సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశమై ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించనుంది.
అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. అంతకుముందు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించడానికి ఏడో తేదీ ఉదయం 8గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment