టోకు ద్రవ్యోల్బణం @3.57 శాతం
• వరుసగా ఏడు నెలల పెరుగుదలకు బ్రేక్
• ఆహారోత్పత్తుల ధరలు తగ్గడమే కారణం
• ద్రవ్యోల్బణం తగ్గుతోంది.. రేట్లలో కోత విధించండి
• పారిశ్రామిక వర్గాల డిమాండ్
న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం గత నెలలో 3.57 శాతానికి తగ్గింది. గత ఏడు నెలలుగా పెరుగుతూ వచ్చిన టోకుధరల(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది సెప్టెంబర్‌లో తగ్గింది. వర్షాలు బాగా కురవడం వల్ల ఆహారోత్పత్తుల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. ఈ ఏడాది ఆగస్టులో 3.74 శాతంగా ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం ఈ సెప్టెంబర్‌లో 3.57 శాతానికి తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇది మైనస్ 4.59 శాతంగా ఉంది. కాగా గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం 13 నెలల కనిష్టానికి తగ్గి 4.31 శాతానికి చేరింది.
రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణాలు తగ్గడంతో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించాలన్న డిమాండ్ పారిశ్రామిక వర్గాల నుంచి పెరుగుతోంది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉన్నందున బ్యాంక్‌లు వడ్డీరేట్లను తగ్గించాలని, ఫలితంగా నిరాశజనకంగా ఉన్న పారిశ్రామికోత్పత్తి జోరు పెరుగుతుందని ఫిక్కీ కోరుతోంది. ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే సరఫరా సంబంధిత చర్యలను తీసుకోవడంలో ప్రభుత్వం విజయవంతం అయిందని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చిందని సీఐఐ పేర్కొంది.
⇔ టోకు ధరల ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పెరుగుతూ వస్తోంది. గత నెలలో పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే, 23.99 శాతంగా ఉంది. ఇక కూరగాయల ఆధారిత డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మైనస్ 10.91 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జూలైలో ఇది గరిష్ట స్థాయిలో 28.45 శాతంగా ఉంది. మొత్తం మీద ఆహార ద్రవ్యోల్బణం 5.75 శాతానికి తగ్గింది. ఆగస్టులో ఇది 8.23 శాతంగా ఉంది. ఆహార పదార్ధాల ధరలు తగ్గడం వల్ల రిటైల్, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణాలు తగ్గాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. వచ్చే నెలలో కూడా ఇవే పరిస్థితులు కొనసాగుతాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది.