ప్రశ్నోత్తరాల సమయం పెంపు | time incresed in BAC Q&A | Sakshi
Sakshi News home page

ప్రశ్నోత్తరాల సమయం పెంపు

Published Fri, Dec 16 2016 3:46 AM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

ప్రశ్నోత్తరాల సమయం పెంపు

ప్రశ్నోత్తరాల సమయం పెంపు

గంటన్నర ప్రశ్నోత్తరాలు.. 30 నిమిషాల పాటే ‘జీరో అవర్‌’
ఈ నెల 30 వరకు సమావేశాలు
అవసరమైతే జనవరి 2 నుంచి మరో వారం పొడిగింపు
బీఏసీ భేటీలో నిర్ణయాలు ∙సమయ పాలన పాటిద్దామన్న సీఎం


సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ శీతాకాల సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించాలని, అవసరమైతే జనవరి 2వ తేదీ నుంచి మరో వారం పాటు పొడిగించాలని అసెంబ్లీ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) భేటీలో నిర్ణయించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలను నిర్వహించనున్నారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌ ఎస్‌.మధుసూధనాచారి అధ్యక్షతన ఆయన కార్యాలయంలో బీఏసీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కనీసం ఇరవై రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు కోరాయి.

అయితే ప్రభుత్వం మాత్రం ఈనెలాఖరు దాకా అంటే 12 రోజుల పాటు సమావేశాలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. చర్చించాల్సిన అంశాలు మిగిలిపోయాయని భావిస్తే జనవరి 2వ తేదీ నుంచి మరో వారం పాటు సమావేశాలు నిర్వహించేందుకు సానుకూలమని తెలిపింది. సమావేశాల్లో రోజూ ఉదయం తొలి గంటన్నర సమయాన్ని ప్రశ్నోత్తరాలకు కేటాయించారు. గతం కన్నా దీన్ని పెంచారు. మరో 30 నిమి షాలు జీరో అవర్, టీబ్రేక్‌గా నిర్ణయించారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పలు అంశాలపై చర్చ జరుపుతారు. ఇక  షెడ్యూల్‌ మేరకు 18, 24, 25 తేదీల్లో అసెంబ్లీకి సెలవుగా ప్రకటించారు. కేవలం 12 పనిదినాలు సరిపోవని, సమావేశాలు మరిన్ని రోజులు జరపాలని విపక్షాల నేతలు కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌... సమావేశాలు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

సమయ పాలన పాటిద్దాం..
ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ విషయంలో కచ్చితంగా సమయాన్ని పాటించాలని.. ఒకవేళ తాను ఆ సమయంలో మాట్లాడుతున్నా సరిగ్గా 11.30 గంటలకు ప్రశ్నోత్తరాలను ముగించాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అవసరమైతే తన మైక్‌ కూడా కట్‌ చేయాలన్నారు. ఇక సమావేశాలు పొడిగించే అంశంపై మరోసారి సమావేశం కావాలని బీఏసీ భేటీలో నిర్ణయించారు. ఈ సమావేశాల్లో నోట్ల రద్దుపై చర్చించాలని కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు కోరగా.. ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సమావేశాల తొలిరోజైన శుక్రవారం నోట్ల రద్దు అంశంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.

రెండో రోజు మండలిలో..
శాసనసభతో పాటు శాసనమండలి బీఏసీ సమావేశం కూడా జరిగింది. అందులోనూ సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. మండలి సమావేశాల్లో తొలి రోజున రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిపై చర్చించాలని, శనివారం నోట్ల రద్దు అంశాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ తొలిరోజు అసెంబ్లీలో, రెండోరోజు మండలిలో నోట్ల రద్దుపై చర్చలో పాల్గొంటారు. అసెంబ్లీ బీఏసీ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు,  ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్‌ నుంచి సీఎల్పీ నేత జానారెడ్డి,  భట్టి , బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్‌ ఒవైసీ, సీపీఎం నుంచి సున్నం రాజయ్య, టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement