికి తగ్గింది. గత ఏడు నెలలుగా పెరుగుతూ వచ్చిన టోకుధరల(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది సెప్టెంబర్‌లో తగ్గింది. వర్షాలు బాగా కురవడం వల్ల ఆహారోత్పత్తుల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. ఈ ఏడాది ఆగస్టులో 3.74 శాతంగా ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం ఈ సెప్టెంబర్‌లో 3.57 శాతానికి తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇది మైనస్ 4.59 శాతంగా ఉంది. కాగా గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం 13 నెలల కనిష్టానికి తగ్గి 4.31 శాతానికి చేరింది. రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణాలు తగ్గడంతో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించాలన్న డిమాండ్ పారిశ్రామిక వర్గాల నుంచి పెరుగుతోంది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉన్నందున బ్యాంక్‌లు వడ్డీరేట్లను తగ్గించాలని, ఫలితంగా నిరాశజనకంగా ఉన్న పారిశ్రామికోత్పత్తి జోరు పెరుగుతుందని ఫిక్కీ కోరుతోంది. ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే సరఫరా సంబంధిత చర్యలను తీసుకోవడంలో ప్రభుత్వం విజయవంతం అయిందని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చిందని సీఐఐ పేర్కొంది. ⇔ టోకు ధరల ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పెరుగుతూ వస్తోంది. గత నెలలో పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే, 23.99 శాతంగా ఉంది. ఇక కూరగాయల ఆధారిత డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మైనస్ 10.91 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జూలైలో ఇది గరిష్ట స్థాయిలో 28.45 శాతంగా ఉంది. మొత్తం మీద ఆహార ద్రవ్యోల్బణం 5.75 శాతానికి తగ్గింది. ఆగస్టులో ఇది 8.23 శాతంగా ఉంది. ఆహార పదార్ధాల ధరలు తగ్గడం వల్ల రిటైల్, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణాలు తగ్గాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. వచ్చే నెలలో కూడా ఇవే పరిస్థితులు కొనసాగుతాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
11వ నెలా మైనస్‌లోనే..!
టోకు ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 4.54% క్షీణత అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల ప్రభావం సామాన్యునికి తప్పని ఉల్లిఘాటు.. 114% పెరిగిన ధరలు పప్పు దినుసుల ధరలు 39 శాతం అప్ న్యూఢిల్లీ: టోకు ధరలకు సంబంధించి ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -4.54 శాతంగా ఉంది. అంటే 2014 సెప్టెంబర్‌తో పోల్చి చూస్తే (2.38 శాతం)... టోకున పలు ఉత్పత్తుల బాస్కెట్ ధరలు అసలు పెరక్కపోగా -4.54 శాతం క్షీణించాయన్నమాట. ఇలాంటి పరిస్థితి 11 నెలలుగా కొనసాగుతోంది. క్రూడ్‌సహా అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగువ స్థాయిల్లో కొనసాగుతుండడం దేశంలో టోకు ధరల క్షీణతకు కారణం. భారత్ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఈ ధోరణి కలిసి వస్తున్నదేనని నిపుణుల అభిప్రాయం. కాగా టోకు ద్రవ్యోల్బణంలో ఒక విభాగంగా ఉన్న ఆహార ఉత్పత్తుల్లో కొన్నింటి ధరలు మాత్రం భారీగానే ఉన్నాయి. ప్రధానంగా పప్పులు, ఉల్లి ధరలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇది సామాన్యునికి ప్రతికూల అంశమే.. మూడు విభాగాలనూ చూస్తే.! ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్ కేటగిరీలతో ఉన్న ఈ విభాగం (వెయిటేజ్ 20 శాతం)లో టోకు ద్రవ్యోల్బణం రేటు వార్షికంగా 2.09 శాతం ఎగసింది. ఇందులో 14% వెయిటేజ్ ఉన్న ఒక్క ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు 0.69%గా ఉంది. 6% వెయిటేజ్ ఉన్న నాన్-ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు 2.61 శాతంగా ఉంది. ఫ్యూయెల్ అండ్ పవర్: 15% వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు అసలు పెరక్కపోగా (క్షీణత) మైనస్ 18 శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తులు: 65 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో రేటు సైతం క్షీణతలో -1.73 శాతంగా ఉంది. పెరిగిన ఉల్లి, పప్పు దినుసులు... ఉల్లి ధరలు వార్షికంగా 114 శాతం ఎగశాయి. పప్పు దినుసుల ధరలు 39 శాతం పెరిగాయి. గడచిన నాలుగు నెలల్లో పప్పు దినుసుల ధరల పెరుగుదల 36 శాతంపైనే వుంటోంది. అయితే కూరగాయల ధరలు మాత్రం 9 శాతం తగ్గాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు 2.02 శాతం పెరిగాయి. పాల ధరలు 2.16 శాతం ఎగశాయి. గోధుమల ధరలు 3.34 శాతం పెరిగాయి. అయితే ఆలూ ధరలు మాత్రం 57 శాతం తగ్గాయి. బ్యాంకులు రేట్లు తగ్గించే వీలు: పరిశ్రమ ద్రవ్యోల్బణం నిర్దేశిత స్థాయిలో ఉంటున్నందువల్ల బ్యాంకులకు రుణ రేటు మరింతగా తగ్గించే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్బీఐ ఈ ఏడాది 1.25% రెపో రేటు (బ్యాంకులు తమ అవసరాలకు ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణంపై చెల్లించే వడ్డీరేటు-ప్రస్తుతం 6.75%) కోత నిర్ణయం తీసుకుంటే... ఈ ప్రయోజనంలో కేవలం సగం మాత్రమే బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించిన విషయాన్ని పరిశ్రమలు గుర్తుచేస్తున్నాయి. వ్యవస్థలో రికవరీ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. అయితే నిత్యావసర వస్తువుల ధరలు పెరక్కుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశాయి. పప్పుదినుసుల ధరలపై సమీక్ష.. పప్పు దినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని అంతర్-మంత్రిత్వ శాఖల బృందం పరిస్థితిని సమీక్షించింది. దిగుమతైన పప్పు దినుసుల రేట్లను కట్టడి చేసే దిశగా రవాణా, ప్రాసెసింగ్ తదితర వ్యయాల కోసం ధరల స్థిరీకరణ ఫండ్ నిధులను ఉపయోగించాలని నిర్ణయించినట్లు జైట్లీ పేర్కొన్నారు. దీనివల్ల సరఫరా మెరుగుపడి, రిటైల్ మార్కెట్లలో పప్పు దినుసులు తక్కువ రేట్లకు లభ్యం కాగలవన్నారు. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా దిగుమతి చేసుకున్న సరుకుతోపాటు కొంత బఫర్ స్టాక్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు జైట్లీ పేర్కొన్నారు. రేట్ల కట్టడికి మరో 2,000 టన్నుల పప్పు దినుసులను దిగుమతి చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పోర్టుల్లో ఉన్న 5,000 టన్నులు, రవాణాలో ఉన్న మరో 2,000 టన్నుల పప్పు దినుసులకు ఇది అదనం. -
మరింత తగ్గిన టోకు ధరలు
2014 మార్చితో పోల్చితే 2015 మార్చిలో ధరలు అసలు పెరక్కపోగా -2.33% తగ్గుదల ఇదే తీరున ఉన్న ఆహారేతర వస్తువులు, ఇంధనం-విద్యుత్, తయారీ రంగాల ఎఫెక్ట్ వరుసగా ఐదు నెలల నుంచీ ఇదే ధోరణి... మళ్లీ ఆర్బీఐ రేట్ల కోత ‘కోరికలు’ న్యూఢిల్లీ: మార్చిలో టోకు ధరలు వార్షిక ప్రతిపదికన మరింత తగ్గాయి. 2014 మార్చితో పోల్చితే 2015 మార్చిలో ధరలు అసలు పెరక్కపోగా -2.33 శాతం తగ్గుదల కనిపించింది (ప్రతి ద్రవ్యోల్బణం). టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంలో ప్రధానమైన తయారీ, ఇంధనం-విద్యుత్, ఆహారేతర వస్తువుల విభాగాల ధోరణి కూడా ఇదే తీరున క్షీణతలో (మైసస్)లో ఉంది. వరుసగా ఐదు నెలల నుంచీ టోకు ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిల్లో వరుసగా ద్రవ్యోల్బణం -0.17 శాతం, -0.50 శాతం, -0.39 శాతం, -2.06 శాతంగా ఉంది. కాగా 2014 మార్చి నెలలో టోకు ద్రవ్యోల్బణం 6 శాతం. అంటే 2013 మార్చితో పోల్చితే 2014 మార్చిలో టోకున ధరలు 6 శాతం పెరిగాయన్నమాట. బుధవారం కేంద్రం తాజా గణాంకాలను విడుదల చేసింది. విభాగాల వారీగా చూస్తే... ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం రేటు వార్షిక ప్రాతిపదికన మార్చిలో 7.31 శాతం నుంచి 0.08 శాతానికి తగ్గింది. ఇందులో ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల రేటు 9.57 శాతం నుంచి 6.31 శాతానికి దిగివచ్చింది. ఆహారేతర ఉత్పత్తుల ధరలు మాత్రం 4.87 శాతం పెరుగుదల నుంచి -7.12 శాతం క్షీణతలోకి జారిపోయాయి.ఇంధనం-విద్యుత్ విభాగంలో కూడా ద్రవ్యోల్బణం 4.87 శాతం నుంచి - 7.12 శాతం ప్రతి ద్రవ్యోల్బణం (క్షీణత)లోకి పడింది.సూచీలో దాదాపు 65 శాతానికి పైగా వెయిటేజ్ కలిగిన తయారీ రంగం కూడా 3.70 శాతం ద్రవ్యోల్బణం స్థాయి నుంచి -0.19 శాతం ప్రతి ద్రవ్యోల్బణం (క్షీణత) బాటలోకి మళ్లింది. పరిశ్రమల ‘వడ్డీరేట్ల’ కోత ఆశ... తాజా పరిణామం పారిశ్రామిక వర్గాలకు మళ్లీ ఆర్బీఐ పాలసీ రేట్ల కోత ఆశలు పుట్టించింది. రెపో రేటును (ప్రస్తుతం 7.5%) మరికొంత తగ్గించడానికి ఇది తగిన సమయమని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ ఏడాది రెండు దఫాలుగా రెపోరేటును అరశాతం తగ్గించిన ఆర్బీఐ, ఏప్రిల్ 7 పాలసీ సందర్భంగా.. తొలుత ఈ ప్రయోజనాన్ని (అంతక్రితం తగ్గించిన రెపో రేటు ప్రయోజనం) కస్టమర్లకు బదలాయించాలని బ్యాంకింగ్‌కు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పటికే ఈ దిశలో పలు బ్యాంకింగ్ దిగ్గజాలు నిర్ణయాలు తీసుకున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఈ దిశలో ఉన్నాయి. ప్రస్తుత తరుణంలో వడ్డీరేట్లు మరింత తగ్గడం వల్ల వినియోగ విశ్వాస పునరుద్ధరణ జరుగుతుందని, పెట్టుబడులు పెరుగుతాయని వెరసి వృద్ధి మరింత పటిష్టమవుతుందని పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది ఇక పూర్తిగా వృద్ధిపై దృష్టి సారించాల్సిన తరుణమని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అన్నారు. ఆహార ఉత్పత్తుల టోకు ధరలు మార్చిలో 6.31 శాతం పెరిగిన విషయాన్ని ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా ప్రస్తావిస్తూ, ఈ ధోరణిని అరికట్టడానికి సరఫరాల వైపు సమస్యల పరిష్కారం తక్షణ అవసరమని అన్నారు.