''వైట్హౌస్లోనే ఒబామా తల తీసేస్తాం''
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తలను ఆయన అధికారిక నివాసం వైట్హౌస్లోనే తీసేస్తామంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సభ్యుడొకరు హెచ్చరించాడు. అమెరికాను ముస్లిం దేశంగా మార్చేస్తామని కూడా అన్నాడు. కుర్దిష్ సైనికుడిని అత్యంత క్రూరంగా చంపిన వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యానాలు చేశాడు. 'మోసుల నగరంలో శాంతియుత ముస్లింల మీద బాంబుల వర్షం' అనే శీర్షికతో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇరాక్ లోని మోసుల్ నగరంలో బాంబు దాడుల కారణంగా జరిగిన నష్టాన్ని ప్రధానంగా ఈ వీడియోలో చూపించారు.
అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, కుర్దుల మీద దాడి చేస్తామని ముసుగు వేసుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాది హెచ్చరించాడు. తమవాళ్లు అమెరికా, కుర్దిష్ అధ్యక్షులను హతమారుస్తారని, యూరోపియన్ దేశాల్లో కారుబాంబుల మోతలు వినిపిస్తాయని కూడా ఆ వీడియోలో హెచ్చరిక జారీ చేశాడు.