Wimbledon 2017
-
ఆల్ఫ్స్ ‘మంచు’ కొండ!
సాక్షి క్రీడా విభాగం : ‘టెన్నిస్ దేవుళ్లు దిగి వచ్చి ఫెడరర్‌తో మ్యాచ్ ఆడేటప్పుడు నీకేం కావాలని అడిగితే ఏం కోరుకుంటావు’... సెమీస్‌లో ఓటమి తర్వాత బెర్డిచ్ను అడిగిన ప్రశ్న ఇది. వెంటనే అతను ‘మీ ప్రశ్నలోనే పెద్ద లోపం ఉంది. అసలు ఫెడరరే టెన్నిస్ దేవుడు అయినప్పుడు ఇక అడిగేదేముంది’ అని అతను తడుముకోకుండా జవాబిచ్చాడు! మరో నెల రోజుల్లో 36 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న వయసులో మరో గ్రాండ్‌స్లామ్ సాధించిన స్విస్ సూపర్ స్టార్ గొప్పతనం గురించి చెప్పుకోగలిగే వేలాది విశేషణాల్లో ఇది ఒకటి మాత్రమే. 19 ఏళ్ల క్రితం జూనియర్ వింబుల్డన్ టైటిల్ నెగ్గి తొలిసారిగా ప్రపంచం దృష్టిలో పడ్డ ఫెడరర్... ఇప్పుడు అదే వేదికపై 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గి తన ఇన్నేళ్ల వైభవాన్ని ఘనంగా చాటాడు. తనంటే పడి చచ్చిపోతుందేమో అనిపించే పచ్చటి పచ్చికపై ఎనిమిదో సారి ట్రోఫీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆరు నెలల క్రితం ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడి ఆ రెండింటిలోనూ ఫెడరర్ విజేతగా నిలుస్తాడని ఎవరైనా చెబితే కచ్చితంగా నమ్మలేని పరిస్థితి. 2017లో మొత్తం ఏడు టోర్నీలు ఆడితే అందులో ఐదింటిలో అతనే విజేత.ఆరు నెలల విరామం తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించడమే ఒక అద్భుతంలా అనిపిస్తే, ఇప్పుడు వింబుల్డన్‌తో తన విలువేమిటో ఫెడెక్స్ మళ్లీ చూపించాడు. గ్రాస్ కోర్టులోనైతే 2003 నాటి ఫెడరర్‌కు, ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. అతని కదలికలు అంతే చురుగ్గా, అంతే అందంగానూ ఉన్నాయి. అతను అలవోకగా ఒంటి చేత్తో ఆడే ‘ఆల్‌టైమ్ బెస్ట్ బ్యాక్ హ్యాండ్’ను తనివితీరా చూడాల్సిందే తప్ప మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. కళాత్మక టెన్నిస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా తెల్లటి దుస్తుల్లో ఆల్ ఇంగ్లండ్ క్లబ్ వేదికగా అతను సాగిస్తున్న విజయ విహారం గురించి ఎంత చెప్పినా తక్కువే. టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా మొత్తం 7 మ్యాచ్‌లను కేవలం 11 గంటల 37 నిమిషాల్లో ముగించడం అనితర సాధ్యం. ఇది ఫెడరర్ జోరుకు ప్రత్యక్ష ఉదాహరణ.36 ఏళ్లు అంటే మామూలుగా చూస్తే మరీ ఎక్కువ కాకపోవచ్చు. కానీ టెన్నిస్‌కు సంబంధించి ఎందరో దిగ్గజ ఆటగాళ్లకు కూడా శరీరం సహకరించకుండా ఆటకు గుడ్‌బై చెప్పేసిన వయసు అది. రోజర్ కూడా మాజీల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. అందుకే అతను ఇప్పుడు తన కెరీర్‌ను అద్భుతంగా ప్లాన్ చేసుకున్నాడు. గత ఏడాది వ్యవధిలో అతను తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు మళ్లీ పాత ఫెడరర్ ఆటను చూపించాయి. 2012లో ఆఖరి సారిగా వింబుల్డన్ గెలిచిన అతను తర్వాత వరుసగా నాలుగేళ్లు విజయం రుచి చూడలేదు. ముఖ్యంగా తన అభిమాన మైదానంలో గత ఏడాది రావ్‌నిచ్ చేతిలో సెమీ ఫైనల్లో ఓటమి అతడి ఆలోచనను మార్చేసింది. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటే గానీ మరింత కాలం ఆటలో కొనసాగలేనని అర్థమైంది. అందుకే రియో ఒలింపిక్స్, యూఎస్ ఓపెన్ సహా ఆరు నెలల పాటు అతను పూర్తిగా ఆటకు దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి కోలుకునేందుకు మరింత సమయం తీసుకున్నాడు. కొత్త ఉత్సాహంతో తిరిగొచ్చి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. అయితే తన బలహీనతల గురించి ఫెడెక్స్‌కు బాగా తెలుసు. అందుకే క్లే కోర్టుకు దూరంగా ఫ్రెంచ్ ఓపెన్ ఆడకుండా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. మోములో చెరగని చిరునవ్వు, ఎక్కడా ఉద్వేగానికి లోను కాకుండా మాటల్లో చల్లదనం రోజర్ మైదానం బయటి శైలి. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తర్వాత ట్రోఫీని తనకు ఇష్టమైన ఆల్ఫ్స్ పర్వతాలపైకి తీసుకెళ్లి తన చిరకాల కోరిక తీరిందని ఫెడరర్ చెప్పుకున్నాడు. పట్టుదల, కఠోర శ్రమ ముందు వయసు లెక్క కాదని మళ్లీ మళ్లీ నిరూపిస్తున్న అతనే స్వయంగా శిఖర సమానుడు. అతని గొప్పతనం ముందు ఆల్ఫ్స్ పర్వతాలు ఒక లెక్కా! -
వింబుల్డన్ విజేత ఫెదరర్
లండన్: వింబుల్డన్ ఫైనల్లో వార్ వన్‌సైడ్ అయ్యింది. రోజర్ ఫెదరర్(స్విడ్జర్లాండ్) దాటికి మారిన్ సిలిచ్ (క్రొయేషియా) చేతులు ఎత్తేశాడు. మారిన్ తో జరిగిన టైటిల్ పోరులో వరుస సెట్లలో నెగ్గి(6-3, 6-1, 6-4) వింబుల్డన్ విజేతగా రోజర్ ఫెదరర్ నిలిచాడు. చివరిగా 2012లో ముర్రేను ఓడించి టైటిల్ గెలిచిన ఈ స్విస్ వీరుడు. 2014, 15 సీజన్లలో రన్నరప్‌గా నిలిచి, తిరిగి 2017 వింబుల్డన్ విజేతగా నిలిచాడు. దీంతో పీట్ సంప్రాస్ (7 టైటిళ్లు) రికార్డును బద్దలు కొట్టి వింబుల్డన్‌లో ఎనిమిదో ట్రోఫీ గెలిచాడు. ఫేదర్కు ఇది 19వ గ్రాండ్‌స్లామ్. -
స్కర్ట్ వేసుకున్న ఫ్యాన్.. ఆమెకు నవ్వాగలేదు!
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చరిత్రలోనే శుక్రవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మహిళల డబుల్స్ మ్యాచ్‌ల కోసం నిర్వహించిన సన్నాహక మ్యాచ్‌లో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు బెల్జియం క్రీడాకారిణి కిమ్ క్లియస్టర్స్ చేసిన ఓ ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది. నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన క్లియస్టర్స్ ఆడియన్స్ గ్యాలరీ నుంచి పెద్దగా అరుపులు వస్తున్న వైపు చూసింది. తన సర్వీస్‌ను లిఫ్ట్ చేస్తారా అని అడగగా ఓ అభిమాని ఆసక్తిచూపగా అతడిని కోర్టులోకి ఆహ్వానించింది. అయితే వింబుల్డన్ రూల్స్ ప్రకారం టెన్నిస్ కోర్టులో ఆడే ప్లేయర్ కచ్చితంగా వైట్ అండ్ వైట్ డ్రెస్సులో ఉండాలి. కోర్టులోకి వచ్చిన వ్యక్తి బ్లూ షార్ట్, గ్రీన్ టీ షర్టు ధరించిన విషయాన్ని గమనించిన బెల్జియం భామ తన వద్ద అదనంగా ఉన్న ఓ స్కర్ట్, టీషర్ట్‌ను ను అతడికి ఆఫర్ చేసింది. అతడికి స్కర్ట్ తొడిగే క్రమంలో ఆమెకు విపరీతమైన నవ్వొచ్చి కోర్టులో పడిపడి నవ్వారు. క్లియ్‌స్టర్ ఇచ్చిన సర్వీస్‌ను అతడు లిఫ్ట్ చేయగానే ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందించారు. క్రీడాకారిణులతో కలిసి ఫొటోలకు నవ్వుతూ ఫోజులిచ్చాడు. వింబుల్డన్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది -
స్కర్ట్ వేసుకున్న ఫ్యాన్.. ఆమెకు నవ్వాగలేదు!
-
వింబుల్డన్ ఫైనల్లో ముగురుజ
లండన్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ ముగురుజ రెండో సారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో 64 నిమిషాల పాటు జరిగిన గేమ్‌లో స్లొవేకియా స్టార్ రిబరికోవాను 6-1, 6-1 తేడాతో ముగురుజ చిత్తుగా ఓడించింది. ఏ దశలో రిబరికోవా పోటీని ఇవ్వలేకపోయింది. ఫ్రీక్వార్టర్లో ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ని ఓడించి సంచలన విజయం నమోదు చేసిన ముగురుజ అదే ఉత్సాహంతో ఫైనల్‌కు చేరింది. ఇక ఫైనల్లో ముగురుజ రెండో సెమీస్‌లో తలపడే కోంటా, వీనస్ లలో ఒకరితో పోటీపడనుంది. 2015 వింబుల్డన్ ఫైనల్స్‌కు చేరి సెరినా విలియమ్స్ చేతిలో ఖంగుతిన్నఈ స్పెయిన్ స్టార్ సంచలన విజయంతో మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గతేడాది ఫ్రేంచ్ ఓపెన్ గెలుచుకున్న ముగురుజ వింబుల్డన్ టైటిల్ కొట్టాలని భావిస్తోంది. రెండో సారి వింబుల్డన్ ఫైనల్‌కు వెళ్లిన తొలి స్పెయిన్ స్టార్‌గా ముగురుజ రికార్డు నమోదు చేసింది. అంతకు ముందు స్పెయిన్ స్టార్ సాంచెజ్ వికారియో 1990 వింబుల్డన్ ఫైనల్ చేరింది. -
ముర్రే శుభారంభం
నాదల్, సిలిచ్ కూడా వింబుల్డన్ టోర్నీ లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ ముర్రే 6–1, 6–4, 6–2తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై గెలిచాడు. గంటా 43 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌కు వర్షం కారణంగా రెండుసార్లు అంతరాయం కలిగింది. మూడు ఏస్‌లు సంధించిన ముర్రే, నెట్ వద్ద 29 పాయింట్లు సాధించాడు. తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. రెండో రౌండ్లో ప్రపంచ 97వ ర్యాంకర్ డస్టిన్ బ్రౌన్ (జర్మనీ)తో ముర్రే ఆడతాడు. మరోవైపు నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా), తొమ్మిదో సీడ్ కీ నిషికోరి (జపాన్) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో నాదల్ 6–1, 6–3, 6–2తో జాన్ మిల్మాన్ (ఆస్ట్రేలియా)పై గెలిచి తన కెరీర్లో 850వ విజయాన్ని నమోదు చేశాడు. క్విటోవా ముందుకు... మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), రెండో సీడ్ హలెప్ (రొమేనియా), నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో క్విటోవా 6–3, 6–4తో లార్సన్ (స్వీడన్)పై, హలెప్ 6–4, 6–1తో ఎరాకోవిచ్ (న్యూజిలాండ్)పై, స్వితోలినా 7–5, 7–6 (10/8)తో బార్టీ (ఆస్ట్రేలియా)పై, వీనస్ 7–6 (9/7), 6–4తో మెర్టెన్స్ (బెల్జియం)పై గెలిచారు. వీనస్ కంట కన్నీరు తొలి రౌండ్లో మెర్టెన్స్పై గెలిచాక మీడియా సమావేశానికి హాజరైన మాజీ చాంపియన్ వీనస్ కన్నీళ్లపర్యంతమైంది. జూన్ 9న ఫ్లోరిడాలో వీనస్ డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో వీనస్ కారు ఢీకొని 78 ఏళ్ల జెరోమ్ బార్సన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇటీవలే మరణించాడు. ఈ విచారకర సంఘటనకు సంబంధించి వీనస్‌ను మీడియా ప్రశ్నించగా ఆమె భోరున విలపించింది. ‘ఆ సంఘటనపై స్పందించేందుకు నా నోట మాటలు రావడంలేదు. ఆట మాత్రమే నా చేతుల్లో ఉంటుంది. జీవితంలో రేపు ఏం జరుగుతుందో చెప్పలేను’ అని వీనస్ వ్యాఖ్యానించింది. ఇప్పటివరకైతే వీనస్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు.