Winter Meetings
-
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
-
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. ఈ వారంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, తీర్మానాలతో పాటు ప్రభుత్వం తరఫున ప్రస్తావించాల్సిన అంశాలపైనే కేబినేట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. శాసనసభ, మండలిలో ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, తీర్మానాలను చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. గత అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రభుత్వం వివిధ విభాగాలకు సంబంధించి ఇప్పటి వరకు 8 ఆర్డినెన్స్‌లను జారీ చేసింది. పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం, పీడీ చట్టం, గేమింగ్ చట్టం, వ్యాట్, దుకాణాలు–సముదాయాలు, ఆబ్కారీ చట్టాలకు సవరణ, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు.. తదితర ఆర్డినెన్స్‌లను జారీ చేసింది. వీటన్నిటినీ ఈ సమావేశాల్లోనే బిల్లులుగా ప్రవేశపెట్టి 2 సభల ఆమోదం పొందాల్సి ఉంది. వీటితో పాటు దాదాపు 60 అంశాలను కేబినెట్ భేటీలో చర్చించేందుకు అధికారులు ఎజెండాను సిద్ధం చేశారు. వివిధ శాఖల్లో కొత్త పోస్టుల మంజూరు, నియామకాలకు అనుమతితోపాటు గతంలో మంజూరు చేసిన పోస్టులకు ఆమోదం తెలుపనున్నారు. పంచాయతీరాజ్ చట్టానికి సవరణ! రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటు, పంచాయతీరాజ్ చట్ట సవరణ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై అధ్యయనం, బిల్లు రూపకల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే ఓ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ సోమవారం ఉదయం సచివాలయంలో మరోసారి సమావేశమై నివేదికను ఖరారు చేయనుంది. ఈ నివేదికపై కేబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన, మిషన్ భగీరథ పనుల పురోగతి తదితర అంశాలపైనా చర్చ జరగనుంది. శీతాకాల సమావేశాల సందర్భంగా సభ ద్వారా ప్రభుత్వం జనంలోకి తీసుకెళ్లాలనుకునే అంశాలు, ప్రతిపక్షాల దాడిని తిప్పి కొట్టేందుకు రాజకీయంగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేబినెట్లో చర్చించనున్నారు. బీబీ నగర్ నిమ్స్‌కు 800 పోస్ట్‌లతోపాటు వైద్య, ఆరోగ్య శాఖలో 850 పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. వీటితోపాటు నర్సాపూర్, తిర్మలాయ పాలెం, జాఫర్‌గఢ్, వీపనగండ్ల, మీర్జాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అప్ గ్రేడేషన్, మరో 300 కొత్త ఉద్యోగాలకు ఆమోదం తెలపనుంది. నీటిపారుదల శాఖలో ఈఎన్సీ స్థాయిలో సూపర్ న్యూమరరీ పోస్టును మంజూరు చేసేందుకు ఆమోదం తెలుపనున్నారు. మిషన్ భగీరథకు వివిధ బ్యాంకుల నుంచి రూ.11 వేల కోట్ల రుణాన్ని తీసుకునేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపైనా సమావేశంలో చర్చ జరుగనుంది. నీటిపారుదల ప్రాజెక్టులు, భూసేకరణ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పురోగతి తదితర అంశాల పైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి. -
ప్రశ్నోత్తరాల సమయం పెంపు
-
ప్రశ్నోత్తరాల సమయం పెంపు
గంటన్నర ప్రశ్నోత్తరాలు.. 30 నిమిషాల పాటే ‘జీరో అవర్’ • ఈ నెల 30 వరకు సమావేశాలు • అవసరమైతే జనవరి 2 నుంచి మరో వారం పొడిగింపు • బీఏసీ భేటీలో నిర్ణయాలు ∙సమయ పాలన పాటిద్దామన్న సీఎం సాక్షి, హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించాలని, అవసరమైతే జనవరి 2వ తేదీ నుంచి మరో వారం పాటు పొడిగించాలని అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) భేటీలో నిర్ణయించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలను నిర్వహించనున్నారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ ఎస్.మధుసూధనాచారి అధ్యక్షతన ఆయన కార్యాలయంలో బీఏసీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కనీసం ఇరవై రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు కోరాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈనెలాఖరు దాకా అంటే 12 రోజుల పాటు సమావేశాలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. చర్చించాల్సిన అంశాలు మిగిలిపోయాయని భావిస్తే జనవరి 2వ తేదీ నుంచి మరో వారం పాటు సమావేశాలు నిర్వహించేందుకు సానుకూలమని తెలిపింది. సమావేశాల్లో రోజూ ఉదయం తొలి గంటన్నర సమయాన్ని ప్రశ్నోత్తరాలకు కేటాయించారు. గతం కన్నా దీన్ని పెంచారు. మరో 30 నిమి షాలు జీరో అవర్, టీబ్రేక్గా నిర్ణయించారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పలు అంశాలపై చర్చ జరుపుతారు. ఇక షెడ్యూల్ మేరకు 18, 24, 25 తేదీల్లో అసెంబ్లీకి సెలవుగా ప్రకటించారు. కేవలం 12 పనిదినాలు సరిపోవని, సమావేశాలు మరిన్ని రోజులు జరపాలని విపక్షాల నేతలు కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్... సమావేశాలు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమయ పాలన పాటిద్దాం.. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ విషయంలో కచ్చితంగా సమయాన్ని పాటించాలని.. ఒకవేళ తాను ఆ సమయంలో మాట్లాడుతున్నా సరిగ్గా 11.30 గంటలకు ప్రశ్నోత్తరాలను ముగించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అవసరమైతే తన మైక్ కూడా కట్ చేయాలన్నారు. ఇక సమావేశాలు పొడిగించే అంశంపై మరోసారి సమావేశం కావాలని బీఏసీ భేటీలో నిర్ణయించారు. ఈ సమావేశాల్లో నోట్ల రద్దుపై చర్చించాలని కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు కోరగా.. ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సమావేశాల తొలిరోజైన శుక్రవారం నోట్ల రద్దు అంశంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండో రోజు మండలిలో.. శాసనసభతో పాటు శాసనమండలి బీఏసీ సమావేశం కూడా జరిగింది. అందులోనూ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మండలి సమావేశాల్లో తొలి రోజున రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై చర్చించాలని, శనివారం నోట్ల రద్దు అంశాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ తొలిరోజు అసెంబ్లీలో, రెండోరోజు మండలిలో నోట్ల రద్దుపై చర్చలో పాల్గొంటారు. అసెంబ్లీ బీఏసీ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత జానారెడ్డి, భట్టి , బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఎం నుంచి సున్నం రాజయ్య, టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. -
రచ్చ..రచ్చ
- మంత్రులతో ఢీ - శివాలెత్తిన ప్రతిపక్షాలు - డీఎంకే సభ్యుల గెంటివేత - ‘విద్యుత్’పై వాడివేడిగా వివాదం - అసెంబ్లీకి విజయకాంత్ - సంతకంతో సరి సాక్షి, చెన్నై: శీతాకాల సమావేశాల్లో రెండో రోజు శుక్రవారం విద్యుత్ కొనుగోళ్లపై వాడివేడిగా వివాదం సాగింది. మంత్రులతో ప్రతి పక్షాలు ఢీ కొట్టాయి. సభలో వాగ్యుద్ధాలు, విమర్శలు, ఆరోపణలు చోటుచేసుకున్నాయి. గందరగోళ వాతావరణం నెలకొనడంతో చివరకు డీఎంకే సభ్యుల్ని బయటకు గెంటేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఉదయం స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో సభ ఆరంభమైంది. ప్రతి పక్షాలన్నీ మూకుమ్మడిగా ఒకే అం శాన్ని ఎంపిక చేసుకుని ప్రభుత్వంపై దాడికి దిగాయి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీ గోల్మాల్ జరిగినట్టు, అధిక మొత్తం చెల్లించి విద్యుత్ సరఫరా చేయించుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది. డీఎండీకే, డీఎంకే, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, పీఎంకే, పుదియ తమిళగం, మనిదనేయ మక్కల్ కట్చి సభ్యుల ఆరోపణల్ని, విమర్శల్ని తిప్పికొట్టే క్రమంలో వివాదం ముదిరింది. రభస: డీఎండీకే సభ్యుడు పార్థసారథి, మోహన్‌రాజులు తమ ప్రసంగంలో విద్యుత్ కొనులు గోల్‌మాల్‌పై తీవ్రంగా స్పందించారు. ఇందుకు సమాధానం ఇచ్చే క్రమంలో డీఎండీకే అధినేత విజయకాంత్‌ను విద్యుత్ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్ పరోక్షంగా టార్గెట్ చేశారు. సభకు రానివాళ్లంతా లెక్కలు వేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది డీఎండీకే సభ్యుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. మంత్రితో కాసేపు వాగ్యుద్ధం చోటుచేసుకుంది. చివరకు స్పీకర్ ధనపాల్ జోక్యం చేసుకుని డీఎండీకే సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ తరపున గోపీనాథ్, విజయ ధరణిలు ప్రసంగిస్తూ, లెక్కలు తేల్చాల్సిందేనని పట్టుబట్టారు. ఈసమయంలో కనీస సభ్యులు కూడా లేని వాళ్లంతా లెక్కలు అడుగుతున్నారంటూ కాంగ్రెస్‌పై మంత్రి నత్తం దాడికి దిగడంతో ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయి. సీపీఎం, సీపీఐ, పీఎంకే, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం సభ్యులు మంత్రి తీరుపై తీవ్రంగా స్పందించారు. సమాధానాలు అడిగితే వెటకారాలు, వ్యంగ్యాస్త్రాలు సందిస్తారా..? అని మండి పడ్డాయి. మంత్రి వ్యాఖ్యల్ని సభా రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టాయి. ఇందుకు స్పీకర్ నిరాకరించడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. డీఎంకే గెంటివేత : డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ తన ప్రసంగంలో ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. తమ హయంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తుచేస్తూ, ఇప్పుడు పెంచింది కాకుండా, గ్రామాల్ని అంధకారంలోకి నెడుతున్నారని, పరిశ్రమలకు ఆంక్షలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీల్ని మళ్లీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్టాలిన్ వ్యాఖ్యానిస్తున్న తరుణంలో మంత్రి విశ్వనాథన్ జోక్యం చేసుకుని డీఎంకే పాలనపై, డీఎంకే అధినేత కరుణానిధిపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో సీఎం పన్నీరుసెల్వం సైతం జోక్యం చేసుకుని డీఎంకే సభ్యులపై ఎదురు దాడికి దిగారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వలర్మతి సైతం గొంతు కలిపారు. అధికార పక్షం తీవ్రంగా స్పందిస్తున్నా, స్పీకర్ వారించక పోవడాన్ని డీఎంకే సభ్యులు తీవ్రంగా పరిగణించాయి. స్పీకర్ పోడియూన్ని చుట్టుముట్టాయి. అధికార పక్షం సభ్యుల వ్యాఖ్యల్ని సభా రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టాయి. స్పీకర్ నిరాకరించడంతో ఆయనకు వ్యతిరేకంగా నినాదాల్ని హోరెత్తించారు. డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు మధ్య వాగ్యుద్ధం ముదరడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. చివరకు డీఎంకే సభ్యుల్ని బయటకు గెంటివేస్తూ మార్షల్స్‌కు స్పీకర్ ఆదేశించారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ డీఎంకే సభ్యులు బయటకు వచ్చేశారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దిగజారుడు వ్యాఖ్యల్ని అధికార పక్షం చేస్తున్నా, ఆయన సమర్థించుకోవడం శోచనీయమని వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ ఆహ్రం వ్యక్తం చేశారు. అనంతరం సభలో సీఎం పన్నీరు సెల్వం ప్రసంగించారు. తమిళ జాలర్ల సమస్య, కావేరి జలాల్ని అడ్డుకునే విధంగా కర్ణాటక వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా స్పందించారు. తమిళ జాలర్ల విషయంలో శ్రీలంక చర్యల్ని, కావేరి నదిపై డ్యాంల నిర్మాణానికి కర్ణాటక కుట్రల్ని ఖండిస్తూ తీర్మానాలు ప్రవేశ పెట్టారు. అసెంబ్లీకి విజయకాంత్: ప్రధాన ప్రతి పక్షనేత విజయకాంత్ అసెంబ్లీ ఆవరణలోకి అడుగు పెట్టారు. అయితే, సంతకంతో సరి పెట్టి మీడియాకు చిక్కకుండా ముందుకు కదిలారు. విజయకాంత్ వచ్చిన సమయంలో ఆ పార్టీ సభ్యులు అందరూ సమావేశ మందిరంలో వాడివేడి వివాదంలో ఉన్నారు. తమ నేత వచ్చి వెళ్లారన్న విషయం సభ ముగిసే వరకు ఆ పార్టీ సభ్యులకే తెలియకపోవడం గమనార్హం.