DMK members
-
చెట్టు కింద సభ
పోటీ అసెంబ్లీ స్పీకర్‌గా దురై మురుగన్ చలోక్తులు, వ్యంగాస్త్రాలతో హాస్యపు జల్లులు నేటికి వాయిదా కోర్టుకు సస్పెన్షన్ వ్యవహారం చెన్నై: జార్జ్ కోట ఆవరణలో శుక్రవారం రెండు రకాల అసెంబ్లీ సమావేశం సాగింది. ఒకటి అన్నాడీఎంకే నేతృత్వంలో సభా మందిరంలో సాగితే, మరొకటి డీఎంకే నేతృత్వంలో ‘సభ’ చెట్టు కిందకు జరిగింది. పోటీ అసెంబ్లీ నినాదంతో సాగిన ఈ సభకు స్పీకర్‌గా డీఎంకే శాసన సభాపక్ష ఉపనేత దురైమురుగన్ వ్యవహరించారు. చెట్టు కింద చలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు వెరసి హాస్యపు జల్లుల్ని పండించాయి. ఇక, డీఎంకే సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం మద్రా సు హైకోర్టుకు చేరింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం వ్యవసాయ, పశుసంవర్థక శాఖల కేటాయింపులపై చర్చ జరిగింది. అన్నాడీఎంకే, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తోపాటు సస్పెండ్ వేటు పడని ఐదారుగురు డీఎంకే సభ్యులు మాత్రమే సభలోకి అనుమతించారు. సప్పెన్షన్‌కు గురైన ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌తో పాటుగా ఇతర డీఎంకే సభ్యులు అటు వైపుగా రానివ్వకుండా గట్టి చర్యలే తీసుకున్నా రు. సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలు రాగానే వారిని జార్జ్‌కోట పరిసరాల్లోనే అడ్డుకున్నారు. దీంతో జార్జ్‌కోటలోని ఓ అతి పెద్ద చెట్టు కింద మైక్‌లు, స్పీకర్లు, కుర్చీలు ప్రత్యక్షం అయ్యాయి. అన్నాడీఎంకే ప్రభుత్వానికి పోటీగా, తామూ ఇక్కడ అసెంబ్లీ నిర్వహించనున్నామని ప్రకటించి, చెట్టు కింద సభ వ్యవహారాలను సాగించే రీతిలో తమ నిరసనను డీఎంకే సభ్యులు వ్యక్తం చేశారు. పోటీ సభ : అసెంబ్లీ సమావేశ మందిరంలో స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో సభ ఆరంభం కాగానే, సపెన్షన్ రద్దుకు పట్టుబడుతూ కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ తోపాటు ఆరుగురు డీఎంకే సభ్యులు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో సభ నుంచి సదరు పార్టీల సభ్యులు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. అదే సమయంలో చెట్టు కింద పోటీ సభ ఆరంభం కాగానే... వారు కూడా ఈ సభలో పాల్గొన్నారు. ఈ పోటీ సభకు డీఎంకే శాసన సభా పక్ష నేత దురై మురుగన్ స్పీకర్‌గా వ్యవహరించారు. సభలో ప్రతి పక్షాల గళం నొక్కడం లక్ష్యంగా ధనపాల్ ఏవిధంగా వ్యవహరిస్తారో దానిని అనుకరిస్తూ దురై మురుగన్ చక్కటి నటనతో అందర్నీ మెప్పించారు. సభలో సభ్యులు ఏ విధంగా ప్రశ్నల్ని సంధిస్తారో, అందుకు మంత్రులు ఏ విధంగా అడ్డు పడుతారో, ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్ లేవగానే, అధికార పక్షం నుంచి వచ్చే అరుపులు కేకల్ని కళ్లకు గట్టినట్టు వివరించారు. అధ్యక్షా..అధ్యక్షా..అంటూ సాగిన ఈ పోటీ సభలో చలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు హోరెత్తడంతో చుట్టు చేరిన వారందరికీ పసందైన హాస్యపు విందు లభించినట్టు అయింది. డెంగీ తాండవం గురించి ఓ సభ్యుడు లేవదీసిన ప్రశ్నకు మంత్రిగా నటిస్తూ సమాధానం ఇచ్చిన డీఎంకే సభ్యుడు పొన్ముడి, చివరగా అమ్మ(జయలలిత)ను అడిగి, మందులు పంపిణీ చేస్తామన్నట్టుగా సెటైర్లతో ప్రసంగించారు. చివరకు సభను రేపటికి వాయిదా వేస్తూ పోటీ స్పీకర్ దురై మురుగన్ నిర్ణయించారు. ఎవర్నో కించ పరచాలనో, మరెవర్నో విమర్శించాలనో తాము ఈ పోటీ సభ ఏర్పాటు చేయలేదని ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక్కడ నిర్వహించిన పోటీ సభను అనేక చానళ్లు ప్రత్యక్ష ప్రసారం కూడా చేసినట్టుగా సమాచారం వచ్చిందన్నారు. దీన్ని బట్టి ఆలోచించండి, అసెంబ్లీ వ్యవహారాల్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా సభ్యులు ఏ మేరకు తప్పులు చేస్తున్నారో అన్నది అందరి దృష్టికి చేరుతుందని చెప్పారు. కోర్టుకు సస్పెన్షన్: డీఎంకే సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. డీఎంకే తరఫున న్యాయవాదులు మోహన్, ఎన్ఆర్ ఇళంగోవన్ ఉదయం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని బెంచ్ ముందు సప్పెన్షన్ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. అత్యవసర పిటిషన్‌గా విచారించాలని విన్నవించారు. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి ఆక్షేపణ వ్యక్తం చేశారు. షెడ్యూల్ మేరకు ఈ రోజున విచారించిన కేసుల వివరాలను ఇప్పటికే ప్రకటించి ఉన్నామని, పిటిషన్ దాఖలు చేయాలని, సోమవారం విచారణ చేపడుతామని సూచించారు. డీఎంకే సభ్యు ల సస్పెన్షన్‌ను విజయకాంత్ ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతి పక్షంలో ఉన్న తమ గళాన్ని నొక్కే విధంగా వ్యవహరించారని, ఇప్పుడేమో అదే బాటలో ఈ ప్రభుత్వం సాగుతున్నదని మండిపడ్డారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు కాకుండా, మరొకరికి అధికార పగ్గాలు అప్పగించి ఉంటే, పరిస్థితి ఇలా ఉండేదా..? అని పరోక్షంగా ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిర్ణయంలో మార్పు ప్రసక్తే లేదు : ఇక, అసెంబ్లీలో డీఎంకే సభ్యుల సస్పెన్షన్ వ్యవహారంపై స్పీకర్ ధనపాల్ స్పందిస్తూ, తన నిర్ణయంలో ఎలాంటి మార్పులు లేదు అని స్పష్టం చేశారు. ఇక, మంత్రులు తమ ప్రసంగాల్లో కేటాయింపుల గురించి, సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి మమా.. అనిపించారు. ఆ మేరకు మంత్రి సెల్లూరు రాజు తన ప్రసంగంలో అడిగిందీ, అడగనిదీ ఇచ్చే వ్యక్తి తమ అమ్మ అని, అందుకే తన శాఖ అభివృద్ధిలో దూసుకెళుతోందన్నారు. మంత్రి బాలకృష్ణారెడ్డి తన ప్రసంగంలో పశు సంవర్థక శాఖ కేటాయింపులను ప్రస్తావిస్తూ, తిరువళ్లూరు, తిరుప్పూర్‌లలో పశువులకు వచ్చే రోగాలపై పరిశోధనలకు కేంద్రాల ఏర్పాటు గురించి వివరించారు. అలాగే తమిళ సాహసక్రీడ జల్లికట్టు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక, మదురైలలోని గుంటలు, చెరువుల పరిరక్షణకు రూ. పది హేను లక్షలు ప్రకటించినట్టు మంత్రి ఎడపాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. -
89 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
-
89 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు బుధవారం రసాభాసగా మారాయి. అధికార, ప్రతిపక్షాల సభ్యులు పరస్పరం తీవ్ర ఆరోపనలు చేసుకుంటూ.. వాగ్వాదానికి దిగటంతో స్పీకర్ ధనపాల్.. 89 మంది డీఎంకే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వీరిపై వారం రోజులపాటు వేటు వేయడం గమనార్హం. అధికార ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రతిపక్షనేత స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు సభలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ సభను అడ్డుకున్నారు. అసహనానికి లోనైన స్పీకర్ ధనపాల్ డీఎంకే సభ్యులను వారం రోజులపాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షనేత స్టాలిన్‌ను మార్షల్లు హౌస్ నుంచి బయటకు ఎత్తుకొచ్చారు. అధికార ఎఐఏడీఎంకే ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని డీఎంకే ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. -
రచ్చ..రచ్చ
- మంత్రులతో ఢీ - శివాలెత్తిన ప్రతిపక్షాలు - డీఎంకే సభ్యుల గెంటివేత - ‘విద్యుత్’పై వాడివేడిగా వివాదం - అసెంబ్లీకి విజయకాంత్ - సంతకంతో సరి సాక్షి, చెన్నై: శీతాకాల సమావేశాల్లో రెండో రోజు శుక్రవారం విద్యుత్ కొనుగోళ్లపై వాడివేడిగా వివాదం సాగింది. మంత్రులతో ప్రతి పక్షాలు ఢీ కొట్టాయి. సభలో వాగ్యుద్ధాలు, విమర్శలు, ఆరోపణలు చోటుచేసుకున్నాయి. గందరగోళ వాతావరణం నెలకొనడంతో చివరకు డీఎంకే సభ్యుల్ని బయటకు గెంటేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఉదయం స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో సభ ఆరంభమైంది. ప్రతి పక్షాలన్నీ మూకుమ్మడిగా ఒకే అం శాన్ని ఎంపిక చేసుకుని ప్రభుత్వంపై దాడికి దిగాయి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీ గోల్మాల్ జరిగినట్టు, అధిక మొత్తం చెల్లించి విద్యుత్ సరఫరా చేయించుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది. డీఎండీకే, డీఎంకే, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, పీఎంకే, పుదియ తమిళగం, మనిదనేయ మక్కల్ కట్చి సభ్యుల ఆరోపణల్ని, విమర్శల్ని తిప్పికొట్టే క్రమంలో వివాదం ముదిరింది. రభస: డీఎండీకే సభ్యుడు పార్థసారథి, మోహన్‌రాజులు తమ ప్రసంగంలో విద్యుత్ కొనులు గోల్‌మాల్‌పై తీవ్రంగా స్పందించారు. ఇందుకు సమాధానం ఇచ్చే క్రమంలో డీఎండీకే అధినేత విజయకాంత్‌ను విద్యుత్ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్ పరోక్షంగా టార్గెట్ చేశారు. సభకు రానివాళ్లంతా లెక్కలు వేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది డీఎండీకే సభ్యుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. మంత్రితో కాసేపు వాగ్యుద్ధం చోటుచేసుకుంది. చివరకు స్పీకర్ ధనపాల్ జోక్యం చేసుకుని డీఎండీకే సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ తరపున గోపీనాథ్, విజయ ధరణిలు ప్రసంగిస్తూ, లెక్కలు తేల్చాల్సిందేనని పట్టుబట్టారు. ఈసమయంలో కనీస సభ్యులు కూడా లేని వాళ్లంతా లెక్కలు అడుగుతున్నారంటూ కాంగ్రెస్‌పై మంత్రి నత్తం దాడికి దిగడంతో ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయి. సీపీఎం, సీపీఐ, పీఎంకే, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం సభ్యులు మంత్రి తీరుపై తీవ్రంగా స్పందించారు. సమాధానాలు అడిగితే వెటకారాలు, వ్యంగ్యాస్త్రాలు సందిస్తారా..? అని మండి పడ్డాయి. మంత్రి వ్యాఖ్యల్ని సభా రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టాయి. ఇందుకు స్పీకర్ నిరాకరించడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. డీఎంకే గెంటివేత : డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ తన ప్రసంగంలో ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. తమ హయంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తుచేస్తూ, ఇప్పుడు పెంచింది కాకుండా, గ్రామాల్ని అంధకారంలోకి నెడుతున్నారని, పరిశ్రమలకు ఆంక్షలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీల్ని మళ్లీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్టాలిన్ వ్యాఖ్యానిస్తున్న తరుణంలో మంత్రి విశ్వనాథన్ జోక్యం చేసుకుని డీఎంకే పాలనపై, డీఎంకే అధినేత కరుణానిధిపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో సీఎం పన్నీరుసెల్వం సైతం జోక్యం చేసుకుని డీఎంకే సభ్యులపై ఎదురు దాడికి దిగారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వలర్మతి సైతం గొంతు కలిపారు. అధికార పక్షం తీవ్రంగా స్పందిస్తున్నా, స్పీకర్ వారించక పోవడాన్ని డీఎంకే సభ్యులు తీవ్రంగా పరిగణించాయి. స్పీకర్ పోడియూన్ని చుట్టుముట్టాయి. అధికార పక్షం సభ్యుల వ్యాఖ్యల్ని సభా రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టాయి. స్పీకర్ నిరాకరించడంతో ఆయనకు వ్యతిరేకంగా నినాదాల్ని హోరెత్తించారు. డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు మధ్య వాగ్యుద్ధం ముదరడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. చివరకు డీఎంకే సభ్యుల్ని బయటకు గెంటివేస్తూ మార్షల్స్‌కు స్పీకర్ ఆదేశించారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ డీఎంకే సభ్యులు బయటకు వచ్చేశారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దిగజారుడు వ్యాఖ్యల్ని అధికార పక్షం చేస్తున్నా, ఆయన సమర్థించుకోవడం శోచనీయమని వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ ఆహ్రం వ్యక్తం చేశారు. అనంతరం సభలో సీఎం పన్నీరు సెల్వం ప్రసంగించారు. తమిళ జాలర్ల సమస్య, కావేరి జలాల్ని అడ్డుకునే విధంగా కర్ణాటక వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా స్పందించారు. తమిళ జాలర్ల విషయంలో శ్రీలంక చర్యల్ని, కావేరి నదిపై డ్యాంల నిర్మాణానికి కర్ణాటక కుట్రల్ని ఖండిస్తూ తీర్మానాలు ప్రవేశ పెట్టారు. అసెంబ్లీకి విజయకాంత్: ప్రధాన ప్రతి పక్షనేత విజయకాంత్ అసెంబ్లీ ఆవరణలోకి అడుగు పెట్టారు. అయితే, సంతకంతో సరి పెట్టి మీడియాకు చిక్కకుండా ముందుకు కదిలారు. విజయకాంత్ వచ్చిన సమయంలో ఆ పార్టీ సభ్యులు అందరూ సమావేశ మందిరంలో వాడివేడి వివాదంలో ఉన్నారు. తమ నేత వచ్చి వెళ్లారన్న విషయం సభ ముగిసే వరకు ఆ పార్టీ సభ్యులకే తెలియకపోవడం గమనార్హం. -
విజయంపై వాదులాట
* ముల్లైపెరియార్పై సభలో చర్చ * విజయం మాదంటే మాదేనన్న పార్టీలు * ఇది తమిళుల విజయం: జయలలిత చెన్నై, సాక్షి ప్రతినిధి: ముల్లైపెరియార్ విజయంపై శుక్రవారం అసెంబ్లీ అట్టుడికి పోయింది. ఈ విజయం తమదంటే తమదేనని అధికార, ప్రతిపక్ష పార్టీలు రచ్చకెక్కాయి. ముందుగా ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతూ తమ ప్రభుత్వం చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత వల్లే ముల్లైపెరియార్ను సాధించుకున్నామన్నారు. ఇది పూర్తిగా తమిళ ప్రజల విజయమని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయదారుల కల ఫలించిందని తెలిపారు. తేనీ, మదురై, శివగంగై, రామనాథపురం, దిండుగల్లు జిల్లాల్లోని వేలాదిమంది రైతులకు లబ్ధిచేకూరుతుందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. 2002 వరకు చెన్నై హైకోర్టు పరిధిలో ఉన్న వివాదం ముల్లైపెరియార్ ఆ తరువాత సుప్రీం కోర్టుకు చేరి ఎట్టకేలకు చారిత్రాత్మక న్యాయం చేకూరిందని అన్నారు. 142 అడుగుల ఎత్తు పెంపుపై మే 7వ తేదీన సుప్రీంకోర్టు తీర్పుచెప్పినా కేరళ ప్రభుత్వం అమలుకు నిరాకరించి నేడు భంగపడిందని అన్నారు. అనంతరం డీఎంకే సభ్యులు దురైమురుగన్ మాట్లాడుతూ ముల్లైపెరియార్పై వచ్చిన తీర్పు అందరికీ ఆనందకరమేనన్నారు. అయితే ఈ విజయం ఏ ఒక్కరి సొంతం కాదని అన్నారు. ఇందుకు అన్నాడీఎంకే సభ్యులు అభ్యంతరం తెలుపుతూ కేకలు వేశారు. డీఎంకే అధినేత కరుణానిధి, తమిళ ప్రజలు, ముఖ్యంగా ఐదు జిల్లాల రైతులు ఆందోళనలు నిర్వహించిన ఫలితమే నేటి విజయమని అన్నారు. దురైమురుగన్ మాటలను అన్నాడీఎంకే నేతలు అడ్డుకోగా, స్పీకర్ సైతం వారినే సమర్థించడంతో నిరసనగా డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇంతలో డీఎండీకే సభ్యులు మోహన్‌రాజ్ మాట్లాడుతూ ముల్లైపెరియార్ సాధనలో తమ పార్టీ అధినేత కెప్టెన్ సాగించిన పోరాటం కూడా ఉందని అన్నారు. ఈ మాటలపై అన్నాడీఎంకే సభ్యులు పెద్దగా కేకలు వేస్తూ గట్టిగా నవ్వారు. దీన్ని అవమానంగా భావించిన డీఎం డీకే సభ్యులు అధికార పక్ష సభ్యులతో వాగ్వాదానికి దిగారు. వారిని శాంతిపజేసే ప్రయత్నంగా మంత్రి ఓ పన్నీర్ సెల్వం లేచినిలబడ్డారు. ముల్లైపెరియార్ కోసం కెప్టెన్ ఎలా పోరాడారని ఊహించుకుంటే తమ సభ్యులకు నవ్వువచ్చిం దని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలు మరిం త అవమానకరమని పేర్కొంటూ డీఎండీకే సభ్యు లు వాకౌట్ చేశారు. విచారణ అనంతరం చర్యలు : జయ కొడంగయ్యూర్ పోలీస్ స్టేషన్లో విచారణ ఖైదీ గోపాల్ మరణించిన సంఘటనపై విచారణ పూర్తయిన తరువాత నిందితులపై చర్యతీసుకుంటామని అసెంబ్లీలో సీఎం జయ హామీ ఇచ్చారు. ఈనెల 15వ తేదీ గోపాల్‌ను పోలీసులు తీసుకువచ్చారు. 16వ తేదీ ఉదయం కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా పోలీస్‌స్టేషన్ వాకిట్లోనే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
ధరలపై దద్దరిల్లిన అసెంబ్లీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం డీఎంకే సభ్యులు స్టాలిన్, దురైమురుగన్, డీఎండీకే సభ్యులు మోహన్‌రాజు తదితరులు ధరల పెరుగుదలపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. సభ్యులు కోరిన వివరాలను ఆయా శాఖలకు పంపామని, వారి నుంచి బదులురాగానే చర్చించేందుకు అనుమతిస్తామని స్పీకర్ పేర్కొన్నారు. దీంతో సదరు పార్టీల సభ్యులు ఒక్కసారిగా లేచి చర్చకు పట్టుబట్టారు. వారికి పోటీగా అధికార పార్టీ సభ్యులతోపాటు మంత్రులు సైతం లేచి నిలబడి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. ఎంతకూ పరిస్థితి సద్దుమణగక పోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ జరగకుండా ప్రతిపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ వారిని బయటకు పంపేయూలని మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో మార్షల్స్ సభ్యులను బయటకు తరలించారు. ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నారంటూ ఇతర ప్రతిపక్షాలు సైతం సభ నుంచి వాకౌట్ చేశాయి. మరికొద్ది సేపటి తర్వాత మళ్లీ అసెంబ్లీ సమావేశానికి హాజరైన డీఎండీకే సభ్యులు మోహన్‌రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. డోనేషన్ల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సమయంలో విజయకాంత్ నడుపుతున్న ఆండాళ్ అళగర్ ఇంజినీరింగ్ కాలేజీల మాటేమిటని అన్నాడీఎంకే సభ్యులు కేకలు వేశారు. తమ కాలేజీలో డొనేషన్ల వసూలు చేయడం లేదని, ప్రభుత్వం సూచించిన ఫీజులనే వసూలు చేస్తున్నామని విజయకాంత్ బదులిచ్చారు. ఇందుకు విద్యాశాఖా మంత్రి పళనియప్పన్ బదులిస్తూ ప్రభుత్వ కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదుల అందడంలేదన్నారు. ఏదో ఒకటి విమర్శించాలని మాట్లాడవద్దని హితవు పలికారు. తమ కాలేజీలో ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నాడీఎంకే సభ్యులు మళ్లీ అరవగా, మీ పార్టీ వాళ్లు ఇంజినీరింగ్ కాలేజీలు నడుపుతున్నారు, వాళ్లను అడిగి తెలుసుకోండని డీఎండీకే సభ్యులు బదులిచ్చారు. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే సభ్యురాలు రాజ్యలక్ష్మి మాటలపై అసెంబ్లీలో దుమారం రేగింది. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన సభ్యురాలు డీఎంకే పార్టీపైనా, ఆ పార్టీ అధినేత కరుణానిధి, వారి కుటుంబ సభ్యులపైనా విమర్శలు చేస్తున్నారంటూ డీఎంకే సభ్యులు దురైమురుగన్ దుయ్యబట్టారు. సభ్యులంతా లేచి నిలబడి రాజ్యలక్ష్మి మాటలకు నిరసన తెలిపారు. ఆమెకు మద్దతుగా అధికార సభ్యులు లేచి నిలబడ్డారు. దీంతో స్టాలిన్ సహా సభ్యులు వాకౌట్ చేశారు. సిటీ బస్సులు వెళ్లలేని రోడ్లలో ప్రవేశపెట్టిన మినీ బస్సుల వల్ల రూ.158 కోట్ల ఆదాయం వచ్చిందని రవాణాశాఖ మంత్రి సెంథిల్ బాలాజీ చెప్పారు. ఒక్కో మినీ బస్సులో రోజుకు 775 మంది ప్రయాణిస్తున్నారని వివరించారు. దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లోగా రేషన్ కార్డులను అందజేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కామరాజ్ చెప్పారు.