మూడోనెలా... రెండంకెలపైనే టోకు ధరలు! | WPI inflation eases to 12.07percent in June | Sakshi
Sakshi News home page

మూడోనెలా... రెండంకెలపైనే టోకు ధరలు!

Published Thu, Jul 15 2021 6:11 AM | Last Updated on Thu, Jul 15 2021 6:11 AM

WPI inflation eases to 12.07percent in June - Sakshi

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో వరుసగా మూడవనెలా రెండంకెలపైనే కొనసాగింది. జూన్‌లో 12.07 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 జూన్‌తో పోల్చితే 2021 జూన్‌లో టోకు ధరల బాస్కెట్‌లోని ఉత్ప త్తుల ధరలు 12.07% పెరిగాయన్నమాట. కాగా, ఇదే ఏడాది మే నెలతో పోల్చితే,  జూన్‌లో టోకు ద్రవ్యోల్బణం కొంచెం తగ్గడం (మేలో 12.94%) కొంతలో కొంత ఊరట. మేతో పోల్చితే, జూన్‌లో టోకు బాస్కెట్‌లోని ఆహారం, క్రూడ్‌ ధరలు తగ్గడం దీనికి కారణం.

‘తీవ్రత’కు బేస్‌ కూడా కారణం
కాగా టోకు ద్రవ్యోల్బణం వరుసగా మూడవనెల కూడా రెండంకెల పైన కనబడ్డానికి గత ఏడాది లో బేస్‌ ఎఫెక్ట్‌ కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్‌ ఎఫెక్ట్‌. ఇక్కడ 2020 జూన్‌ నెలను  తీసుకుంటే,  కరోనా సవాళ్లు, కఠిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యవస్థలో డిమాండ్‌ పడిపోయి ఏకంగా 1.81 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఇది తాజా సమీక్షా నెల టోకు ధరలు తీవ్రంగా కనబడ్డానికి దారితీసింది. ఇలాంటి ధోరణే 2021 అక్టోబర్‌ వరకూ కొనసాగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
► 2020 జూన్‌తో పోల్చితే తాజా సమీక్షా నెల్లో పెట్రోల్, డీజిల్, నాఫ్తా, ఏవియేషన్‌ ఫ్యూయెల్, ఫర్నీస్‌ ఆయిల్‌ వంటి మినరల్‌ ఆయిల్స్,  వీటితోపాటు బేసిక్‌ మెటల్‌ , ఫుడ్‌ ప్రొడక్ట్స్, కెమికల్‌ ప్రొడక్ట్స్‌ ధరలు పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది.  
► కాగా జూన్‌లో ఫ్యూయెల్‌ అండ్‌ పవర్‌ బాస్కెట్‌ 32.83 శాతం పెరిగింది. మేలో ఇది ఏకంగా 37.61 శాతంగా ఉంది.  
► ఫుడ్‌ ఆర్టికల్స్‌ విషయంలో రేట్లు 4.31% (2021 మే నెల) నుంచి 3.09%కి తగ్గింది.
► మొత్తం సూచీలో మెజారిటీగా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరల స్పీడ్‌ జూన్‌లో 10.88 శాతం. మే నెల్లో ఇది 10.83 శాతం.  
► కాగా  ఆర్‌బీఐ తన రెపో రేటు విధానానికి (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో ప్రస్తుతం 4%) ప్రాతిపదికగా తీసుకునే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం జూన్‌లో 6.26%గా ఉంది. కేంద్రం ఆర్‌బీఐకి నిర్దేశిస్తున్న స్థాయి (2–6) కన్నా అధికంగా కొనసాగడం ఇది వరుసగా రెండవనెల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement