రచ్చ..రచ్చ
- మంత్రులతో ఢీ
- శివాలెత్తిన ప్రతిపక్షాలు
- డీఎంకే సభ్యుల గెంటివేత
- ‘విద్యుత్’పై వాడివేడిగా వివాదం
- అసెంబ్లీకి విజయకాంత్
- సంతకంతో సరి
సాక్షి, చెన్నై: శీతాకాల సమావేశాల్లో రెండో రోజు శుక్రవారం విద్యుత్ కొనుగోళ్లపై వాడివేడిగా వివాదం సాగింది. మంత్రులతో ప్రతి పక్షాలు ఢీ కొట్టాయి. సభలో వాగ్యుద్ధాలు, విమర్శలు, ఆరోపణలు చోటుచేసుకున్నాయి. గందరగోళ వాతావరణం నెలకొనడంతో చివరకు డీఎంకే సభ్యుల్ని బయటకు గెంటేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఉదయం స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో సభ ఆరంభమైంది. ప్రతి పక్షాలన్నీ మూకుమ్మడిగా ఒకే అం శాన్ని ఎంపిక చేసుకుని ప్రభుత్వంపై దాడికి దిగాయి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీ గోల్‌మాల్ జరిగినట్టు, అధిక మొత్తం చెల్లించి విద్యుత్ సరఫరా చేయించుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది. డీఎండీకే, డీఎంకే, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, పీఎంకే, పుదియ తమిళగం, మనిదనేయ మక్కల్ కట్చి సభ్యుల ఆరోపణల్ని, విమర్శల్ని తిప్పికొట్టే క్రమంలో వివాదం ముదిరింది.
రభస: డీఎండీకే సభ్యుడు పార్థసారథి, మోహన్‌రాజులు తమ ప్రసంగంలో విద్యుత్ కొనులు గోల్‌మాల్‌పై తీవ్రంగా స్పందించారు. ఇందుకు సమాధానం ఇచ్చే క్రమంలో డీఎండీకే అధినేత విజయకాంత్‌ను విద్యుత్ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్ పరోక్షంగా టార్గెట్ చేశారు. సభకు రానివాళ్లంతా లెక్కలు వేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది డీఎండీకే సభ్యుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. మంత్రితో కాసేపు వాగ్యుద్ధం చోటుచేసుకుంది. చివరకు స్పీకర్ ధనపాల్ జోక్యం చేసుకుని డీఎండీకే సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం కాంగ్రెస్ తరపున గోపీనాథ్, విజయ ధరణిలు ప్రసంగిస్తూ, లెక్కలు తేల్చాల్సిందేనని పట్టుబట్టారు. ఈసమయంలో కనీస సభ్యులు కూడా లేని వాళ్లంతా లెక్కలు అడుగుతున్నారంటూ కాంగ్రెస్‌పై మంత్రి నత్తం దాడికి దిగడంతో ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయి. సీపీఎం, సీపీఐ, పీఎంకే, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం సభ్యులు మంత్రి తీరుపై తీవ్రంగా స్పందించారు. సమాధానాలు అడిగితే వెటకారాలు, వ్యంగ్యాస్త్రాలు సందిస్తారా..? అని మండి పడ్డాయి. మంత్రి వ్యాఖ్యల్ని సభా రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టాయి. ఇందుకు స్పీకర్ నిరాకరించడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.
డీఎంకే గెంటివేత : డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ తన ప్రసంగంలో ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. తమ హయంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తుచేస్తూ, ఇప్పుడు పెంచింది కాకుండా, గ్రామాల్ని అంధకారంలోకి నెడుతున్నారని, పరిశ్రమలకు ఆంక్షలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీల్ని మళ్లీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్టాలిన్ వ్యాఖ్యానిస్తున్న తరుణంలో మంత్రి విశ్వనాథన్ జోక్యం చేసుకుని డీఎంకే పాలనపై, డీఎంకే అధినేత కరుణానిధిపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో సీఎం పన్నీరుసెల్వం సైతం జోక్యం చేసుకుని డీఎంకే సభ్యులపై ఎదురు దాడికి దిగారు.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వలర్మతి సైతం గొంతు కలిపారు. అధికార పక్షం తీవ్రంగా స్పందిస్తున్నా, స్పీకర్ వారించక పోవడాన్ని డీఎంకే సభ్యులు తీవ్రంగా పరిగణించాయి. స్పీకర్ పోడియూన్ని చుట్టుముట్టాయి. అధికార పక్షం సభ్యుల వ్యాఖ్యల్ని సభా రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టాయి. స్పీకర్ నిరాకరించడంతో ఆయనకు వ్యతిరేకంగా నినాదాల్ని హోరెత్తించారు. డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు మధ్య వాగ్యుద్ధం ముదరడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. చివరకు డీఎంకే సభ్యుల్ని బయటకు గెంటివేస్తూ మార్షల్స్‌కు స్పీకర్ ఆదేశించారు.
తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ డీఎంకే సభ్యులు బయటకు వచ్చేశారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దిగజారుడు వ్యాఖ్యల్ని అధికార పక్షం చేస్తున్నా, ఆయన సమర్థించుకోవడం శోచనీయమని వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ ఆహ్రం వ్యక్తం చేశారు. అనంతరం సభలో సీఎం పన్నీరు సెల్వం ప్రసంగించారు. తమిళ జాలర్ల సమస్య, కావేరి జలాల్ని అడ్డుకునే విధంగా కర్ణాటక వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా స్పందించారు. తమిళ జాలర్ల విషయంలో శ్రీలంక చర్యల్ని, కావేరి నదిపై డ్యాంల నిర్మాణానికి కర్ణాటక కుట్రల్ని ఖండిస్తూ తీర్మానాలు ప్రవేశ పెట్టారు.
అసెంబ్లీకి విజయకాంత్: ప్రధాన ప్రతి పక్షనేత విజయకాంత్ అసెంబ్లీ ఆవరణలోకి అడుగు పెట్టారు. అయితే, సంతకంతో సరి పెట్టి మీడియాకు చిక్కకుండా ముందుకు కదిలారు. విజయకాంత్ వచ్చిన సమయంలో ఆ పార్టీ సభ్యులు అందరూ సమావేశ మందిరంలో వాడివేడి వివాదంలో ఉన్నారు. తమ నేత వచ్చి వెళ్లారన్న విషయం సభ ముగిసే వరకు ఆ పార్టీ సభ్యులకే తెలియకపోవడం గమనార్హం.