11వ నెలా మైనస్‌లోనే..!
టోకు ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 4.54% క్షీణత
అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల ప్రభావం
సామాన్యునికి తప్పని ఉల్లిఘాటు.. 114% పెరిగిన ధరలు
పప్పు దినుసుల ధరలు 39 శాతం అప్
న్యూఢిల్లీ: టోకు ధరలకు సంబంధించి ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -4.54 శాతంగా ఉంది. అంటే 2014 సెప్టెంబర్‌తో పోల్చి చూస్తే (2.38 శాతం)... టోకున పలు ఉత్పత్తుల బాస్కెట్ ధరలు అసలు పెరక్కపోగా -4.54 శాతం క్షీణించాయన్నమాట. ఇలాంటి పరిస్థితి 11 నెలలుగా కొనసాగుతోంది. క్రూడ్‌సహా అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగువ స్థాయిల్లో కొనసాగుతుండడం దేశంలో టోకు ధరల క్షీణతకు కారణం. భారత్ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఈ ధోరణి కలిసి వస్తున్నదేనని నిపుణుల అభిప్రాయం. కాగా టోకు ద్రవ్యోల్బణంలో ఒక విభాగంగా ఉన్న ఆహార ఉత్పత్తుల్లో కొన్నింటి ధరలు మాత్రం భారీగానే ఉన్నాయి. ప్రధానంగా పప్పులు, ఉల్లి ధరలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇది సామాన్యునికి ప్రతికూల అంశమే..
మూడు విభాగాలనూ చూస్తే.!
ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్ కేటగిరీలతో ఉన్న ఈ విభాగం (వెయిటేజ్ 20 శాతం)లో టోకు ద్రవ్యోల్బణం రేటు వార్షికంగా 2.09 శాతం ఎగసింది. ఇందులో 14% వెయిటేజ్ ఉన్న ఒక్క ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు 0.69%గా ఉంది. 6% వెయిటేజ్ ఉన్న నాన్-ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు 2.61 శాతంగా ఉంది.
ఫ్యూయెల్ అండ్ పవర్: 15% వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు అసలు పెరక్కపోగా (క్షీణత) మైనస్ 18 శాతంగా ఉంది.
తయారీ ఉత్పత్తులు: 65 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో రేటు సైతం క్షీణతలో -1.73 శాతంగా ఉంది.
పెరిగిన ఉల్లి, పప్పు దినుసులు...
ఉల్లి ధరలు వార్షికంగా 114 శాతం ఎగశాయి. పప్పు దినుసుల ధరలు 39 శాతం పెరిగాయి. గడచిన నాలుగు నెలల్లో పప్పు దినుసుల ధరల పెరుగుదల 36 శాతంపైనే వుంటోంది. అయితే కూరగాయల ధరలు మాత్రం 9 శాతం తగ్గాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు 2.02 శాతం పెరిగాయి. పాల ధరలు 2.16 శాతం ఎగశాయి. గోధుమల ధరలు 3.34 శాతం పెరిగాయి. అయితే ఆలూ ధరలు మాత్రం 57 శాతం తగ్గాయి.
బ్యాంకులు రేట్లు తగ్గించే వీలు: పరిశ్రమ
ద్రవ్యోల్బణం నిర్దేశిత స్థాయిలో ఉంటున్నందువల్ల బ్యాంకులకు రుణ రేటు మరింతగా తగ్గించే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్‌బీఐ ఈ ఏడాది 1.25% రెపో రేటు (బ్యాంకులు తమ అవసరాలకు ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణంపై చెల్లించే వడ్డీరేటు-ప్రస్తుతం 6.75%) కోత నిర్ణయం తీసుకుంటే... ఈ ప్రయోజనంలో కేవలం సగం మాత్రమే బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించిన విషయాన్ని పరిశ్రమలు గుర్తుచేస్తున్నాయి. వ్యవస్థలో రికవరీ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. అయితే నిత్యావసర వస్తువుల ధరలు పెరక్కుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశాయి.
పప్పుదినుసుల ధరలపై సమీక్ష..
పప్పు దినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని అంతర్-మంత్రిత్వ శాఖల బృందం పరిస్థితిని సమీక్షించింది. దిగుమతైన పప్పు దినుసుల రేట్లను కట్టడి చేసే దిశగా రవాణా, ప్రాసెసింగ్ తదితర వ్యయాల కోసం ధరల స్థిరీకరణ ఫండ్ నిధులను ఉపయోగించాలని నిర్ణయించినట్లు జైట్లీ పేర్కొన్నారు. దీనివల్ల సరఫరా మెరుగుపడి, రిటైల్ మార్కెట్లలో పప్పు దినుసులు తక్కువ రేట్లకు లభ్యం కాగలవన్నారు. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా దిగుమతి చేసుకున్న సరుకుతోపాటు కొంత బఫర్ స్టాక్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు జైట్లీ పేర్కొన్నారు. రేట్ల కట్టడికి మరో 2,000 టన్నుల పప్పు దినుసులను దిగుమతి చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పోర్టుల్లో ఉన్న 5,000 టన్నులు, రవాణాలో ఉన్న మరో 2,000 టన్నుల పప్పు దినుసులకు ఇది అదనం.