ఆల్ఫ్స్ ‘మంచు’ కొండ!
సాక్షి క్రీడా విభాగం : ‘టెన్నిస్ దేవుళ్లు దిగి వచ్చి ఫెడరర్‌తో మ్యాచ్ ఆడేటప్పుడు నీకేం కావాలని అడిగితే ఏం కోరుకుంటావు’... సెమీస్‌లో ఓటమి తర్వాత బెర్డిచ్‌ను అడిగిన ప్రశ్న ఇది. వెంటనే అతను ‘మీ ప్రశ్నలోనే పెద్ద లోపం ఉంది. అసలు ఫెడరరే టెన్నిస్ దేవుడు అయినప్పుడు ఇక అడిగేదేముంది’ అని అతను తడుముకోకుండా జవాబిచ్చాడు! మరో నెల రోజుల్లో 36 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న వయసులో మరో గ్రాండ్‌స్లామ్ సాధించిన స్విస్ సూపర్ స్టార్ గొప్పతనం గురించి చెప్పుకోగలిగే వేలాది విశేషణాల్లో ఇది ఒకటి మాత్రమే. 19 ఏళ్ల క్రితం జూనియర్ వింబుల్డన్ టైటిల్ నెగ్గి తొలిసారిగా ప్రపంచం దృష్టిలో పడ్డ ఫెడరర్... ఇప్పుడు అదే వేదికపై 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గి తన ఇన్నేళ్ల వైభవాన్ని ఘనంగా చాటాడు. తనంటే పడి చచ్చిపోతుందేమో అనిపించే పచ్చటి పచ్చికపై ఎనిమిదో సారి ట్రోఫీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.
ఆరు నెలల క్రితం ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడి ఆ రెండింటిలోనూ ఫెడరర్ విజేతగా నిలుస్తాడని ఎవరైనా చెబితే కచ్చితంగా నమ్మలేని పరిస్థితి. 2017లో మొత్తం ఏడు టోర్నీలు ఆడితే అందులో ఐదింటిలో అతనే విజేత.ఆరు నెలల విరామం తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించడమే ఒక అద్భుతంలా అనిపిస్తే, ఇప్పుడు వింబుల్డన్‌తో తన విలువేమిటో ఫెడెక్స్ మళ్లీ చూపించాడు. గ్రాస్ కోర్టులోనైతే 2003 నాటి ఫెడరర్‌కు, ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. అతని కదలికలు అంతే చురుగ్గా, అంతే అందంగానూ ఉన్నాయి. అతను అలవోకగా ఒంటి చేత్తో ఆడే ‘ఆల్‌టైమ్ బెస్ట్ బ్యాక్ హ్యాండ్’ను తనివితీరా చూడాల్సిందే తప్ప మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. కళాత్మక టెన్నిస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా తెల్లటి దుస్తుల్లో ఆల్ ఇంగ్లండ్ క్లబ్ వేదికగా అతను సాగిస్తున్న విజయ విహారం గురించి ఎంత చెప్పినా తక్కువే. టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా మొత్తం 7 మ్యాచ్‌లను కేవలం 11 గంటల 37 నిమిషాల్లో ముగించడం అనితర సాధ్యం.
ఇది ఫెడరర్ జోరుకు ప్రత్యక్ష ఉదాహరణ.36 ఏళ్లు అంటే మామూలుగా చూస్తే మరీ ఎక్కువ కాకపోవచ్చు. కానీ టెన్నిస్‌కు సంబంధించి ఎందరో దిగ్గజ ఆటగాళ్లకు కూడా శరీరం సహకరించకుండా ఆటకు గుడ్‌బై చెప్పేసిన వయసు అది. రోజర్ కూడా మాజీల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. అందుకే అతను ఇప్పుడు తన కెరీర్‌ను అద్భుతంగా ప్లాన్ చేసుకున్నాడు. గత ఏడాది వ్యవధిలో అతను తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు మళ్లీ పాత ఫెడరర్ ఆటను చూపించాయి. 2012లో ఆఖరి సారిగా వింబుల్డన్ గెలిచిన అతను తర్వాత వరుసగా నాలుగేళ్లు విజయం రుచి చూడలేదు. ముఖ్యంగా తన అభిమాన మైదానంలో గత ఏడాది రావ్‌నిచ్ చేతిలో సెమీ ఫైనల్లో ఓటమి అతడి ఆలోచనను మార్చేసింది. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటే గానీ మరింత కాలం ఆటలో కొనసాగలేనని అర్థమైంది. అందుకే రియో ఒలింపిక్స్, యూఎస్ ఓపెన్ సహా ఆరు నెలల పాటు అతను పూర్తిగా ఆటకు దూరమయ్యాడు.
మోకాలి గాయం నుంచి కోలుకునేందుకు మరింత సమయం తీసుకున్నాడు. కొత్త ఉత్సాహంతో తిరిగొచ్చి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. అయితే తన బలహీనతల గురించి ఫెడెక్స్‌కు బాగా తెలుసు. అందుకే క్లే కోర్టుకు దూరంగా ఫ్రెంచ్ ఓపెన్ ఆడకుండా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. మోములో చెరగని చిరునవ్వు, ఎక్కడా ఉద్వేగానికి లోను కాకుండా మాటల్లో చల్లదనం రోజర్ మైదానం బయటి శైలి. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తర్వాత ట్రోఫీని తనకు ఇష్టమైన ఆల్ఫ్స్ పర్వతాలపైకి తీసుకెళ్లి తన చిరకాల కోరిక తీరిందని ఫెడరర్ చెప్పుకున్నాడు. పట్టుదల, కఠోర శ్రమ ముందు వయసు లెక్క కాదని మళ్లీ మళ్లీ నిరూపిస్తున్న అతనే స్వయంగా శిఖర సమానుడు. అతని గొప్పతనం ముందు ఆల్ఫ్స్ పర్వతాలు ఒక లెక్కా!