సాక్షి, హైదరాబాద్: ఒకవైపు పెరుగుతున్న కూరగాయల ధరలు.. మరోవైపు ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో గతంలో ఎన్నడూ లేనంతగా కోడి గుడ్డు ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రతికూల పరిస్థితులు, వ్యాపార ఒడిదుడుకులు, రెట్టింపైన వినియోగం కూడా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ లో గుడ్డు ధర రూ.4.66 కాగా.. రిటైల్‌లో రూ.5.25.. చిల్లరగా మాత్రం గుడ్డు ఒక్కొక్కటీ రూ.6 పలుకుతోంది. దీంతో గుడ్డుతో పూట గడుస్తుందని భావించే సామాన్యులపై గుదిబండ పడినట్లయింది.
సగానికి తగ్గిన ఉత్పత్తి..
రాష్ట్రంలో కోడి గుడ్ల ఉత్పత్తి సగానికి పడిపోయింది. రాష్ట్రం మొత్తం మీద ప్రతిరోజూ సగటున నాలుగు కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతాయి. మూడు కోట్ల వరకూ వినియోగం ఉంటుంది. ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు సగటున 1.20 కోట్ల గుడ్ల వరకు డిమాండ్ ఉంటుంది. శివారు ప్రాంతాల్లోని పౌల్ట్రీల నుంచి అత్యధికంగా గుడ్లు నగరానికి సరఫరా అవుతాయి. అయితే మూడేళ్లుగా పౌల్ట్రీ వ్యాపారం బాగా దెబ్బతింది. కోళ్లకు రోగాలు రావడం, నిర్వహణ ఖర్చులు ఎక్కువ కావడంతో వ్యాపారులు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. పెద్ద నోట్ల రద్దు పౌల్ట్రీ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ప్రజల వద్ద సరిపడా డబ్బులు లేకపోవడంతో ఒక్కసారిగా గుడ్ల వినియోగం తగ్గింది. గుడ్డు ధర కూడా పడిపోయింది. చిన్న వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోయి ఉత్పత్తికి దూరమయ్యారు. దీంతో ఉత్పత్తి సగం మేర నిలిచిపోయింది. ఇదిలా ఉండగా మార్కెట్‌లో మాత్రం గుడ్డు వినియోగం పెరిగింది. గతంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో వారానికి మూడుసార్లు గుడ్లు అందిస్తే.. ఇప్పుడు ప్రతిరోజు అందిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంలో గుడ్డు తప్పనిసరి చేశారు. దీంతో వీటి వినియోగం అధికమైంది. కానీ మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో గుడ్డు ధర ఆకాశాన్నంటింది.
గరిష్టస్థాయికి గుడ్డు ధర..
ఆరు నెలలుగా కోడి గుడ్ల ధర ఎగబాకుతూ వస్తోంది. గత నెల వరకూ గుడ్డు హోల్‌సేల్ ధర రూ.3.60 ఉండగా.. నవంబర్ 1వ తేదీకి అది రూ.4.27కు చేరింది. మరో పది రోజుల్లోనే గరిష్టంగా రూ.4.66కు పెరిగింది. ఇక రిటైల్ ధర రూ.5.25 ఉన్నప్పటికీ మార్కెట్లో గుడ్డు ధర రూ.6 పలుకుతోంది. చలికాలం కావటంతో ఏటా ఈ సీజన్లో గుడ్డు ధర పెరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సీజన్ ప్రారంభంలోనే ఇలా ఉంటే వచ్చే మూడు నెలల్లో ధర ఎంత పెరగవచ్చోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా కూరగాయలు, ఆకుకూరల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో వినియోగదారులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. కార్తీక మాసం కూడా ముగుస్తుండటం, వచ్చే వారం నుంచి శుభకార్యాలు జరిగే అవకాశం ఉండటంతో గుడ్డు వినియోగం ఎక్కువ అవుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment